శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 54)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
యాభై నాలుగవ సర్గ
సీతా,రామ,లక్ష్మణులు మరునాడు ఉదయమే నిద్రలేచారు. సంధ్యావందనాది కార్యక్రమములు ముగించుకొని ఆ ప్రదేశము విడిచి వెళ్లిపోయారు. వారు అలా నడుస్తూ గంగానదీ యమునా నదీ కలిసే ప్రయాగ క్షేత్రమునకు చేరుకున్నారు. అప్పటికి చీకటి పడింది.“లక్ష్మణా! మనము గంగా యమునా సంగమ స్థానమునకు చేరుకున్నట్టున్నాము. ఒక నదీజలాలతో మరొక నదీజలాలు కొట్టుకుంటున్న శబ్దము వినపడుతూ ఉంది. ఇక్కడే ఏదో ఒక ముని ఆశ్రమము ఉండాలి. ఎందు కంటే ఇక్కడ వంట చేసుకోడానికి కట్టెలు కొట్టి కొన్ని ఇక్కడే పడవేసినట్టున్నట్టు కనపడుతూ ఉంది." అని అన్నాడు.
రామలక్ష్మణులు అలా నడుస్తూ భరద్వాజముని ఆశ్రమము చేరుకున్నారు. భరద్వాజముని ఉన్న కుటీరము బయట రామలక్ష్మణులు, సీత నిలబడ్డారు. ఎవరూ బయటకు రాలేదు. అందుకని రాముడు కుటీరములోకి వెళ్లాడు. కుటీరము లోపల అగ్నిహోత్రము ముందు, శిష్యుల మధ్య అగ్ని మాదిరివెలుగుతున్న భరద్వాజమహర్షిని చూచాడు రాముడు. రాముడు, లక్ష్మణుడు, సీత ఆయనకు నమస్కరించారు. రాముడు తమ్ముతాము పరిచయం చేసుకున్నాడు.
" ఓ భగవాన్ భరద్వాజ మహర్షీ! ప్రణామాలు. మేము అయోధ్యాధిపతి దశరథుని కుమారులము. రామలక్ష్మణులము. ఈమె నా అర్ధాంగి సీత. జనక మహారాజు కుమార్తె. నా తండ్రి తన భార్య కైకకు ఇచ్చిన మాట ప్రకారము, నేను వనవాసమునకు వచ్చాను. నా తమ్ముడు, నా మిత్రుడు అయిన లక్ష్మణుడు కూడా నా వెంట వచ్చాడు. నా అర్ధాంగి సీత కూడా నన్ను అనుసరించి అడవులకు వచ్చింది. మా తండ్రి మాట ప్రకారము వనవాసము చేస్తూ అడవులలో దొరికే పండ్లు ఫలములు దుంపలు తింటూ, నేల మీద పడుకుంటూ వనవాసము పూర్చిచేయాలని అనుకుంటున్నాము."అని వినయంగా అన్నాడు రాముడు.
రాముని మాటలువిన్న భరద్వాజుడు వారికి అర్ఘ్యమును, పాద్యమును ఇచ్చాడు. మధుపర్కమును ఇచ్చాడు. అడవిలో దొరికే పండ్లు వారికి తినడానికి ఇచ్చాడు. ఆ ప్రకారంగా భరద్వాజుడు రామునికి స్వాగత సత్కారాలు చేసాడు.
“ఓ రామా! చాలా కాలం తరువాత నిన్ను చూస్తున్నాను. నిన్ను మహారాజు అడవులకు పంపాడు అన్న విషయం కూడా విన్నాను. ఈ గంగా యమున సంగమము వద్ద జనములు ఎక్కువగా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది. ఫలములు, పుష్పములు సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి, నీవు ఇక్కడ ఆశ్రమము నిర్మించుకొని సుఖముగా ఉండవచ్చును." అని అన్నాడు భరద్వాజుడు.
ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు.
ఆ మాటలు వినిన రాముడు ఇలా అన్నాడు.
“ఓ మహర్షీ! ఈ ప్రదేశమునకు సమీపములో జనపదాలు ఉన్నాయి. నేను, సీతా లక్ష్మణులతో సహా ఇక్కడ ఉన్నాను అని తెలిసి, ఆ జనపదాలలో ఉన్న ప్రజలు నన్ను చూడ్డానికి ఇక్కడకు వస్తారు. అది నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ నివసించలేను. కాబట్టి నాకు ఏకాంతముగా ఉన్న ప్రదేశము ఎక్కడ ఉందో చెప్పండి. అక్కడ ఉంటాము." అని అన్నాడు రాముడు.
ఆమాటలు విన్న భరద్వాజుడు ఇలాఅన్నాడు. “ఓ రామా! ఇక్కడి నుండి పది క్రోసుల దూరములో చిత్రకూటము అనే పర్వతము ఉంది. ఆ పర్వతము గంధమాధన పర్వతముతో సమానమైన ఖ్యాతి చెందినది. అక్కడ వానరములు మొదలగు చిన్న చిన్న జంతువులు విరివిగా సంచరిస్తుంటాయి. ఆ పర్వతము మీద ఎందరో మహాఋషులు తపస్సుచేసుకుంటున్నారు. అదిమీరు ఉండటానికి తగిన ప్రదేశము. అక్కడ క్రూరమృగములకు, వికృతమైన ఆలోచనలకు తావు లేదు. అంతా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ నీవు నివాసము ఏర్పాటు చేసుకొని నీ వనవాసము పూర్తిచేయుము. లేని ఎడల, ఇక్కడే నా ఆశ్రమ ప్రాంతంలో ఒక కుటీరము నిర్మించుకొని ఇక్కడే ఉండి నీ వనవాస కాలము గడుపుము." అని అన్నాడు భరద్వాజుడు.
ఇంతలో రాత్రి అయింది. ఆ రాత్రికి సీతారామలక్ష్మణులు భరద్వాజ ఆశ్రమములోనే గడిపారు. మరునాడు ఉదయము రాముడు భరద్వాజుని వద్దకుపోయి ఇలా అన్నాడు.
“ఓ మునీంద్రా! నిన్న రాత్రి మాకు ఆశ్రయము ఇచ్చినందుకు కృతజ్ఞులము. మేము ఇక్కడి నుండి వెళ్లుటకు అనుమతి ఇవ్వండి." అని ప్రార్థించాడు రాముడు.
“రామా! నీవు చిత్రకూటమునకు పొమ్ము. అక్కడ మీకు ఫలములు, తేనె, దుంపలు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడి సెలయేళ్లలో మీకు స్వచ్ఛమైన నీళ్లు లభిస్తాయి. నీవు, సీత, విహరించడానికి ఎన్నో సుందర ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ మీరు సుఖంగా వనవాసము చేయవచ్చును. మీరు ఉండటానికి అదియే యుక్తమైన ప్రదేశము.” అని అన్నాడు భరద్వాజుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment