శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదమూడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 13)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

పదమూడవ సర్గ

అగస్యుడు రామునికి ఆయుధములను ఇచ్చిన తరువాత ఇలా అన్నాడు.

“ఓ రామా! మీరు నన్ను చూడటానికి ఇంత దూరము వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా దూరము ప్రయాణము చేసి వచ్చారు. సుకుమారి అయిన సీత బాగా అలసి పోయినట్టు కనపడుతూ ఉంది. తండ్రి ఆదేశము ప్రకారము వనములకు వచ్చిన నీతో పాటు అనుసరించి వచ్చిన నీభార్య సీత ఇప్పటికి ఎవ్వరూ చేయని మహత్తరమైన పని చేసింది. కాబట్టి ఆమె కష్టపడకుండా చూడవలసిన బాధ్యత నీది.

సాధారణంగా స్త్రీలు సుఖములలో భర్తను వదలకుండా అంటిపెట్టుకొని ఉంటారు. కష్టకాలములో భర్తను వదిలివేస్తారు. ఈ సృష్టి మొదలైనప్పటి నుండి అది స్త్రీ నైజము. ఇంకా స్త్రీల గురించి చెప్పాలంటే వారు మెరుపుల మాదిరి చంచల స్వభావులు. వాడియైన కత్తి మాదిరి చాలా తీక్షణంగా ఉంటారు. గరుడుని మాదిరి వేగంగా ఆలోచిస్తారు.

కానీ నీ భార్య సీతలో ఈ దోషములు ఏవీ లేవు. సీత శాంత స్వభావురాలు. ఉత్తమ పతివ్రత. అందుకే నిన్ను అనుసరించి అడవులకు వచ్చి నీతోపాటు కష్టములు పడుతూ ఉంది. ఓ రామా! నీవు, సీత,
లక్ష్మణుడు ఎక్కడ ఉంటారో అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.” అని వారిని శ్లాఘించాడు అగస్త్యుడు.

అగస్యుడు పలికిన మాటలు విన్న రాముడు వినయంగా ఇలా అన్నాడు. “నా గురించి, నా భార్య గురించి, నా తమ్ముని గురించి తమరు నాలుగు మంచి మాటలు చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అనుగ్రహానికి పాత్రుడను అయ్యాను. నేను ఈ అడవిలో ఒక పర్ణశాల నిర్మించుకొని అక్కడ నా వనవాస కాలమును గడపదలచుకున్నాను. దానికి అనువైన ప్రదేశమును మీరు సూచించండి." అని అడిగాడు రాముడు.

“రామా! ఇక్కడికి రెండు యోజనముల దూరంలో పంచవటి అనే ప్రదేశము ఉంది. అక్కడ ఫలములు, కందమూలములు, నిర్మలమైన జలము సమృద్ధిగా లభిస్తుంది. నీవు పంచవటిలో ఒక ఆశ్రమమును నిర్మించుకొని అక్కడ నీ వనవాసకాలమును గడపవచ్చును. నీకు ఇప్పటికే వనవాసకాలము చాలావరకు గడిచిపోయింది. కొద్దికాలము మాత్రమే మిగిలి ఉంది. ఆ కొద్ది కాలము కూడా పూర్తి చేసి, నీవు నీ తండ్రిమాట నిలబెట్టు. ఆయనను తరింపజెయ్యి.

అసలు నిన్ను ఇక్కడే ఉందామనుకున్నాను. కాని ఒంటరిగా ఉండాలి అన్న నీ మనసులో మాట తెలుసుకొని నిన్ను పంచవటికి పంపుతున్నాను. పంచవటి ఇక్కడకు ఎంతో దూరంలో లేదు. కాబట్టి నీవు ఇక్కడ ఉన్నట్టే పంచవటిలో ఉండవచ్చును. పంచవటి సమీపములో గోదావరీ నది ప్రవహిస్తూ ఉంది. అక్కడ జనసంచారము అంతగా ఉండదు. నీవు ప్రశాంతముగా అక్కడ ఉండవచ్చును.

అటు చూడు. అక్కడ ఒక మధూక చెట్ల వనము కనపడుతూ ఉంది. ఆ మధూక వనమునకు ఉత్తరంగా వెళ్లండి. మీరు ఒక ఎత్తు అయిన ప్రదేశము చేరుకుంటారు. అక్కడి నుండి చూస్తే మీకు పంచవటి కనపిస్తూ ఉంటుంది.” అని పంచవటికి పోవు మార్గము చెప్పాడు అగస్త్యుడు.
రామలక్ష్మణులు, సీత అగస్త్యునికి నమస్కరించి ఆయన వద్ద అనుజ్ఞ తీసుకున్నారు. అక్కడి నుండి పంచవటికి బయలుదేరారు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదమూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)