శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 102)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట రెండవ సర్గ
రాముని మాటలు శ్రద్ధగా విన్నాడు భరతుడు. తిరిగి రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను ధర్మహీనుడను. నాకు రాజధర్మము గురించి ఏమితెలుసు. నాకు తెలిసిందల్లా ఒకటే. అది మన కులధర్మము. మనవంశాచారము. ఇక్ష్వాకు వంశములో ఇంతవరకూ పెద్దవాడే రాజ్యభారము వహించాడు. పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు కాలేదు. కాకూడదు. ఇప్పుడు నీవు మన వంశములో పెద్దవాడవు. నేను నీ కన్నా చిన్నవాడను. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడవు కమ్ము. అదే నాకోరిక.రామా! మామూలు ప్రజల దృష్టిలో రాజుకూడా ఒక సాధారణ మానవుడే. కానీ, రాజు అంటే సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. రాజుకాదగ్గ లక్షణాలే నీకే ఉన్నాయి. నాలో ఎంత మాత్రమూ లేవు. కాబట్టి అయోధ్యకు రాజుకాదగ్గ వాడవు నీవే. ఇంక అసలు విషయానికి వద్దాము. నేను కేకయ దేశములో ఉండగా. నీవు అరణ్యములకు వెళ్లగా, మన తండ్రిగారు దశరథమహారాజుగారు స్వర్గస్థులయ్యారు. నేను శత్రుఘ్నుడు కలిసి తండ్రి గారికి అంత్యక్రియలు చేసాము. ఇప్పుడు నీవు తండ్రిగారికి జలతర్పణములు విడువ వలెను. తండ్రిగారికి జ్యేష్టుడవు, ప్రియపుత్రుడవు నీవు. కాబట్టి నీవు విడిచే జలతర్పణములు మన తండ్రిగారికి అత్యంత ప్రియమైనవి. ఎందుకంటే నేను విన్నదాని ప్రకారము దశరథుడు తన అవసాన కాలములో నిన్నే తలచుకుంటూ, నీమీద దిగులు చేత మరణించాడు. కాబట్టి నీవు జలతర్పణములు విడిస్తేగాని తండ్రిగారి ఆత్మ శాంతించదు.” అని అన్నాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment