శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పన్నెండవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 12)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

పన్నెండవ సర్గ

రాముని ఆదేశానుసారము లక్ష్మణుడు అగస్త్యముని ఆశ్రమంలోకి వెళ్లాడు. లోపల అగస్త్యముని శిష్యుని వద్దకు పోయి “అయోధ్యాధీశుడు, దశరధ మహారాజు కుమారుడు, రాముడు, తన భార్య సీతతో సహా అగస్యులవారి దర్శనానికి వచ్చి వేచి ఉన్నారని మనవి చెయ్యి." అని అన్నాడు.

ఆ శిష్యుడు లక్ష్మణుని చూచి "మీరుఎవరు?” అని అడిగాడు.

“నేను రాముని తమ్ముడను. లక్ష్మణుడను, సదా రాముని హితము కోరేవాడిని. రాముడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారము అరణ్యవాసము చేయుచున్నాడు. ఆయన భార్య సీత, నేను ఆయనను అనుసరించుచున్నాము. " అని అన్నాడు.

“మంచిది. మీరు ఇక్కడే ఉండండి. నేను మహర్షులవారికి మీ గురించి చెప్పి వస్తాను." అని లోపలకు వెళ్లాడు.

అగ్ని గృహములో ఉన్న అగస్త్యుని వద్దకు పోయి రాముడు, లక్ష్మణుడు, సీత రాక గురించి తెలిపాడు. ఆ మాటలు వినిన అగస్యుడు ఎంతో సంతోషించాడు.

“ఎన్నోనాళ్ల నుండి నేను రాముని దర్శనము కొరకు ఎదురుచూస్తున్నాను. ఇంతకాలానికి రాముడు నన్నే వెదుకు కొనుచూ నా వద్దకు వచ్చాడు. నాకు చాలా ఆనందంగా ఉంది. నీవు వెంటనే పోయి రాముని, సీతను, లక్ష్మణుని సగౌరవంగా నా వద్దకు తీసుకొని రా. అయినా రాముని రాక గురించి నాకు చెప్పవలెనా. రాముని అంతసేపు బయట నిలబెట్టవలెనా. వెంటనే నావద్దకు తీసుకొని రావలదా! " అని శిష్యునితో అన్నాడు.

వెంటనే ఆ శిష్యుడు పరుగు పరుగున రాముని వద్దకు పోయి "రాముడు ఎక్కడ? రాముడు ఎక్కడ? రామునికి ఎలాంటి అనుమతి అవసరం లేదు. వెంటనే లోపలకు రావచ్చును."అని అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు ఆ శిష్యునకు ద్వారము వద్ద ఉన్న రాముని సీతను చూపించాడు. వెంటనే ఆ శిష్యుడు రాముని గౌరవించి, సత్కరించి అగస్త్యుని వద్దకు తీసుకొని వెళ్లాడు. రాముడు లోపలకు రావడం చూచి అగస్త్యుడు రామునికి ఎదురు వచ్చాడు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు.
"లక్ష్మణా! అటు చూడు! అగ్ని వలె వెలుగుతున్న అగస్త్యమహర్షి మనకోసం వస్తున్నాడు.” అని అన్నాడు.

రాముడు అగస్త్యుని పాదాల మీద పడి నమస్కరించాడు. తరువాత సీత, లక్ష్మణుడు కూడా మహామునికి పాద నమస్కారము చేసారు. అగస్త్యుడు రామునికి అర్ఘ్యము, పాద్యము ఇచ్చాడు. ఒక ఆసనము చూపించాడు. తరువాత అగ్నిహోత్రము ముగించుకొని, అతిథిపూజ చేసి రామలక్ష్మణులకు సీతకు ఆహారము ఇచ్చాడు. భోజన కార్యక్రమము అయిన తరువాత రాముడు అగస్త్యుని పక్కనే ఒదిగి కూర్చున్నాడు.

అగస్త్యుడు రామునితో ఇలా అన్నాడు.
“రామా! ముందుగా అగ్నిహోత్రము చేసి, అతిధులను పూజించి, తరువాత భోజనము చేయవలెను. అలాచేయని వాడు నరకానికి పోతాడు.

రామా! నీవు క్షత్రియుడవు. అయోధ్యకు రాజువు. ధర్మము తెలిసినవాడవు. అందరి చేతా గౌరవింప తగినవాడవు. అలాంటి నీవు ఈ రోజు మాకు అతిధిగా వచ్చావు. మాకు చాలా సంతోషంగా ఉంది.

రామా! నీకు కొన్ని ఆయుధములను ఇస్తాను. ఇది విష్ణుదేవుని ధనుస్సు. ఇది విశ్వకర్మ నిర్మించాడు. ఇది అక్షయతూణీరము. ఈ తూణీరములో బాణములు ఎప్పటికీ నిండుగా ఉంటాయి. ఈ ఖడ్గము దేవేంద్రుడు ఇచ్చాడు. ఇవన్నీ దివ్యమైన ఆయుధములు. ఇవన్నీ విష్ణువు, ఇంద్రుడు దేవాసుర యుద్ధములో ఉపయోగించి విజయలక్ష్మిని వరించారు. ఈ ఆయుధములను నీవు స్వీకరించు. నీకు జయం కలుగుతుంది.” అని పలికి అగస్త్యుడు దివ్యమైన ధనుర్బాణములను, ఖడ్గమును రామునికి ఇచ్చాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పన్నెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)