శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నూట ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 101)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నూట ఒకటవ సర్గ
భరతుని రాజ్యమునకు సంబంధించిన విషయములు అన్నీ తెలుసుకున్న తరువాత, రాముడు మరలా అసలు విషయానికి వచ్చాడు. “భరతా! ఇంతకూ నీవు ఈ ముని వేషము ఎందుకు ధరించావు. ఈ అడవులకు ఎందుకు వచ్చావు. దశరథుల వారు నిన్ను అయోధ్యకు రాజ్యాభిషిక్తుని చేసారు కదా. హాయిగా రాజ్యపాలన చేయక, ఈ వనవాసము ఎందుకయ్యా నీకు?" అని అడిగాడు.దానికి భరతుడు రామునికి ఇలా సమాధానము చెప్పాడు. “రామా! నీకు ఒక అప్రియమైన విషయము చెప్పాలి. నీవు నాకు రాజ్యమును వదిలి అడవులకు రాగానే ఆ దుఃఖము తట్టుకోలేక మన తండ్రి దశరథుడు స్వర్గస్థుడయ్యాడు. అప్పుడు నేను కూడా దగ్గర లేను. నా తల్లి ప్రేరణతో ఈ మహాపాపము చేసాడు మన తండ్రి దశరథుడు. కాని నా తల్లికి ఫలితము దక్కలేదు. ఇటు రాజ్యమూ లేదు. సరికదా.. అటు వైధవ్యము మాత్రము ప్రాప్తించింది. నీవు ఉండగా నేను రాజ్యాభిషిక్తుడను అవడం సాధ్యం కాదు. నీవు మాట ఇచ్చిన తండ్రి ఇప్పుడు లేడు. ఆ మాటకు ఇపుడు విలువ లేదు. కాబట్టి నీవు వనవాసము విడిచి అయోధ్యకు వచ్చి, రాజ్యపాలన చేయుము. అదే నేను కోరేది. మన తల్లులు మువ్వురూ ఇదే మాట మీద ఉన్నారు. నిన్ను మరలా అయోధ్య తీసుకుపోవడానికి వారందరూ వచ్చారు.
రామా! మనవంశాచారము నీకు తెలుసు. మన వంశములో పెద్దవాడికే రాజ్యాభిషేకము జరుగుతుంది. ఇది అనువంశికంగా వస్తున్న ఆచారము. కాబట్టి నీవు రాజ్యాభిషిక్తుడివి కావడం ధర్మమే కాని అధర్మము కాదు. నీ రాక కొరకు అయోధ్య ఎదురుచూస్తూ ఉంది. నేను, శత్రుఘ్నుడు, మన మంత్రులు అందరూ శిరస్సువంచి నీకు నమస్కారము చేస్తున్నాము. మామాట మన్నించు. వంశాచారమును మన్నించు. పెద్దల ఆచారములను గౌరవించు." అనిచెప్పి చేతులు కట్టుకొని నిలబడ్డాడు భరతుడు.
రాముడు భరతుని కౌగలించుకొని అనునయించాడు. “ఓ భరతా! కులీనుడు, సత్త్వసంపన్నుడు, తేజస్వి, ధృడనిశ్చయము కలవాడు ఎవరైనా తుచ్ఛమైన రాజ్యము కోసరం మాట తప్పుతాడా! నేనూ అంతే. భరతా! నీవు చిన్నవాడవు. నీవు అనవసరంగా నీ తల్లిని దూషిస్తున్నావు. తప్పు. నీ మీద ఉన్న ప్రేమతో అలా చేసింది కానీ వేరుకాదు. పెద్దలకు భార్యను, పుత్రులను, శాసించే అధికారము ఉంది. ఆ అధికారం తోనే దశరథుడు నాకు నార చీరలు కట్టబెట్టి అరణ్యానికి పంపాడు. నేను ఆయన ఆదేశము పాటించాలి. నేను నా తండ్రి యందు ఎలాంటి గౌరవము చూపిస్తున్నానో, నీవు నీ తల్లి పట్ల అంత గౌరవము చూపించు. నీ తల్లి తనస్వార్థము కోసరం ఇదంతా చేయలేదు. కేవలం నీ కోసరమే చేసింది. నీ తల్లి కూడా నా తల్లితో సమానము. నా తల్లి కైక, నా తండ్రి దశరథుడు నన్ను అడవులకు వెళ్లమన్నారు. నేను అడవులకు వచ్చాను. ఇంతకన్నా వేరు విధంగా నేను ఎలా చేయగలను? తల్లి తండ్రుల మాట నాకు శిరోధార్యము కదా!
నా తరువాత రాజ్యమునకు అర్హుడవు నీవు. అందుకని నీవు రాజ్యము చేయవలెను. నేను అరణ్యములలో ఉండవలెను. నా తండ్రి దశరథుడు పదిమంది ఎదుట ఈవిధంగా భాగపంపకములు చేసాడు. నీకు రాజ్యము ఇచ్చాడు. నాకు 14 ఏళ్లు వనవాసము ఇచ్చాడు. దీనిని మనము పాటించాలి. ఇప్పుడు మన తండ్రి స్వర్గస్థుడయ్యాడు. ఆయన లేడు కదా అని మనకు ఆయన మాటను వమ్ముచేయలేము కదా!కాబట్టి నేను రాజ్యాభిషిక్తుని కాలేను." అని అన్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నూట ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment