శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 104)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట నాల్గవ సర్గ
దశరథుని భార్యలు అయిన కౌసల్య, సుమిత్ర, కైకేయీ కులగురువు వసిష్ఠుని వెంట రాముని ఆశ్రమానికి వస్తున్నారు. వారు మందాకినీ నది ఒడ్డున నడుస్తున్నారు. అక్కడి వారు, రాముడు, సీత స్నానమునకు ఉపయోగించు నదీతీరమును చూపించారు. కౌసల్యకు దుఃఖము ఆగలేదు. తన వెంట ఉన్న సుమిత్రను చూచి ఇలా అంది.“చూచావా సుమిత్రా! రాజభోగములు అనుభవించవలసిన నీ కుమారుడు లక్ష్మణుడు, నా కుమారుడు రాముడు, నా కోడలు సీత, అయోధ్యనుండి వెడలగొట్టబడి, దిక్కులేని వారి మాదిరి ఒంటరిగా ఈ నదీతీరంలో స్నానం చేస్తున్నారు. సుమిత్రా! నీ కుమారుడు ఇక్కడి నుండి రాముని కొరకు, సీతకొరకు జలములు తీసుకొనిపోవడం నీచకార్యము అని అనుకోకు. తన అన్నకు సేవ చేసే నిమిత్తం చేసే ఏ కార్యమైనా అది దోషము కాదు. అయినా ఇంక ఎన్నాళ్లు? భరతుడు ఇప్పటికే రాముని అయోధ్యకు వచ్చి తన రాజ్యము స్వీకరించమని ప్రార్థిస్తూ ఉంటాడు. రామలక్ష్మణుల కష్టాలు గట్టెక్కుతాయి. లక్ష్మణునికి అన్నగారి దాస్యము తప్పుతుంది.” అని అన్నది కౌలస్య
ఇంతలో వారు రాముడు తన తండ్రికి పిండప్రదానము చేసిన చోటికి చేరుకున్నారు. దక్షిణ ముఖంగా పరచిన దర్భలు, వాటి మీద పెట్టబడిన పిండి తో చేసిన పిండములు చూచారు.
ఇంతలో వారు రాముడు తన తండ్రికి పిండప్రదానము చేసిన చోటికి చేరుకున్నారు. దక్షిణ ముఖంగా పరచిన దర్భలు, వాటి మీద పెట్టబడిన పిండి తో చేసిన పిండములు చూచారు.
“చూడండి. రాముడు ఇక్కడే తన తండ్రికి పిండప్రదానం చేసాడు. ఆ పిండములు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ప్రతిరోజూ పంచభక్ష్య పరమాన్నములతో భోజనము చేసే దశరథుడు ఈ పిండితో చేసిన పిండములను ఎలా ఆరగించగలడో. ఏమో! అయోధ్యాపతి అయిన రాముడు తన తండ్రికి పిండితో పిండప్రదానము చెయ్యడం చాలా బాధాకరంగా ఉంది. ఈ లోకంలో పురుషులు ఏమి తింటారో దానిని పితృదేవతలకు సమర్పిస్తారట. అంటే రాముడు ఈ పిండి తిని బతుకుతున్నాడా! రాజాధిరాజైన రామునికి ఎంత దుర్గతిపట్టింది. ఇది చూచి కూడా నా హృదయం ముక్కలు కాలేదంటే నా హృదయం రాయి కంటే కఠినమై ఉండాలి.” అని శోకించింది కౌసల్య.
మిగిలిన భార్యలు ఆమెను ఓదార్చారు. ఈప్రకారంగా రాముని గురించి తలచుకుంటూ దు:ఖపడుతూ అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల వద్ద నేల మీద కూర్చుని ఉన్న రాముని చూడగానే దశరథుని భార్యలకు దుఃఖము ఆగలేదు. భోరున ఏడ్చారు. వారిని చూడగానే రాముడు వారి వద్దకు వెళ్లాడు. తన తల్లులందరికీ పాదనమస్కారము చేసాడు. వారందరూ రాముని వీపునిమిరి, తలను నిమిరి ఆశీర్వదించారు. రాముని వెంట లక్ష్మణుడుకూడా తల్లులందరి పాదములు తాకి నమస్కరించాడు. వారందరూ లక్ష్మణుని శిరస్సునిమిరి ఆశీర్వదించారు. తరువాత సీత తన అత్తగార్లు అందరికీ పాద నమస్కారము చేసి వారి ఆశీర్వచనములు స్వీకరించింది.
సీతను చూచిన కౌసల్యకు దుఃఖము ఆగలేదు. సీతను తన కూతురును కౌగలించుకున్నట్టు గట్టిగా కౌగలించుకుంది.
“జనకమహారాజు కూతురు, దశరధ మహారాజు కోడలు, రామునిభార్య, నిర్మానుష్యంగా ఉన్న ఈ అరణ్యములలో ఎన్ని కష్టములు పడుతూ ఉందోకదా! అమ్మా సీతా! వాడి పోయిన కమలము వలె ఉన్న నీ ముఖం చూస్తుంటే నాకు దుఃఖం ఆగడం లేదమ్మా!" అనిసీతను పట్టుకొని ఏడిచింది.
వీరు ఇలా దు:ఖపడుతూ ఉంటే, రాముడు వసిష్ఠునికి పాదాభివందనం చేసాడు. ఆయన ఆశీర్వాదము తీసుకున్నాడు. తరువాత అందరూ విశ్రాంతిగా కూర్చున్నారు. వసిష్ఠుడు రాముని పక్కన కూర్చున్నాడు. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు మరొకపక్క కూర్చున్నారు. మంత్రులు, దండనాధులు, పురప్రముఖులు వారి వారి అర్హతకుతగ్గట్టు కూర్చున్నారు. అందరూ భరతుడు రామునితో ఏం మాట్లాడతాడో అని ఆతురతగా ఎదురుచూస్తున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట నాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment