శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 106)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట ఆరవ సర్గ
రాముడు చేసిన వాదనను శ్రద్ధగా విన్నాడు భరతుడు. మరలా తనదైన శైలిలో తన వాదనను వినిపించసాగాడు.“ఓ రామా! నీవు జితేంద్రియుడవు. నీకు సుఖమువస్తే సంతోషము, దు:ఖమువస్తే బాధా రెండూ లేవు. నీలాంటి వారు ఈ లోకంలో అరుదుగా ఉంటారు. మేమంతా సామాన్యులము. సుఖదు:ఖములను అనుభవిస్తూ ఉంటాము. జీవించి ఉన్నా, మరణించినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆ వ్యక్తి పట్ల సమభావనతో ఉండే వ్యక్తికి దుఃఖము కానీ సుఖము కానీ కలగవు. రెండూ సమభావనలో ఉంటాయి. ఆ గుణాలు నీలో ఉన్నాయి. కానీ నీవు బాధపడుతున్నావు. తండ్రికి ఇచ్చిన మాటను ఎక్కడ తప్పుతానో అని బాధపడుతున్నావు. నీ లాంటివాడికి అలా బాధపడటం యుక్తంకాదు.
నీవు రాజ్యం చేసినా, అరణ్యంలో ఉన్న ఒకటే కదా. అందుకని అయోధ్యకు వచ్చి రాజ్యం చేయి. తప్పేముంది. నీవు అన్నిటికీ అతీతుడవు కదా! నీవు రాజ్యం తీసుకుంటే నేను బాధ పడను. ఎందుకంటే నేను దేశాంతరములో ఉన్నప్పుడు నా తల్లి చేసిన అనాలోచిత కార్యము వలన ఇదంతా సంభవించింది. నా తల్లి చేసిన పని నాకు అసలు ఇష్టం లేదు. దానికి నా అంగీకారమూ లేదు. నా తల్లి చేసినది రాజద్రోహము. దానికి మరణదండనే సరి అయిన శిక్ష. కాని ఇక్కడ నిందితురాలు నా తల్లి కాబట్టి నేను ఆ దండన అమలు చేయలేక పోతున్నాను. నేను పవిత్రమైన ఇక్ష్వాకు వంశములో పుట్టాను. ధర్మానికి ప్రతిరూపమైన దశరథమహారాజుకు పుత్రుడుగా జన్మించాను. అటువంటి నేను అధర్మమునకు పాల్పడతాను అని నీవు ఎలా అనుకుంటావు.? ఈ అధర్మములో నా తండ్రికి కూడా భాగం ఉంది. ఆయన నా తల్లి మాటను వినకపోతే ఇంత అనర్థము వాటిల్లదు.
ఆయన నా తండ్రి, పైగా వృద్ధుడు, ఈ లోకం విడిచి వెళ్లాడు కాబట్టి సభలో ఆయనను నిందించడం భావ్యం కాదు. ఎందుకంటే ధర్మము తెలిసిన వాడు ఎవరైనా ఒక స్త్రీకి ప్రియం చేకూర్చడానికి మరొకరికి అప్రియం చేస్తాడా! కాని నా తండ్రి ధర్మం తప్పి తన భార్యకు వరములు ఇచ్చే మిషమీద నీకు అపకారము చేసాడు.
రామా! వినాశకాలే విపరీత బుద్ధీ అని వినాశకాలము దాపురించబట్టి దశరథునికి ఇటువంటి విపరీత బుద్ధి పుట్టింది. తండ్రి మంచి కార్యము చేస్తే దానిని పుత్రుడు శ్లాఘించాలి, అభినందించాలి. కాని తండ్రి అధర్మానికి పాల్పడితే, దానిని పుత్రుడు ఖండించాలి. ఆ అధర్మము వలన కలిగిన తప్పును సరిదిద్దాలి. నా తండ్రి దశరథుడు చేసిన అధర్మము వలన అయోధ్య అరాచకమయింది. ఆ తప్పును నీవు సరిదిద్ది, నీ రాజ్యము నీవు పరిపాలించు. అందరికీ ఆనందము చేకూర్చు. తండ్రి చేసిన అధర్మమును చక్కదిద్దిన సుపుత్రుడిగా ప్రఖ్యాతిచెందు.
ఎందుకంటే నా తండ్రి చేసిన అధర్మమును, పాపపు పనిని లోకమంతా ఖండిస్తూ ఉంది. ఆ అధర్మమును సరిదిద్దడం నీ చేతిలో ఉంది. నా తల్లి కైక కూడా దీనికి తన అంగీకారము తెలిపింది. ఆమెను కూడా ఈ అధర్మకార్యము నుండి రక్షించు. పైగా క్షత్రియునకు స్వధర్మపాలనను మించిన ధర్మము మరొకటి లేదు. క్షత్రియ ధర్మము రాజ్యమును పాలించుట. నీవు నీ ధర్మమును వదిలి జటలు కట్టుకొని అరణ్యములలో ఉండటం భావ్యమా! అయోధ్య ఎక్కడా? అరణ్యము ఎక్కడ? రాజ కిరీటము ఎక్కడ? జటాజూటములు ఎక్కడ? రెండింటికీ దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా ఉంది కదా! నీకు తెలియనిది ఏమున్నది.
పైగా రాజ్యపాలన క్షత్రియధర్మము. అది తక్షణ ఫలములను ఇస్తుంది. వనవాస వృత్తి కాలాంతరమున మోక్షరూపంలో ఫలిస్తుంది. క్షత్రియుడైన వాడు రజోగుణప్రధానుడు కానీ తమోగుణ ప్రధానుడు కాదు కదా! కాబట్టి రామా! ఈ తాపస ధర్మము నీకు తగినది కాదు. నీకు క్షత్రియ ధర్మమే ఉచితము.
రామా! బ్రహ్మచర్య,గృహస్థ,వానప్రస్థ,సన్యాస ఆశ్రమములు ఒకదాని తరువాత ఒకటి ఆచరించాలి. అందులోనూ గృహస్థాశ్రమము శ్రేష్టమైనది అని పెద్దలు చెబుతారుకదా! మరి నీవు ఆ పెద్దల మాటలను పెడచెవిని పెట్టి గృహస్థాశ్రమమును విడిచిపెట్టడం ధర్మమా!
రామా! మరొక మాట. నేనునీ కన్నా చిన్నవాడను. నా కన్నా పెద్దవాడు బతికి ఉండగా, చిన్నవాడు రాజ్యపాలన చెయ్యడం ధర్మం కాదు కదా! పైగా నాకు నీ తోడిదే జీవితము. నీవు లేనిది నేను లేను. అటువంటిది నీవు లేకుండా నేను రాజ్యపాలన చెయ్యడం అసంభవము.
రామా! ఈ రాజ్యము పిత్రార్జితము. అది కుటుంబములో జ్యేష్టునికే చెందుతుంది కానీ కనిష్ఠునికి కాదు. కాబట్టి జ్యేష్టుడి వైన నీవు రాజ్యపాలన చెయ్యడం ఉత్తమోత్తమము. నువ్వు ఉండగా నీకన్నా చిన్నవాడినైన నేను రాజ్యమును పాలించడం అధమాధమము. అందుకనే మన కులగురువు వసిష్ఠులవారిని, మంత్రులను, సేనాధిపతులను పురముఖ్యులను మన తల్లులను వెంటబెట్టుకొని వచ్చాను.
ఆలస్యం అమృతం విషం. అందరి సమక్షంలో, ఇక్కడే ఇప్పుడే, వేదోక్తముగా నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేస్తాను. దయతో అంగీకరించు. ఇక్కడే రాజ్యాభిషిక్తుడవై సకల రాజలాంఛనములతో అయోధ్యలో ప్రవేశించు. సింహాసనము అధిష్ఠించు. రాజమకుటము ధరించు. రాజ్యపాలన గావించు. ఇది మా అందిరికీ సమ్మతము.
దీని వలన పితృఋణము తీర్చినట్టు అవుతుంది. తండ్రిగారు చేసిన తప్పును సరిదిద్దినట్టు అవుతుంది. ఈ పాపపు కార్యము వలన నా తల్లికి తండ్రికి అంటిన పాపమును తొలగించు. వారిని పాపవిముక్తులను చెయ్యి. నీకు శిరస్సువంచి పాదములు అంటి అర్థిస్తున్నాను. నా మీద, అయోధ్య మీద దయచూపించు. నేను ఇంతచెప్పినా కాదని నీవు అరణ్యములలో ఉండటానికి నిశ్చయించుకుంటే. నేనుకూడా నీతో అరణ్యవాసము చేస్తాను. నా తల్లి చేసిన పాపమునకు నేను ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. అయోధ్యకు వెళ్లనే వెళ్లను. ఇదే నా కృతనిశ్చయము." అని పలికి భరతుడు చేతులు జోడించి రాముని ముందు నిలబడ్డాడు.
అక్కడ ఉన్న వారు కూడా శాయశక్తులా రాముని తిరిగి అయోధ్యకు రమ్మని ప్రార్థించారు. కాని రామునిలో చలనం లేదు. తన పట్టు వీడలేదు. అయోధ్యకు రావడానికి ఒప్పుకోలేదు. అక్కడ ఉన్న వారికి రాముని మనోనిశ్చయానికి అభినందించాలో లేక రాముడు అయోధ్యకు రాక పోవడానికి విచారించాలో తెలియక కొట్టుమిట్టాడు తున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment