శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదహారవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 16)
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము
పదహారవ సర్గ
రాముడు సీతతో సహా పంచవటిలో ఆనందంగా గడుపుతున్నాడు. ఇంతలో శరదృతువు ముగిసి, హేమంత ఋతువు ప్రవేశించింది. చలికాలము మొదలయింది.ఒక రోజు రాముడు పొద్దునే గోదావరినదికి స్నానానికి వెళ్లాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. ఆ హేమంత ఋతువు అందాలను చూచి లక్ష్మణుడు రాముని తో ఇలా అన్నాడు.
“రామా! నీకు హేమంత ఋతువు అంటే ఎంతో ఇష్టం కదా. ఇప్పుడు హేమంత ఋతువు ప్రవేశించింది. మంచు కురుస్తూ ఉంది. నదీజలాలు స్నానానికి అనుకూలంగా లేవు. చలికి వెచ్చగా అగ్నిహోత్రము దగ్గర ఉండవలెనని కోరికగా ఉంది. పంటలు బాగా పండి కొత్త ధాన్యములు ఇంటికి చేరుతున్నాయి. ఉత్తరాయనము రాగానే పితృదేవతలను పూజించి జనులు తరిస్తున్నారు. వర్షాకాలము ముగియడంతో రాజులు ఇతర రాజ్యముల మీదికి దండెత్తడానికి ఆసక్తిగా ఉన్నారు. అసలే మంచుతో కప్పబడిన హిమవత్పర్వతము సూర్యుడు భూమికి దూరంగా ఉండటంతో ఇంకా ఎక్కువ మంచుతో శోభిల్లుతోంది.
మనుష్యులు మధ్యాహ్నపు ఎండలో హాయిగా ఉంటున్నారు. రాత్రిళ్లు చలితో వణుకుతున్నారు. పగటి భాగమున కూడా సూర్యుడు తన తీక్షతను కోల్పోయాడు. పగలు కూడా చలిగాలులు వీస్తున్నాయి. అడవులలో జంతువులు కూడా తిరగడం లేదు. గుహలకే పరిమితమైనాయి. మంచు కురవడంతో రాత్రిళ్లు ఎవరూ ఆరుబయట పడుకోడం లేదు. చంద్రుడు గుండ్రంగా అందంగా ఉంటాడు. కాని ఆ అందాలు ఇప్పుడు సూర్యునికి సంక్రమించాయి. సూర్యుడు కూడా మంచు చేత కప్పబడి, తీక్షత తగ్గి, పూర్ణ చంద్రుని వలె ప్రకాశిస్తున్నాడు. పడమటి దిశనుండి చలిగాలులు వీస్తున్నాయి.
రాత్రి అంతా చలిగా ఉండి, పొద్దున్నే సూర్యోదయం కాగానే పక్షులు కిలా కిలా రావాలతో రెక్కలు విప్పుకొని ఎగిరిపోతున్నాయి. సూర్యకిరణములను పొగ మంచు కప్పడం వలన, సూర్యుడు బాగా పైకి వచ్చినా తీవ్రత తగ్గి నిండు చంద్రుని వలె కనపడుతున్నాడు. ఎండ కొద్ది కొద్దిగా నేల మీద పాకుతూ ఉంది. కాని వేడిగా లేదు. మధ్యాహ్నము ఎండ చాలా సుఖంగా ఉంది. ఈ అడవిలో ఉన్న పచ్చిక మీద పడ్డ మంచు బిందువులు, పొద్దుటి ఎండలో ముత్యాలమాదిరి ప్రకాశిస్తున్నాయి.
రామా! అటు చూడు! పాపము ఆ ఏనుగు నీళ్లు తాగుదామని తన తొండమును నీటిలో పెట్టి, నీళ్లు జివ్వుమని చల్లగా తగలగానే తన తొండమును వెనక్కు లాగేసుకుంది. అంతెందుకు ఆ పక్షులు కూడా ఆ చల్లదనానికి నీటిలో దిగడానికి జంకుతున్నాయి.
రామా! ఈ నదిలో నీరుకూడా అధికంగా చల్లగా ఉండటం వలన తాగడానికి వీలులేకుండా ఉంది కదా!
రామా! అడవిలో ఉన్న మన పరిస్థితి ఇలా ఉంది కదా! మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉన్నాడో! నీ యందు భక్తితో అయోధ్యలో ఉన్నా అరణ్యములో ఉన్నట్టు ఉన్నాడేమో! రాజభోగములను విడిచిపెట్టి, నేల మీద పడుకుంటూ, మన మాదిరి ఫలములను ఆహారముగా తీసుకుంటూ జీవనము గడుపుతున్నాడేమో! రామా! మనము స్నానానికి గోదావరి నదికి వచ్చినట్టు భరతుడు కూడా సరయూనదికి స్నానానికి వెళుతూ ఉంటాడనుకుంటాను. దక్షిణాపథములో ఉన్న మనకే ఇంత చలిగాఉంటే ఉత్తరదేశంలో అయోధ్యలో ఉన్న భరతునికి ఇంకెంత చలిగా ఉందో కదా! ఈ తెల్లవారుజామున సరయూనదిలో ఎలా స్నానం చేస్తున్నాడో కదా! ఎందుకంటే, భరతుడు అయోధ్యలో ఉన్నా, అరణ్యములో ఉన్నా నిన్ను అనుసరిస్తున్నాడు. నీ రాకకై తపిస్తున్నాడు. అటువంటి వాడు స్వర్గలోకాధిపత్యమునకు అర్హుడు.
రామా! సాధారణంగా కుమారుడికి తల్లి బుద్ధులు, కుమార్తెకు తండ్రి బుద్ధులు వస్తాయి అంటారు. కానీ, భరతుడికి తల్లి కైకకు ఉన్న కుటిల బుద్ధి ఏమాత్రమూ రాలేదు. అయినా రామా! దశరథ మహారాజు భార్యగా ఉండి, భరతునికి కన్నతల్లిగా ఉన్న కైకకు ఇంత కుటిలబుద్ధి ఎలా వచ్చిందో తెలియదు కదా!.." అని లక్ష్మణుడు ఇంకా ఏదో చెప్పబోతుంటే రాముడు అడ్డుకున్నాడు.
“లక్షణా! దయచేసి నీవు ఎట్టి పరిస్థితులలోనూ మాత కైకను దూషించకూడదు. నేను వనవాసము చెయ్యాలని చేస్తున్నాను. ఇందులో ఆమె ప్రమేయము ఎంత మాత్రమూ లేదు. నా బాధ అంతా ఒకటే. భరత శత్రుఘ్నులు నా దగ్గర లేరే అని. అంతే కానీ ఈ వనవాసము నాకు ఎంతో ఆనందమూ కలిగిస్తూ ఉంది. నువ్వు, భరత శత్రుఘ్నులు ఎప్పుడు నా దగ్గరగా ఉంటారో కదా అని ఆతురతగా ఎదురుచూస్తున్నాను.” అని అన్నాడు రాముడు.
ఈ విధంగా మాట్లాడుకుంటూ అందరూ గోదావరీ తీరము చేరుకున్నారు. అందరూ గోదావరిలో దిగి స్నానాలు చేసారు. సీతా రామ లక్ష్మణులు గోదావరిలో పితృ తర్పణము, దేవ తర్పణము, నిర్వర్తించారు. సూర్యోదయ కాలములో అర్ఘ్యము విడిచారు. తరువాత అందరూ ఆశ్రమమునకు వెళ్లారు.
శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదహారవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment