శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 61)
శ్రీమద్రామాయణము అయోధ్యా కాండము అరువది ఒకటవ సర్గ తరువాత కౌసల్య, మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. “మహారాజా! తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా! కాని కన్నకుమారుని, కోడలిని, ఎలా అడవులకు పంపగలిగావు. నీ దయాగుణము అంతా ఏమయింది? అది సరే! ఏ పాపమూ ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా! ఆమె అడవులలో ఎలా తిరుగ గలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా! పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా! తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా! రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా! మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొనితిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా! ఒక వేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా! ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్దపులి తినదు. అలాగే భరతుడుకి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు. రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా! యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు కానీ ...