శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 56)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
యాభై ఆరవ సర్గ
మరునాడు ఉదయం రాముడు ముందుగా మేల్కొన్నాడు. లక్ష్మణుని నిద్రలేపాడు. "లక్ష్మణా! మనము బయలుదేరు వేళ అయినది. తొందరగా నిద్రలే.” అని నిద్రలేపాడు. తరువాత సీతకూడా నిద్రలేచింది. అందరూ యమునలో స్నానం చేసారు. ప్రాతఃసంధ్యా కార్యక్రమములు నిర్వర్తించి చిత్రకూటమునకు ప్రయాణము అయ్యారు.రాముడు సీతకు దారిలో కనపడ్డ వృక్షముల గురించి, పుష్పముల గురించి వివరిస్తున్నాడు. చిత్రకూట పర్వతము మీద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వాటిని సీతకు చూపించాడు రాముడు. అలా నడుచుకుంటూ వారు ముగ్గురూ చిత్రకూట పర్వతమును చేరుకున్నారు. అక్కడ కాసేపు ఆగాడు రాముడు.
“లక్ష్మణా! ఇక్కడ మనము ప్రశాంతంగా వనవాసము చేయవచ్చును. మనకు కావలసిన ఫలములు,కాయలు దుంపలు, ఆహారమునకు పనికి వచ్చు జంతువులు, స్వచ్ఛమైన నీరు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్వతము మీద చాలామంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు.” అని అన్నాడు.
వారు అలా మాట్లాడుకుంటూ వాల్మీకి ఆశ్రమమునకు చేరుకున్నారు. వాల్మీకి వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశల ప్రశ్నలు వేసాడు. తన గురించి తనయొక్క వనవాసము గురించి వాల్మీకి మహర్షికి వివరంగా తెలిపాడు రాముడు.
తరువాత రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా!మనము ఇచ్చటనే ఒక కుటీరము నిర్మించుకొని నివసిస్తాము. కాబట్టి వెంటనే బలమైన కర్రలు తీసుకొని వచ్చి కుటీరము నిర్మించు
అని అన్నాడు."
అని అన్నాడు."
లక్ష్మణుడు రాముడు చెప్పిన మేరకు ఒక కుటీరము నిర్మించాడు. ఆ పర్ణశాలను చూచి ఎంతో సంతోషించాడు రాముడు. “లక్ష్మణా! మనము ఈ పర్ణశాలలో చాలాకాలము నివసింపబోవుచున్నాము. కాబట్టి వాస్తుదేవతలను పూజించాలి. వారిని శాంతింపజేయాలి. ముందుగా మనము లేడి మాంసముతో వాస్తుపూజ చేద్దాము. కాబట్టి ఒక లేడిని చంపి దాని మాంసము తీసుకొని రా. శాస్త్రము ప్రకారము చేయవలసిన కర్మ కనుక లేడిని చంపిన పాపము అంటదు." అని అన్నాడు రాముడు.
వెంటనే లక్ష్మణుడు అడవిలోకి పోయి ఒక లేడిని వేటాడి తీసుకొనివచ్చాడు. దాని మాంసమును అగ్నిమీద ఉడికించాడు. గృహపూజకు సిద్ధం చేసాడు. “రామా! లేడి మాంసము ఉడికించాను. పూజకు అన్నీసిద్ధం చేసాను. ఇంక పూజకు ఉపక్రమించండి.” అని అన్నాడు లక్ష్మణుడు.
రాముడు స్నానము చేసి శుచిగా వచ్చి కూర్చున్నాడు. వేదమంత్రములను పఠిస్తూ గృహపూజ, వాస్తుదేవతా పూజను శాస్త్రోక్తంగా చేసాడు. దేవతల నందరినీ పూజించాడు. సీతా సమేతంగా ఆ పర్ణశాలలో గృహప్రవేశము చేసాడు రాముడు. తరువాత రాముడు విశ్వేదేవతలకు, త్రిమూర్తులకు బలులు సమర్పించాడు.
లక్ష్మణుడు పర్ణశాల లోపల వేదికలను, అగ్ని గృహమును నిర్మించాడు. తరువాత సీతారాములు అడవిలో లభించు ఫలములు, పుష్పములు, పక్వమైన మాంసముసేకరించి వాటితో భూతతృప్తి గావించారు. తరువాత అందరూ ఆ పర్ణశాలలో ప్రవేశించారు. అప్పటి నుండి సీతారామలక్ష్మణులు ఆ పర్ణశాలలో నివసిస్తున్నారు. అరణ్యములలో విహరిస్తూ, ఫలములు, కాయలు, దుంపలు, తేనె మొదలగు తినే పదార్ధములు సేకరిస్తూ, వాటిని తింటూ, ఆహ్లాదంగా జీవితం గడుపుతున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment