శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 58)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

యాభై ఎనిమిదవ సర్గ

కొంచెం సేపటికి దశరథుడు తెప్పరిల్లాడు. సుమంత్రుని పిలిపించాడు. సుమంత్రుడు దశరథుని వద్దకు వెళ్లాడు. దశరథుడు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తల ఎత్తి సుమంత్రుని చూచి దశరథుడు ఇలాఅన్నాడు.

“సుమంత్రా! రాముడు ఎలా ఉన్నాడు? ఎక్కడ పడుకుంటు న్నాడు? ఏమి తింటున్నాడు? సుమంత్రా! రాముడు ఎన్నడూ అడవులలో ఉండలేదు. ఇటువంటి కష్టములు అతనికి తెలియవు. రాజ భోజనములు ఆరగించి హంసతూలికా తల్పముల మీద శయనించు రాముడు అడవులలో కందమూలములు తింటూ, కటిక నేల మీద ఎలా పడుకుంటున్నాడో కదా! రాముడు ఎప్పుడు బయటకు వెళ్లినా అతని వెంట రథములు, కాల్బలములు, ఏనుగులు వెంట ఉండేవి. అవన్నీ లేకుండా అడవులలో ఎలా ఉంటున్నాడో కదా! సీతా రామ లక్ష్మణులు క్రూరజంతువులు, పాములు ఉన్న వనములలో ఎలా ఉంటున్నారో కదా!

సుమంత్రా! సీతారాములు నీ రథము దిగి అడవులలో ఎలా ప్రవేశించారు? ఏది ఏమైనా నా కన్నా నువ్వే అదృష్టవంతుడవు. రాముడు అడవులలో ప్రవేశించు వరకూ అతని వెన్నంటి ఉన్నావు.
రాముడు, సీత, లక్ష్మణుడునాతో చెప్పమని ఏమన్నా చెప్పారా! వివరంగా చెప్పు." అని అన్నాడు దశరథుడు.

సుమంత్రుడు ఇలా బదులు చెప్పాడు. “మహారాజా! రాముడు తమకు నమస్కరించి తమరితో ఇలా చెప్పమన్నాడు.

“సుమంత్రా! నా తండ్రికి నేను తలవంచి నమస్కారము చేసానని చెప్పు. అంత:పురములోని అందరినీ వారు వీరు అనే బేధము లేకుండా పేరుపేరునా అడిగినట్టు చెప్పు. నా తల్లి కౌసల్యకు నేను తలవంచి అభివాదము చేసినట్టు చెప్పు. నా మాటలుగా నా తల్లికి ఈ విధంగా చెప్పు.

“అమ్మా! నీవు ధర్మము తప్పకుండా అగ్ని కార్యములు నిర్వర్తించుచూ నా తండ్రి దశరధునికి ఏ కష్టము రాకుండా సేవలు చేస్తూ ఉండు. 

అమ్మా! నీవు పట్టపు రాణివి అని అహంకరించకుండా దశరథుని ఇతర భార్యలనుకూడా ఆదరించు. నా తల్లి కైకను నా తండ్రి దశరథుని పట్ల అనుకూలంగా ఉండేట్టు చెయ్యి. 

అమ్మా! భరతుడు నీ కుమారుడే అయినప్పటికీ, అతనిని రాజుగానే గౌరవించు. అదే కదా రాజధర్మము. తల్లులందరి పట్లా ఆదర భావంతో ఉండమని నా మాటగా భరతునికి చెప్పు. భరతునితో నా మాటగా ఇలా చెప్పు: 

“భరతా! నీ తండ్రి ఆజ్ఞ ప్రకారము నీవు అయోధ్యను పరిపాలించు. దశరథుడు వృద్ధుడైనాడు. అందుకని ఆయన మాటలను కూడా గౌరవిస్తూ, రాజ్యపాలన సాగించు. భరతా! నా తల్లి కౌసల్యను కూడా నీ తల్లి వలెనే ఆదరించు." అని కౌసల్యకు చెప్పమని రాముడు నాతో చెప్పాడు.

మహారాజా! లక్ష్మణుడు మాత్రము చాలా కోపంతో తమతో ఇలా చెప్పమన్నాడు. “రాముడు ఏ నేరం చేసాడని రాజ్యము నుండి వెడలగొట్టారు. మహారాజు తన అధికారమును మరిచి కైక మాటలకు లోబడి మమ్ములను అడవులకు పంపాడు. దానివలన మేము ఎన్నో బాధలు పడుతున్నాము. రాజ్యముమీద దురాశతో గానీ, లేక వరములు అడుగు మిషమీద గానీ, అన్న మాటను నిలబెట్టుకోడం కోసం గానీ, కారణం ఏదైనా రాముని అడవులకు పంపడం దుషృత్యము. తాను మహారాజు అనే అహంకారంతో రాముని అడవులకు పంపాడే కానీ, వేరు కాదు. కనీసము ఇది మంచా లేక చెడ్డా అనే ఆలోచించకుండా రాముని అడవులకు పంపడం చాలా శోచనీయము. అందుకనే నేను దశరథుని నా తండ్రిగా అంగీకరించడం లేదు. నాకు తల్లీ, తండ్రీ అన్నా అన్నీ రాముడే. ఎందుకంటే సకల జనులకు ఆరాధ్యుడైన రాముని విడిచి పెట్టిన వాడిని ఎవరు గౌరవిస్తారు. అయోధ్య ప్రజల అభీష్టమునకు విరుద్ధంగా రాముని అడవులకు పంపి వారి ఆగ్రహమునకు గురి అయిన దశరథుడు మహారాజుగా ఉండటానికి ఎంత మాత్రమూ అర్హుడు కాదు." అని లక్ష్మణుడు అన్నాడు.

శోక రాసిగా నిలిచిన సీత మాత్రమూ నాతో ఏమీ చెప్పలేదు. రాముని చూస్తూ కన్నీటి సముద్రంలో మునిగిపోయింది కానీ ఆ ఇల్లాలు ఎవరినీ ఒక్కమాట కూడా అనలేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)