శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదునైదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 15)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
పదునైదవ సర్గ
రాముడు, లక్ష్మణుడు, సీత, జటాయువు అందరూ కలిసి పంచవటి ని చేరుకున్నారు.రాముడు లక్ష్మణుని చూచి "లక్ష్మణా! ఇక్కడ పూలు చక్కగా పుష్పించి ఉన్నాయి. ఫలవృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. నేల చదునుగా ఉంది. పక్కనే సెల ఏళ్లు ఉన్నాయి. అగస్త్యుడు చెప్పిన పంచవటి ఇదే కావచ్చును. ఇక్కడ మనము పర్ణశాల నిర్మించు కొనుటకు అనవైన ప్రదేశము చూడుము. లక్ష్మణా! జలాశయము పక్కన, దగ్గరగా ఫలవృక్షములు ఉన్న చోట, దర్భలు, సమిధలు దొరకుచోట, తగిన ప్రదేశమును నిర్ణయింపుము. " అని పలికాడు.
“రామా! అట్లు కాదు. స్థల నిర్ణయములో నీ కన్నా సమర్థుడు లేడు. నీవు సీత కలిసి ఆలోచించి స్థల నిర్ణయము చెయ్యండి. అక్కడ నేను సుందరమైన ఆశ్రమమును నిర్మించెదను." అని అన్నాడు.
రాముడు, సీత చుట్టపక్కల ప్రదేశములు తిరిగి గోదావరీ నదీ తీరంలో ఉన్న సమతల ప్రదేశమును ఎన్నుకొన్నారు.
“లక్ష్మణా! ఈ ప్రదేశములో పర్ణశాలను నిర్మింపుము. ఈ ప్రదేశము మనకు అనుకూలముగా ఉంది. పక్కనే గోదావరీ నది ప్రవహించుచున్నది. మనకు జలమునకు కొదవ లేదు. ఈ సమతల ప్రదేశములో ఫల వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. చుట్టూ పర్వతములు పెట్టని కోటలాగా ప్రకాశిస్తున్నాయి. ఆ పర్వతముల మీద మామిడి, అశోక, చంపక, చందన, శమీ, కింశుక వృక్షములు సమృద్ధిగా ఉన్నాయి. అదీ కాకుండా ఇక్కడ ఉన్న వటవృక్షముల మీద అనేక పక్షిజాతులు నివసిస్తున్నాయి. జటాయువు కూడా ఈ చెట్ల మీద నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి పర్ణశాల నిర్మించుటకు ఇదే అనువైన చోటు." అని అన్నాడు రాముడు.
రాముని మాటను శిరస్సున దాల్చాడు లక్షణుడు. రాముడు కోరినట్టు అక్కడ ఒక సుందరమైన పర్ణశాలను నిర్మించాడు. మట్టితో గోడలు కట్టాడు. మధ్యలో స్తంభాలు పాతాడు. పొడుగాటి వెదుళ్లతో నిలువుగా అడ్డంగా కట్టాడు. దానిమీద తాళ ఆకులు, దాని మీద రెల్లు గడ్డి కప్పాడు. పర్ణశాల ముందు ఉన్న స్థలమును చదునుచేసాడు. చుట్టు కంచె కట్టాడు. ఆ ప్రకారంగా ఒక సుందరమైన పర్ణశాలను లక్ష్మణుడు నిర్మించాడు.
తరువాత లక్ష్మణుడు గోదావరికి వెళ్లి స్నానము చేసి అక్కడ పుష్పించిన తామర పువ్వులు కోసుకొని వచ్చాడు. లక్ష్మణుడు నిర్మించిన పర్ణశాలను చూచి సీతారాములు ముగ్ధులయ్యారు. రాముడు లక్ష్మణుని కౌగలించుకొని "లక్ష్మణా! నా కోరిక మేరకు మనకు ఒక అనువైన పర్ణశాలను నిర్మించినందుకు నీకు నేనేమి ఇవ్వగలను నా గాఢపరిష్వంగము తప్ప" అంటూ లక్ష్మణుని ప్రేమతో కౌగలించుకున్నాడు రాముడు. రాముని ప్రేమకు లక్ష్మణుడు పొంగిపోయాడు. ఆ ఆశ్రమములో రాముడు, సీత, లక్ష్మణుడు సుఖంగా నివసించసాగారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదునైదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment