శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 103)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట మూడవ సర్గ
భరతుడు చెప్పిన తండ్రి మరణ వార్తను వినగానే రాముడు కిందపడి మూర్ఛపోయాడు. మొదలు నరికిన చెట్టులా కిందపడిపోయిన రాముని చూచి సీత ఏడుస్తూ అతని దగ్గరగా వచ్చింది. రాముని మీద నీళ్లు చల్లి అతనికి సేదతీర్చింది. రాముడు మూర్ఛనుండి తేరుకున్నాడు. దీనంగా కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. రాముడు తన తండ్రి మరణ వార్త విని భరతునితో ఇలా అన్నాడు.“భరతా! నా తండ్రే లేనపుడు నాకు అయోధ్యతో ఏమి పని! దశరథుడులేని అయోధ్యను నేను మాత్రము ఎలా పరిపాలింపగలను. నా మీద దు:ఖముతో మరణించిన నా తండ్రికి నేను అంతిమ సంస్కారములు చేయడానికి కూడా నోచుకోలేదు కదా! నేను ఆయనకు చెడ పుట్టాను. నేను పెద్దకొడుకుగా ఉండి ఆయనకు ఏమి చేయగలిగాను. పెద్దకొడుకుగా కనీసం నా విధులను కూడా నేను నిర్వర్తించలేకపోయాను.
ఓ భరతా! శత్రుఘ్నా! మీరు ఇద్దరూ పుణ్యాత్ములు. తండ్రి గారికి అంతిమ సంస్కారములు చేయగలిగారు. భరతా! ఇప్పుడే చెబుతున్నాను. ఇప్పుడే కాదు, ఈ పధ్నాలుగు సంవత్సరముల వనవాసము తరువాత కూడా, దశరథుడు లేని అయోధ్యలో నేను అడుగుపెట్టను. దశరథుడులేని అయోధ్యను ఊహించలేను. ఎందుకంటే, వనవాసానంతరము నేను రాజ్యాధికారము చేపడితే నాకు దిశానిర్దేశము ఎవరు చేస్తారు. నాకు మంచీ చెడూ ఎవరు చెబుతారు. నేను అయోధ్యలో ఉన్నప్పుడు నేను చేసిన మంచి పనులను మెచ్చుకుంటూ తండ్రిగారు నాకు ఎన్నో మంచి మాటలు చెప్పేవారు. ఇప్పుడు నాకు అలా ఎవరు చెబుతారు.” అని శోకిస్తున్నాడు రాముడు.
సీతను చూచి రాముడు ఇలా అన్నాడు. "సీతా! నీకు పితృసమానులు, నీ మామగారు మరణించారు. లక్ష్మణుడు పితృహీనుడయ్యాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు?” అని
విలపిస్తున్నాడు రాముడు. రాముడు ఇలా ఏడుస్తుంటే మిగిలిన తమ్ముళ్లు కూడా ఏడుస్తున్నారు.
కొంచెం సేపటికి లక్ష్మణుడు తేరుకొని అన్న రాముని చూచి “అన్నయ్యా! మనప్రస్తుత కర్తవ్యము తండ్రి గారికి జలతర్పణములు ఇవ్వాలి." అని గుర్తుచేసాడు.
పితృసమానుడైన మామగారు పరమపదించారు అన్నవార్త విన్న సీత దు:ఖంతో కుమిలిపోయింది. కళ్లనిండా నీళ్లుకమ్ముకున్నాయి. ఏడుస్తున్న సీతను చూచాడు రాముడు. ఆమెను ఓదార్చాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
“లక్ష్మణా!మనము తండ్రిగారికి పిండప్రదానముచేయవలెను. నీవుపోయి పిండి, బదరీఫలములు సిద్ధం చేయి.” అని అన్నాడు.
ముందు సీత నడుస్తుంటే వెనక లక్ష్మణుడు నడుస్తుంటే రాముడు వారి వెనక మందాకినీ నదీ తీరానికి వెళ్లాడు. వారి వెంట సుమంత్రుడు వెళ్లాడు. అందరూ మందాకినీ నదీ తీరానికి
చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!"అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.
చేరుకున్నారు. సుమంత్రుడు తాను ముందుగా నదిలోకిదిగి, తరువాత రామలక్ష్మణులను, సీతను వారి చేతులుపట్టుకొని నదిలోకి దింపాడు. అందరూ స్నానములు చేసారు. రాముడు దోసిలి నిండా నీళ్లు తీసుకొని దక్షిణము వైపుతిరిగి “ఓ తండ్రీ! నీకు జలమును విడుస్తున్నాము. పితృలోకములో ఉన్న నీకు ఈజలము అక్షయంగా ఉపతిష్ఠమగును గాక!"అని ఆ జలమును నదిలో విడిచి పెట్టాడు.
తరువాత రామలక్ష్మణులు మందాకినీ నది ఒడ్డున దశరథునకు పిండితో పిండప్రదానము చేసారు. నేల మీద దర్భలు పరిచారు. ఆ దర్భల మీద బదరీఫలములతో కూడిన పిండిని పిండములుగా చేసి పెట్టారు. "ఓ తండ్రీ! మేమే ప్రతిదినమూ తినే ఆహారమునే నీకు పిండములుగా సమర్పించుకుంటున్నాము. స్వీకరించు. ఈ లోకంలో పురుషులు దేనిని తింటారో దానినే పితృలోకంలో ఉన్నపితృదేవతలు కూడా తింటారుకదా!" అని పలికాడు రాముడు.
పిండప్రదానకార్యక్రమము ముగిసిన తరువాత అందరూ పర్ణశాలకు చేరుకున్నారు. తరువాత కూడా అన్నదమ్ములు తండ్రిమరణానికి బాధపడుతూనే ఉన్నారు. అన్నదమ్ములు చేస్తున్న రోదన ధ్వనులు దూరంగా ఉన్న సైనికులకు వినబడ్డాయి. 'భరతుడు రాముని చేరుకున్నాడు, అందరూ దశరథుని మరణానికి దు:ఖిస్తున్నారు' అని వారు తెలుసుకున్నారు. వారంతా ఎప్పుడెప్పుడు రాముని చూద్దామా అని ఆతురతగా ఉన్నారు. అందరూ రాముని పర్ణశాల వైపుకు ప్రయాణం అయ్యారు.
అందరూ రాముని పర్ణశాలకు చేరుకున్నారు. పర్ణశాల ముందు నేల మీద కూర్చొని ఉన్న రాముని చూచారు. రామునికి ఆ గతి పట్టించిన కైకను, మంధరను నోటికొచ్చినట్టు తిడుతూ ఏడుస్తున్నారు. ఆ పరిస్థితిలో ఉన్న రాముని చూచి వారికి కన్నీళ్లు ఆగలేదు. రాముడు అందరినీ చూచాడు. పురుషులను, స్త్రీలను తన కన్న తల్లి తండ్రులవలె కౌగలించుకొని వారి ఓదార్పువచనములను
విన్నాడు. కొంతమంది రామునికి నమస్కరించారు. కొంత మంది రాముని పరామర్శించారు. రాముడు అందరినీ వారి వారి అర్హతలను బట్టి గౌరవించాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment