శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - పదిహేడవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 17)

శ్రీమద్రామాయణము

అరణ్య కాండము

పదిహేడవ సర్గ

రాముడు ఆశ్రమానికి వచ్చిన తరువాత అగ్నిహోత్రము మొదలగు కార్యములు నిర్వర్తించాడు. సీతతో, లక్ష్మణునితోనూ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఆశ్రమము బయట కూర్చుని ఉన్నాడు. ఇంతలో జటాయువు వారి వద్దకు వచ్చాడు.

“రామా! నేను ఇక్కడకు వచ్చి చాలాకాలము అయినది. నాకు నా బంధువులను, మిత్రులను చూడవలెనని కోరికగా ఉన్నది. నేను పోయి నా బంధుమిత్రులను చూచి వెంటనే వస్తాను. అనుజ్ఞ ఇవ్వండి.” అని అడిగాడు. రాముడు సంతోషంతో సమ్మతించాడు. జటాయువు వెళ్లిపోయాడు.
కొంత సేపు తరువాత ఒక రాక్షస స్త్రీ ఆ ప్రదేశమునకు వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ. రావణుని చెల్లెలు. ఆమె అక్కడకు వచ్చి రాముని చూచింది. బలిష్టమైన బాహువులతో, సింహము వక్షస్థలము వలె విశాలమైన వక్షస్థలముతో, తామర రేకుల వంటి కన్నులతో, ఆజానుబాహుడైన రాముని చూచింది. జగన్మోహనాకారుడైన రాముని చూచి శూర్పణఖ మోహపరవశురాలయింది. మన్మధుడు ఆమె మీద పుష్పబాణములు ప్రయోగించాడు.

రాముని మొహం చాలా అందంగా ఉంటే, శూర్పణఖ ముఖం వికృతంగా ఉంది. రాముని నడుము సన్నగా ఉంటే, ఆమెది బానపొట్ట. రాముని కళ్లు విశాలంగా ఉంటే, ఆమె కళ్లు వికృతంగా ఉన్నాయి. రాముని జుట్టు అందంగా ఉంటే ఆమె జుట్టు ఎర్రగా వికారంగా ఉంది. రామునిది మోహనాకారమైతే ఆమెది వికారరూపము. రాముని కంఠస్వరము మధురంగా ఉంటే ఆమె కంఠధ్వని గార్ధభమును తలపిస్తూ ఉంది. రాముడు నవయౌవనుడు. ఆమె వయసుమళ్లిన స్త్రీ. రాముని మాటలు మృదువుగా ఉంటే ఆమె భాష గ్రామ్యంగా కఠోరంగా ఉంది. రాముని ప్రవర్తన ధర్మపరంగా ఉంటే ఆమెది అధర్మ ప్రవర్తన. రాముని చూస్తే ఆనందం కలిగితే ఆమెను చూస్తే ఏహ్యభావము కలుగుతూఉంది. ఇలా హస్తిమశకాంతర వైవిధ్యము ఉన్న శూర్పణఖ రాముని చూచి మోహించింది.

తన సహజరూపంతో పోతే రాముడు తనను వరించడని, వెంటనే తన రూపంమార్చింది. నవయౌవన వతిగా తయారయింది. రాముని సమీపించింది.

“ఓ సుందరాకారా! నీవు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈమె నీ భార్య అనుకుంటాను. భార్యాసమేతంగా భయంకరమైన ఈ అడవిలో ఎందుకు ఉన్నావు. నీ వాలకం చూస్తుంటే నీవు గృహస్తులా లేవే. జటాజూటములు ధరించి ముని కుమారుని వలె ఉన్నావు. నీ చేతిలో ఉన్న ధనుర్బాణములను బట్టి నీవు క్షత్రియుడవు అని తెలుస్తూ ఉంది. ఇంతకూ నీవు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఏ పనిమీద వచ్చావు? నిజం చెప్పు.” అని నిలదీసింది శూర్పణఖ.

అప్పుడు రాముడు ఆమెతో ఇలా అన్నాడు. “ఓ తరుణీ! నా పేరు రాముడు. నేను అయోధ్యాధీశుడు దశరథుని కుమారుడను. ఈమె నాభార్య సీత. అతను నా తమ్ముడు లక్ష్మణుడు. మేము మా తండ్రిగారి ఆజ్ఞమేరకు వనవాసము చేస్తున్నాము. ఇంతకూ నీవు ఎవరు? నీ నివాసము ఎక్కడ? నీ భర్తపేరు ఏమిటి?" అని అడిగాడు రాముడు. దానికి శూర్పణఖ ఇలా బదులు చెప్పింది.

“ఓరామా! నేను ఒక రాక్షస స్త్రీని. నా పేరు శూర్పణఖ. నేను రాక్షస స్త్రీని అయినా నేను కామరూపము ధరించు శక్తి కలదానను. ఈ అరణ్యమే నా నివాసము. విశ్రవసుని కుమారుడు రావణుడు నా అన్న. మహా పరాక్రమ వంతుడు. నీవు ఆయన గురించి వినేవుంటావు. ఆయన తమ్ముడు, మహాబలవంతుడైన కుంభకర్ణుడు. ఎల్లప్పుడూ నిద్రాదేవిని సేవిస్తుంటాడు. రాక్షస వంశములో తప్పపుట్టిన వాడు విభీషణుడు. ఆయన కూడా నా సోదరుడే. ఇక్కడే జనస్థానములో నివాసము ఏర్పరచుకున్న ఖరుడు, దూషణుడు కూడా నా సోదరులే. నేనువారి వద్దనే ఉంటున్నాను.

తొలిసారిగా అతిలోకమన్మధాకారుడవైన నిన్ను చూచాను. నీ మోహంలో పడ్డాను. నిన్ను ప్రేమించాను. నా మనసులో నువ్వే నా భర్తవు అని అనుకొన్నాను. దానికి తిరుగులేదు. ఈమె నీ భార్య అంటున్నావు. నేను ఉన్నానుగా. ఇంకా ఈమెతో నీకు ఏం పని. నా అందంతో పోలిస్తే ఈసీత వికారంగా ఉంది కదూ! ఈమెను వదిలెయ్యి. నువ్వు ఊ అంటే నేను ఈమెను నీ తమ్ముని విరుచుకొని తింటాను. తరువాత మనం ఇద్దరం ఈ అరణ్యములో, పర్వతశిఖరములలో ఆనందంగా విహరిద్దాము. నాతో వచ్చెయ్యి." అని పలికింది శూర్పణఖ.

శ్రీమద్రామాయణము
అరణ్యకాండము పదిహేడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)