శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 59)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

యాభై తొమ్మిదవ సర్గ

సుమంత్రుడు చెప్పిన మాటలను శ్రద్ధగా విన్నాడు దశరథుడు. “సుమంత్రా! ఇంతేనా! వారు ఇంక ఏమీ అనలేదా! పోనీలే. తరువాత ఏమి జరిగిందీ వివరంగాచెప్పు." అని అడిగాడు.

సుమంత్రుడు తరువాత జరిగిన విషయాలు ఇలా చెప్పసాగాడు.
“మహారాజా! రామలక్ష్మణులు తమ వెంట్రుకలకు మర్రిపాలు పూసుకొని జడలు కట్టుకున్నారు. వారు గంగానదిని దాటి ప్రయాగ క్షేత్రము వైపు వెళ్లారు. లక్ష్మణుడు ముందు నడుస్తుంటే, సీతమధ్య నడుస్తుంటే, రాముడు వెనక నడుస్తూ వారు వెళ్లిపోయారు. నేను వారు వెళ్లిన వంక చూస్తూ వారు కనుమరుగు కాగానే వెనుకకు తిరిగి వచ్చాను.

రాముడు తన మనసు మార్చుకొని వెనకుకు వస్తాడేమో అని మూడురోజులు గుహుడు ఉన్నచోట ఉండి పోయాను. కాని రాముడు తిరిగిరాలేదు. ఇంక చేసేది లేక వెనకకు తిరిగివచ్చాను. దారిలో ఉన్న ఉద్యానవనములు కూడా రాముని వియోగమునకు శోకిస్తున్నాయా అన్నట్టు వాడిపోయి ఉన్నాయి.

నేను అయోధ్యలో ప్రవేశించగానే రామునికోసరం అయోధ్యా ప్రజలు విడిచే నిట్టూర్పులు వినబడ్డాయి. రాజవీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. మేడమీద నిలబడి ఉన్న స్త్రీలు, నేను రాముని లేని రథమును తీసుకొని రావడం చూచి రోదించడం స్వయంగా చూచాను. రామునికి శత్రువులు కూడా రాముని వంటి శత్రువు మనకు దొరకడని దు:ఖించడం చూచాను." అని అన్నాడు సుమంత్రుడు.

ఆమాటలు విన్న దశరథుడు సుమంత్రునితో ఇలాఅన్నాడు. “సుమంత్రా! నిజమేనయ్యా. కైక వరములు కోరినదే తడవుగా నేను ఎవరినీ సంప్రదించకుండా ఆ వరాలు ఇవ్వడం వలన ఎంతటి తీవ్రపరిణామాలు వస్తాయో ఊహించకుండా, ఆ వరాలు ఇచ్చేసాను. ఇది నేను చేసినఘోరమైన తప్పు. నేను వృద్ధులైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉండాల్సింది. నా తొందరపాటుకు ఫలితం అనుభవిస్తున్నాను. నేను కాదు అయోధ్య అంతా అనుభవిస్తూ ఉంది. దీని కంతటికీ కారణము నా కాముకత్వము. అదే నా వంశనాశనానికి కారణమయింది.

సుమంత్రా! నాకు ఒక సాయం చెయ్యి. నన్ను రాముని వద్దకు తీసుకొని వెళ్లు. లేకపోతే నీవు అన్నా వెళ్లి రాముని వెనకకు తీసుకొని రా. నా ఆజ్ఞను రాముడు పాలించనవసరం లేదని చెప్పి తీసుకొని రా.

నీ మాట వినడు అనుకుంటే నాకు దారి చూపించు. నేనే వెళతాను. నేను వెంటనే నా రాముని చూడాలి. లేకపోతే నా దేహంలో ప్రాణములు నిలవడం కష్టం. ఇలాగే ఇక్కడే ఉంటే నేను మరణించడం తథ్యం. నేను అనాధగా మరణించాను అన్న విషయం నా రామునికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు. ఏమో ఏమవుతుందో!" అంటూ బిగ్గరగా ఏడుస్తూ ఆసనం మీద పడిపోయాడు దశరథుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)