శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 55)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
యాభై ఐదవ సర్గ
ఆ రాత్రి అడవిలో గడిపిన తరువాత రామలక్ష్మణులు, సీత, మరునాడు అక్కడి నుండి బయలుదేరి చిత్రకూట పర్వతమునకు పోవడానికి సిద్ధం అయ్యారు. భరద్వాజుని వద్దకు పోయి ఆయనకు నమస్కారం చేసారు. భరద్వాజుడు సీతారామలక్ష్మణులకు మంగళాచరణము చేసి వీడ్కోలు పలికాడు. వారితో పాటు కొంతదూరము వెళ్లాడు. అక్కడ నిలబడి రామునితో భరద్వాజుడు ఇలా అన్నాడు.“ఓ రామా! మీరు గంగా యమునా సంగమ స్థానము చేరిన తరువాత యమునా నది ఒడ్డునే పడమటి వైపుగా వెళ్లండి. అక్కడ మీరు ఒక తెప్పను కట్టుకొని యమునను దాటండి. మీరు యమునను దాటిన తరువాత మీకు ఒక పెద్ద మర్రిచెట్టు కనపడుతుంది. ఆ చెట్టు పేరు శ్యామము. అక్కడ ఎంతో మంది సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. సీత ఆ చెట్టుకు నమస్కారము చేసి ఏ కోరికలు కోరుకుంటే అవి తీరుతాయి. మీరు ఆ చెట్టు కింద ఆగి కొంచెం సేపు విశ్రాంతి తీసుకొన వచ్చును. లేని ఎడల మీరు ప్రయాణము కొనసాగించవచ్చును.
అలా ఒక క్రోసెడు దూరము వెళ్లగానే మోదుగ చెట్లతోనూ, రేగు చెట్లతోనూ వెదురు పొదలతోనూ నిండి ఉన్న ఒక అరణ్యము కనిపిస్తుంది. అది యమునా నది ఒడ్డున ఉంటుంది. అదే చిత్రకూటమునకు పోవు దారి. నేను ఆమార్గములో ఎన్నోసార్లు ప్రయాణము చేసాను. అది ఎంతో సురక్షితమైన మార్గము. ఏ ప్రమాదమూ ఉండదు.” అని అన్నాడు భరద్వాజుడు.
ఆ మాటలు విన్న రాముడు భరద్వాజుని చూచి నమస్కరించి “మీరు చేసిన సాయమునకు కృతజ్ఞతలు. ఇంక మీరు ఆశ్రమమునకు వెళ్లండి. మాకు ముందుకు వెళ్లడానికి అనుజ్ఞ ఇవ్వండి.” అని ప్రార్థించాడు. ఆమాటలు విన్న భరద్వాజుడు వారిని ఆశీర్వదించి వెనుకకు వెళ్లిపోయాడు. రామలక్ష్మణులు సీత ముందుకు సాగారు.
వారు యమునా నదిని సమీపించారు. రాముడు లక్ష్మణుడు అక్కడక్కడా వెతికి కొన్ని కర్రలను తీసుకొని వచ్చారు. వాటిని తీగలతో కట్టి ఒక తెప్పను తయారు చేసారు. దాని మీద ఆకులతో మెత్తగా ఆసనములను ఏర్పాటు చేసారు. ముందు సీతను తెప్పలోకి ఎక్కించారు. తరువాత సీత వెంట దశరథుడు పంపిన వస్త్రములను, ఆభరణములను, రామ లక్ష్మణులు తమ వెంట తెచ్చుకున్న ఆయుధము లను, తెప్పలో పెట్టారు. తరువాత రామ లక్ష్మణులు ఎక్కారు. అందరూ ఆ తెప్పలో యమునను దాటుతున్నారు.
తెప్ప యమునానదీ మధ్యకు రాగానే సీత యమునకు నమస్కరించింది. "అమ్మా యమునా నదీమతల్లీ! మమ్ములను చల్లగా కాపాడు. మా అరణ్య వాసము నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడు. మేము సురక్షితముగా అయోధ్యకు తిరిగి వస్తే నీకు వేయి గోవులను, వంద ఘటముల మద్యమును సమర్పించుకుంటాను.” అని మొక్కుకుంది.
తరువాత అందరూ యమునా నది దక్షిణతీరము చేరుకున్నారు. అందరూ తెప్పను దిగారు. భరద్వాజుడు చెప్పిన శ్యామము అనే వటవృక్షమును సమీపించారు. సీత ఆ వటవృక్షమునకు నమస్కరించింది. తమను చల్లగా చూడమని ప్రార్థించింది.
తరువాత వారు ముందుకు సాగారు. ముందు లక్ష్మణుడు నడుస్తున్నాడు, మధ్యలో సీత వెనక రాముడు నడుస్తున్నారు. ఆ వనములోని అందాలు చూస్తూ నడుస్తున్నారు. సీత తాను అంతకు ముందు చూడని వృక్షముల గూర్చి మొక్కలు, లతల గూర్చీ రాముని అడిగి తెలుసుకుంటూ ఉంది. లక్ష్మణుడు వెళ్లి ఆయా చెట్లయొక్క ఆకులను పూలను తీసుకొని వచ్చి సీతకు ఇచ్చాడు.
ఆ ప్రకారంగా వారు ఒక క్రోసెడు దూరము నడిచారు. అక్కడ రామలక్ష్మణులు తినడానికి యోగ్యమైన జంతువులను చంపి తీసుకొని వచ్చారు. వాటిని తిని ఆకలి తీర్చుకున్నారు. అంతలో చీకటి పడింది. వారు ఒక సమతల ప్రదేశములో ఆ రాత్రికి ఉండటానికి వసతి ఏర్పాటుచేసుకున్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment