శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 57)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

యాభై ఏడవ సర్గ

గంగానదిని దాటడానికి రాముడు, సీత, లక్ష్మణుడు నావ ఎక్కిన తరువాత నావ గంగానదిలో సాగిపోయింది. తరువాత సుమంత్రుడు, గుహుడు చాలాసేపు రాముని వనవాసము గురించి మాట్లాడుకున్నారు. తరువాత సుమంత్రుడు రథము తోలుకుంటూ అయోధ్యకు వెళ్లాడు. గుహుడు తన మనుషులద్వారా రాముడు భరద్వాజ ఆశ్రమము చేరుకున్నాడని తెలుసుకున్నాడు. 

సుమంత్రుడు తన రథమును అయోధ్యవైపు తీసుకొని వెళుతున్నాడు. మూడవ రోజు సాయంత్రానికి సుమంత్రుడు అయోధ్యకు చేరుకున్నాడు. అయోధ్య అంతా అంధకార బంధురంగా ఉంది. ఎవరి ఇంట్లోనూ దీపాలు వెలగటం లేదు. ఎప్పుడూ ఆనందోత్సాహాలతో కళకళలాడే అయోధ్య రాముని వియోగంతో విలవిలలాడిపోతోంది అని బాధపడ్డాడు సుమంత్రుడు.
సుమంత్రుడు నగరప్రవేశము చేసాడు. రాముని రథము చూచి పౌరులు గుంపులు గుంపులుగా సుమంత్రుని వెంట బడ్డారు. “రాముడు ఎక్కడ? రాముని ఎక్కడ వదిలి వచ్చావు?" అని ప్రశ్నల వర్షము కురిపిస్తున్నారు. 

సుమంత్రుడురథము ఆపి వారితో ఇలా అన్నాడు. “నేనురాముని గంగానదిని దాటించి వచ్చాను. రాముని వద్దనుండి ఆజ్ఞతీసుకొని వచ్చాను." అని బాధతో చెప్పాడు సుమంత్రుడు.

“రాముడు వనవాసమునకు వెళ్లిపోయాడా. రాముడు ఇంకమాకు కనపడడా" అనుకుంటూ వారు ఎవరి దారిన వారు వెళ్లారు.

సుమంత్రుడు దశరథుని అంతఃపురమునకు వెళ్లాడు. అంత:పురములోని స్త్రీలు, రాముడు లేకుండా వంటరిగా వచ్చిన సుమంత్రుని చూచి విలపించారు. సుమంత్రుని చూచి దశరథుని భార్యలు తమలో తాము ఇలా అనుకుంటున్నారు.

“సుమంత్రుని చూచిన కౌసల్య “నా రాముడు ఏడీ" అనిఅడిగితే కౌసల్యకు ఏమి సమాధానము చెబుతాడు. కొడుకు కోడలు తనను విడిచి పెట్టి పోయినా కూడా కౌసల్య ఇంకా జీవించి ఉంటుందా! ఏమో ఆమె బతకడం చాలా కష్టము. ఏం జరుగుతుందో ఏమో!" అని తమలో తాము ఆందోళన చెందుతున్నారు.

ఆ మాటలన్నీవింటూ సుమంత్రుడు దశరథుని మందిరము వైపు వెళుతున్నాడు. సుమంత్రుడు దశరథుని చూచి రాముడు తనతో చెప్పమన్న మాటలు యథాతథంగా వినిపించాడు. రాముని మాటలు విన్న దశరథుడు మూర్ఛపోయాడు. అంతలో అంతఃపుర స్త్రీలు అందరూవచ్చి ఆయనకు ఉపచారములు చేసారు. ఇంతలో కౌసల్య, సుమిత్ర అక్కడకు వచ్చారు. దశరథుని పట్టుకొని లేవదీసారు.

దశరథునితో కౌసల్య ఇలాఅంది. “మహారాజా! రాముని అడవిలో వదిలిపెట్టి రామసందేశమును తీసుకొని వచ్చిన సుమంత్రునితో మాట్లాడవేమి. మహారాజా! చెయ్యవలసినది అంతా చేసి ఇప్పుడు మాట్లాడ కుండా మౌనంగా ఉoటావెందుకు. ఎలాగైనా నీ మాట నిలబెట్టుకున్నావు. ఆడి తప్పని వాడివని పేరు ప్రతిష్ఠలు గడించావు. సత్యవాక్పరిపాలకుడవై పుణ్యం సంపాదించుకున్నావు. అది చాలులెండి. ఇక్కడ కైక లేదులెండి. మీరు భయపడనవసరం లేదు. నిర్భయంగా సుమంత్రునితో మాట్లా డ వచ్చును." అని కౌసల్య పలికి ఆమెకు దుఃఖము ముంచుకురాగా కిందపడిపోయింది.

కిందపడిపోయిన దశరథుని, కౌసల్యను చూచి దశరథుని భార్యలు ఏడుస్తున్నారు. వారి దు:ఖానికి అంతులేదు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)