శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునాల్గవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 14)

శ్రీమద్రామాయణము

అరణ్యకాండము

పదునాల్గవ సర్గ

రాముడు సీత, లక్ష్మణులతో సహా పంచవటికి వెళుతున్నాడు. దారిలో వారికి ఒక వటవృక్షము మీద కూర్చుని ఉన్న పెద్ద ఆకారము కల పక్షి కనపడింది. ఆ అరణ్యములో కామరూపులైన రాక్షసులు
నివసిస్తుంటారు అని విని ఉన్నాడు. అందుకని ఆ పక్షిని రాక్షసుడిగా తలచాడు రాముడు.

“నీవు ఎవరవు? ఇక్కడ ఎందుకు ఉన్నావు?" అని అడిగాడు

“రామా! నేను నీకు తెలియకపోయినా నీవు నాకు తెలుసు. నీవు దశరథుని కుమారుడైన రాముడివి. నీ తండ్రి దశరథుడు నాకు మంచి మిత్రుడు." అని అన్నాడు.

తన తండ్రికి మిత్రుడైన వాడు తనకు గౌరవింపతగ్గవాడు అని అనుకొన్నాడు రాముడు. ఆ పక్షికి అభివాదము చేసాడు. ఆ పక్షి రామునితో ఇలా పలికింది.

“రామా! నీకు పూర్వము ఎంతమంది ప్రజాపతులున్నారో వారి గురించి చెబుతాను శ్రద్ధగా విను.
ప్రజాపతులలో ప్రథముడు కర్దముడు. అతని తరువాతి వాడు విక్రీతుడు. ఆ తరువాత శేషుడు. అతని తరువాత సంశ్రయుడు, స్థాణువు, మరీచి, అత్రి, క్రతువు, పులస్త్యుడు, అంగిరసుడు, ప్రచేతసుడు, పులహుడు, దక్షుడు, వివస్వంతుడు వరుసగా ప్రజాపతులయ్యారు. ఆఖరి వాడు కశ్యప ప్రజాపతి. ఆయనకు అరిష్టనేమి అనే పేరుకూడా ఉంది. నీకు చెప్పానే దక్షుడు అని, ఆయనకు అరవై మంది కుమార్తెలు. వారిలో అదితి, దితి, దనువు, కాళిక, తామ్ర, క్రోధవశ,మను, అనల అనే ఎనిమింది కన్యలను కశ్యపప్రజాపతి పెళ్లిచేసుకున్నాడు.

కశ్యపుడు తన భార్యలతో “మీరందరూ నాతో సమానమైన ముల్లోకములను పోషించగలిగే పుత్రులను ప్రసవించండి.” అని కోరాడు. వారిలో అదితి, దితి, కాళిక అనే వారు మాత్రము కశ్యపుని మాట మన్నించారు. మిగిలినవారు ఆయన మాటమీద మనసు పెట్టలేదు.

కశ్యపుని కోరిక ప్రకారము అదితికి పన్నెండు మంది ఆదిత్యులు (ద్వాదశాదిత్యులు), ఎనిమిది మంది వసువులను (అష్టవసువులు. అందులో ఆఖరి వసువే శాపకారణంగా గంగాదేవికి భీష్ముడిగా పుట్టాడు. మహాభారత కధకు మూలపురుషుడు అయ్యాడు), పదకొండు మంది రుద్రులు, ఇద్దరు అశ్వినులు, మొత్తం ముప్పది ముగ్గురు దేవతలుపుట్టారు.

కశ్యపునకు దితి యందు దైత్యులు జన్మించారు. వారందరూ ఈ భూమికి అధిపతులయ్యారు. పూర్వము ఈ భూమి అంతా దైత్యుల అధీనంలో ఉండేది. 

కశ్యపునకు దనువు అనే భార్య ద్వారా హయగ్రీవుడు అనే పుత్రుడు కలిగాడు. కాళి అనే భార్యకు నరకుడు, కాలకుడు అనే పుత్రులు జన్మించారు. తామ్ర అనే భార్య క్రౌంచి, భాసి,శ్యేని,ధృతరాష్ట్రి, శుకి అనే ఆడపిల్లలకు జన్మనిచ్చింది. (ఇవి అన్నీ పక్షిజాతుల పేర్లు).ఆ తరువాత క్రౌంచికి ఉలూకములు (గుడ్లగూబలు), భాసి అనేకూతురు భాస పక్షులకు జన్మనిచ్చింది. శ్యేని అనే కూతురుకు శ్యేనములు (డేగలు) పుట్టాయి. ధృతరాష్ట్రికి రకరకాలైన హంస జాతులు, చక్రవాక పక్షులు, జన్మించాయి. ఈ ప్రకారంగా పక్షిజాతి అభివృద్ధిచెందింది. శుకి అనే కూతురుకు నత అనే కుమారుడు కలిగాడు. నతకు వినత అనే కూతురు పుట్టింది. 

కశ్యపునకు క్రోధవశ అనే భార్య ద్వారా మృగి, మృగమంద, హరి, భద్రమద, మాతంగి, శార్దూలి, శ్వేత, సురభి, సురస, కద్రువ అనే పదిమింది పుత్రికలు జన్మించారు. (ఇవన్నీ మృగజాతుల పేర్లు). మృగి సంతానము లేళ్లు, దుప్పులు, జింకలు. ఎలుగుబంట్లు, చామరీ మృగములు ఇంకా ఇతర మృగములు మృగమంద సంతానము. హరికి సింహములు, వానరములు పుట్టాయి. (అందుకే సింహమునకు కోతులకు, హరి అనే పేరు వచ్చింది.)

భద్రమదకు ఇరావతి అనే కూతురు పుట్టింది. ఇరావతికి ఐరావతము పుట్టింది. మాతంగికి ఏనుగుజాతి జన్మించింది. శార్దూలి అనే కూతురికి పెద్దపులులు, కొండముచ్చులు జన్మించాయి. శ్వేతకు దిగ్గజములు జన్మించాయి. సురభి రోహిణి, గంధర్వి అనే ఇద్దరు కూతుళ్లకు జన్మనిచ్చింది. రోహిణికి గోవులు, గోసంతతి, గంధర్వికి అశ్వజాతి, సురసకు రెండు తలలు అంతకన్నా ఎక్కువ తలల పాములు, కద్రువకు ఒక్కొక్క పడగ ఉన్న పాములు జన్మించాయి.

మనువుకు మానవులు జన్మించారు. ఆ మానవులు వారి వారి గుణముల బట్టీ చేసే వృత్తుల బట్టీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా విభజింపబడ్డారు.

అనల మంచి మంచి ఫలములను ఇచ్చు వృక్షజాతికి జన్మనిచ్చింది.

రామా! నీకు పక్షిజాతులకు జన్మనిచ్చిన వినత, నాగులకు జన్మనిచ్చిన కద్రువ గురించి చెబుతాను విను. వినత శుకికి మనుమరాలు. కద్రువ సురసకు సోదరి. కద్రువకు ఆదిశేషుడు కుమారుడుగా పుట్టాడు. వినతకు గరుడుడు, అరుణుడు అనే పుత్రులు జన్మించారు (గరుడుడు విష్ణువుకు వాహనము అయ్యాడు. అరుణుడుకి కాళ్లు లేకపోవడం వల్ల సూర్యుని రథమునకు సారథి అయ్యాడు).

ఆ అరుణుడికి ఇద్దరు కుమారులు. నేను, సంపాతి. నా పేరు జటాయువు. నేను శ్యేని జాతికి చెందిన వాడిని. ఇదీ నా జన్మ వృత్తాంతము.

(పూర్వకాలపు కవులు కొత్త కొత్త విషయాలను ఆయాపాత్రల ద్వారా మనకు తెలియజేస్తారు. వాల్మీకి ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు మనకు చెప్పాడు. ఈభూమి మీద మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఎలా పుట్టాయి, వాటి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అనే విషయాలను వివరంగా చెప్పాడు.)

రామా! ఈ వనమంతా నాకు బాగాతెలుసు. నీకు ఇష్టం అయితే నేను నీకు ఏదైనా సాయం కావలిస్తే చేస్తాను. నీకు సహాయకుడుగా ఉంటాను. ఈ అడవిలో అనేక క్రూర మృగములు, నరమాంసభక్షకులైన రాక్షసులు ఉన్నారు. నీవు కోరితే మీరు ఇంట లేనపుడు సీత రక్షణ బాధ్యతను నేను వహిస్తాను.” అని అన్నాడు.

జటాయువు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు రాముడు. జటాయువును చూచి తన తండ్రిని గుర్తుకు తెచ్చుకున్నాడు. తండ్రికి మారుగా జటాయువును పూజించాడు రాముడు. తరువాత జటాయువు పంచవటికి మార్గం చూపించాడు. జటాయువుతో కలిసి రాముడు, లక్ష్మణుడు సీతతో సహా పంచవటికి వెళ్లాడు.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునాల్గవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)