శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 105)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట ఐదవ సర్గ
అంతా మౌనంగా కూర్చుని ఉన్నారు. ఆ నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ భరతుడు లేచాడు. రాముని వంక చూచి ఇలా అన్నాడు.
“రామా! నా తల్లి కైక మాటను మన్నించి నాకు రాజ్యమును వదిలి, నీవు అరణ్యములకు వచ్చావు. ఇప్పుడు అయోధ్యా రాజ్యము నాది. నా రాజ్యమును నా ఇష్టమువచ్చిన వారికి ఇచ్చే అధికారము నాకు ఉంది. నాది అయిన ఈ రాజ్యమును తిరిగి నీకు ఇస్తున్నాను. దీనిని స్వీకరించి అయోధ్యను పాలించు. ఎందుకంటే దశరథుని తరువాత ఈ రాజ్యమును పాలించే శక్తి, అర్హత నీకు మాత్రమే ఉన్నాయి. నాకు ఆ అర్హత ఎంత మాత్రము లేదు. ఎందుకంటే గాడిద గుర్రము ఒకటి కావు
కదా!
ఎవని మీద అందరూ ఆధారపడి బతుకుతారో, అతని జీవనము చాలా గొప్పది. కాని ఎవరైతే ఇతరుల మీద ఆధారపడి జీవిస్తాడో అతని జీవితము దుర్భరము. ఈ అయోధ్య ప్రజలు, మేము అంతా నీ మీద ఆధారపడి ఉన్నాము. నీ పాలనకొరకు ఎదురు చూస్తున్నాము. అలాంటిది నీవు ఈ అరణ్యములో ఒకరి మీద ఆధారపడి బతకడం దుర్భరంకాదా! ఒకడు ఒక వృక్షమును నాటి, పెంచి పోషించాడు. అది పెద్ద మాను అయింది కానీ ఫలములు ఇవ్వడం లేదు. ఆ చెట్టు ఎందుకూ ఉపయోగపడదు కదా! అలాగే తండ్రి దశరథుడు నిన్ను ఈ అయోధ్యకు మహారాజుగా తీర్చిదిద్దాడు. సకల విద్యలు నేర్పించాడు. వేదాలు, ధర్మశాస్త్రములు చదివించాడు. కాని ఈనాడు నువ్వు రాజ్యమును పాలించను అంటున్నావు. నీవు నేర్చుకున్న విద్యలు అన్నీ ఫలితం లేకుండా పోవలసిందేనా! దశరథుని శ్రమ అంతా వృధా కావలసిందేనా!
నీవు అయోధ్యను పాలిస్తుంటే ఆనందించని వారు ఉండరు. రాజ్యములో ప్రజలు కానీ అంతఃపురములోని జనులు కానీ అంతా సుఖసంతోషాలలో ఓలలాడుతారు. అందరికీ ఆమోద యోగ్యుడవైన నీవు రాజ్యమును పాలించకుండా అడవులలో తిరగడం ధర్మమా! కాబట్టి నీవు వెంటనే అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవు కావాలని సకలజనులకోరిక." అని ముగించాడు భరతుడు.
రాముడు లేచి భరతుని వీపు తట్టి ఇలా పలికాడు. " భరతా! ఈ చరాచర జగత్తులో తాను అనుకున్న పని అనుకున్నట్టు చేసే స్వాతంత్య్రము ఎవరికీ లేదు. అంతా విధిచేతిలో కీలుబొమ్మలమే. విధి ఎలా ఆడిస్తే అలా ఆడవలసినదే! ప్రతివానికీ ఉత్థానపతనాలు తప్పవు. ఎంత ధనము సంపాదించినా ఆధనము తుదకు అతనిని వదిలిపోతుంది. అలాగే ఎంత ఉన్నత స్థితికి చేరినా, చివరకు పతనం తప్పదు. పుట్టినవాడు గిట్టడం ఎలాగో, పుట్టుకతో వచ్చిన మానవ సంబంధాలు చావుతో సమసిపోతాయి. ఏవీ శాశ్వతము కాదు. పండిన పండు రాలడం ఎంత నిజమో, పుట్టిన మనిషి చావడం అంతే నిజం. కాని అంతా శాశ్వతం అనుకోవడం అవివేకము.
మనం గృహములు ఎంత ధృడంగా కట్టుకున్నా, కాలక్రమేణా అవి కూలిపోవడం తథ్యం. అలాగే ఈ శరీరాన్ని ఎంత ప్రేమగా పెంచి పోషించినా, తుదకు అది భూగర్భంలో కలిసిపోవలసిందే!
నిన్నటి దినం మరలా రాదు. సముద్రంలో కలిసిన నదీజలములు తిరిగి వెనక్కురావు కదా! ఒక్కొక్క రోజు గడుస్తుంటే, మానవుల జీవితంలో ఒక్కొక్క రోజు తరిగిపోతుంటుంది. చావుకు దగ్గర అవుతుంటాడు. మానవుడు భూమి మీద ఉన్న అంతరిక్షంలో ఉన్నా, మృత్యువు అతని వెన్నంటి ఉంటుంది. కాలం తీరగానే కబళిస్తుంది. కాబట్టి మానవుడు సదా మృత్యువును వెంటబెట్టుకొని తిరుగుతుంటాడు.
కాబట్టి భరతా! నీగురించి ఆలోచించుకో. నాగురించి ఎందుకు ఆలోచిస్తావు. ఎందుకంటే మన మానవ సంబంధాలు క్షణికములు. ఒక నదిలో రెండు దుంగలు కొట్టుకొని వస్తుంటాయి., అవి కలిసి కొంతదూరం ప్రయాణం చేస్తాయి. మరలా అవి విడిపోయి దేని దారిన అవి వెళతాయి. అలాగే భార్యలు, పుత్రులు, బంధువులు, ధనము, అన్నీ కొంతకాలము కలిసి ఉంటాయి.తరువాత
విడిపోతుంటాయి. దాని కోసరం ఇప్పుడు బాధపడటం ఎందుకు?
విడిపోతుంటాయి. దాని కోసరం ఇప్పుడు బాధపడటం ఎందుకు?
లోకములో ఏ ప్రాణికూడా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించలేదు. జనన మరణములు వారి చేతిలో లేవు. వాటి గురించి చింతించడం నిష్ప్రయోజనము.
నేను ఇంతకు ముందు చెప్పినట్టు, మన జీవితము మన చేతిలో లేదు. ఏది ప్రాప్తమో అది అనుభవించవలసిందే. ఇప్పుడు నీకు రాజ్యాధికారము సంక్రమించింది. దానిని అనుభవించడమే నీ బాధ్యత. మన పూర్వులు అదే చేసారు. నువ్వుకూడా అదే చెయ్యి. మన పితృపితామహులు పోయిన మార్గముననే మనమూ నడుద్దాము. నిన్నటి రోజు మరలా రాదు. ప్రవహించిన నీరు తిరిగి రాదు. వయస్సు కూడా అంతే.
కాబట్టి నీ జీవితమును ధర్మమార్గములో నడిపించు. ప్రజలను పాలించి వారికి సుఖమైన పాలనను అందించు. దానికి మన తండ్రి దశరథుడే నిదర్శనము. ఆయన ఎన్నో యజ్ఞములు, యాగములు చేసి, ప్రజలను చక్కగా పాలించి, దానధర్మములు చేసి, చివరకు స్వర్గము చేరుకున్నాడు.
మనము మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆయన పరిపూర్ణజీవితము అనుభవించి స్వర్గము చేరుకున్నాడు. ఆయనను గురించి దు:ఖించడం మాను. కర్తవ్యమును విస్మరించకు.
మనము మన తండ్రి గారి గురించి చింతించవలసిన అవసరము లేదు. ఆయన పరిపూర్ణజీవితము అనుభవించి స్వర్గము చేరుకున్నాడు. ఆయనను గురించి దు:ఖించడం మాను. కర్తవ్యమును విస్మరించకు.
అయోధ్యను పాలించమని దశరథుడు నిన్ను ఆదేశించాడు. ఆయన ఆదేశములను పాటించు. అయోధ్యను పాలించు. ఎందుకుంటే, తండ్రిగారు నన్ను వనములకు వెళ్లమని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారము నేను అడవులకు వచ్చానుకదా! అలాగే నీవు కూడా తండ్రి గారి ఆదేశమును పాటించి రాజ్యమును పాలించు. అదే నీ కర్తవ్యము.
ఇప్పుడు నేను నీ మాట విని అయోధ్యకు వస్తే తండ్రిగారి ఆదేశమును ధిక్కరించిన వాడిని అవుతాను. అది అధర్మము. అలాగే నీవు రాజ్యపాలన చెయ్యపోతే నీవుకూడా తండ్రిగారి ఆజ్ఞను ధిక్కరించినట్టే. అది కూడా అధర్మమే.
కాబట్టి నీవు అధర్మము చెయ్యకు. నన్ను అధర్మము వైపుకు లాగకు. తండ్రి గారి ఆదేశము ప్రకారము నీవు అయోధ్యనుపాలించు. నేను అరణ్యమునుపాలించెదను. అదే మన ధర్మము. అప్పుడే మనకు ఇహములో కానీ పరములో కానీ సుఖము లభిస్తుంది.
కాబట్టి మనము ఇద్దరమూ మన తండ్రి గారి ఆజ్ఞను పాటించి ఆయన పేరు నిలబెడదాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరుద్దాము." అని పలికాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment