శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 53)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
యాభై మూడవ సర్గ
రాముని అరణ్యవాసములో మొదటి రోజు సాయంకాలము అయింది. రాముడు సాయం సంధ్యను పూర్తిచేసుకొని ఒక చెట్టు కింద కూర్చున్నాడు. లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "ఓ లక్ష్మణా! మన వనవాసములో ఒంటరిగా మొదటి రాత్రి గడప బోతున్నాము. సీత నిద్ర పోతుంటే నువ్వు, నేను, రాత్రిళ్లు ఆమెను రక్షించాలి. ఆకులతో మనకు పడకలు సిద్ధము చేయుము.” అని అన్నాడు.లక్ష్మణుడు అదే ప్రకారము చెట్లఆకులతో మెత్తని పడకలు సిద్ధం చేసాడు. వాటి మీద పడుకున్నారు రామలక్ష్మణులు. సీత నిద్ర పోయింది. రామ లక్ష్మణులకు నిద్రపట్టలేదు. లక్ష్మణునితో రాముడు ఇలా అన్నాడు.
"లక్ష్మణా! మన తండ్రి దశరథునికి రాత్రిళ్లు నిద్రపడుతుందంటావా! భరతుడు రాగానే, రాజ్యము కోసరము కైక మహారాజును చంపివేయదు కదా! ఏం చేస్తాం. మహారాజు కామంతో భార్యకు లొంగిపోయాడు. అందరినీ దూరం చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనకు ఏం జరిగినా అడిగే దిక్కు లేదు. మన మహారాజు చేసిన పని చూస్తుంటే ఆయన అర్థ కామములలో కామానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనపడుతూ ఉంది. అర్థమును వదిలి కామమునకే ప్రాధాన్యము ఇచ్చువాడు ఎల్లప్పుడూ చిక్కుల్లో పడతాడు అనడానికి మన మహారాజే ఉదాహరణ.
అయినా కానీ అక్ష్మణా, లోకం లో ఎంత తెలివి తక్కువాడైనా, భార్య మాట విని కొడుకును దూరం చేసుకుంటాడా! కాని మన మహారాజు అలా చేసుకున్నాడు. పోనీలే, భరతుడు తన భార్యా సమేతంగా అయోధ్యారాజ్యమును ఏలగలడు. రాజ్యసుఖాలు అనుభవించగలడు. ఎందుకంటే మహారాజు వృద్ధాప్యముతో మరణిస్తాడు. అగ్రజుడనైన నేను అడవులలో ఉన్నాను. ఇంక భరతునికి అడ్డేముంది. హాయిగా రాజ్యము చేసుకుంటాడు.
లక్ష్మణా! నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. కేవలము మన మహారాజును చంపడానికి, నన్ను అడవులకు పంపడానికి, భరతుని అయోధ్యకు రాజును చెయ్యడానికీ, కైక మన ఇల్లు చేరిందా అని నాకు అనుమానంగా ఉంది. లేకపోతే ఈ విధంగా వరాలు కోరడం ఏమిటి! అవి మహారాజు ఇస్తాను అనడంఏమిటి! నేను అడవుల పాలు కావడం ఏమిటి! అంతా వింతగా ఉంది కదూ.
లక్ష్మణా! ఇప్పుడు మన మహారాజు కైకమాటకు అడ్డు చెప్పడం లేదు కదా! అది సాకుగా తీసుకొని కైక మన తల్లులను బాధలు పెట్టదుకదా! లక్ష్మణా! నా వలన నువ్వు, నీతల్లి సుమిత్ర, బాధలు పడటం ఎందుకు. రేపు ఉదయమే నువ్వు అయోధ్యకు తిరిగి వెళ్లు. నీతల్లిని కైక నుండి రక్షించుకో. నేను, నా వెంట సీత, అరణ్యవాసము చేస్తాము. నువ్వు వెళ్లి నా తల్లి కౌసల్యను భరతునికి అప్పగించు. భరతుడు ధర్మము తెలిసినవాడు. నా తల్లికి ఏ అపకారమూ చెయ్యడు. ఆ ప్రకారంగా నువ్వు నా తల్లిని కైక బారినుండి రక్షించు.
లక్ష్మణా! నా తల్లి కౌసల్య, పూర్వజన్మలో, ఎప్పుడో, తల్లి బిడ్డలను దూరం చేసి ఉంటుంది. అందుకని ఈజన్మలో తనబిడ్డలకు దూరం అయింది. కొడుకులు పెరిగి పెద్దవారయి తల్లులను సుఖపెడతారని ప్రతీతి. నేను పెరిగి, పెద్దవాడనయి, నా తల్లిని సుఖపెట్టవలసిన సమయమున, ఆమెకు దూరం అయి అమెను దుఃఖపెట్టుచున్నాను. నేను నా తల్లికి ఒకే కొడుకును. నా తల్లి దు:ఖిస్తుంటే ఆమెకు నేను ఏమీ చేయలేకపోతున్నాను. నేను ఎంత పాపాత్ముడను. ఏ తల్లికీ నా మాదిరి తల్లికి కష్టములను కలిగించే పుత్రుడు కలగకూడదు.
లక్ష్మణా! నేను తల్చుకుంటే, ఒకే ఒక బాణంతో శత్రుసంహారము చేసి అయోధ్యను తిరిగి పొందగలను. కాని ఇది నా వీరత్వాన్ని చూపడానికి సమయం కాదు అని ఊరుకుంటున్నాను. ఎందుకంటే లక్ష్మణా! నేను అధర్మానికి భయపడుతున్నాను. నాకు అధర్మంగా రాజ్యమును పొందడం ఇష్టంలేదు. పైగా రాజ్యం కోసరం అధర్మంగా ప్రవర్తిస్తే, ఉత్తమలోకాలు కలుగవు కదా!" ఈ విధంగా రాముడు పరి పరి విధములుగా చింతిస్తున్నాడు.
రాముడు చెప్పిన మాటలన్నీ విన్నాడు లక్ష్మణుడు. రాముని ఓదారుస్తున్నాడు. “రామా! నీవు లేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలే కాంతి విహీనంగా ఉంది. అయినా ధీరుడవైన నీవు భీరువు వలె ఈ ప్రకారం దు:ఖపడటం మంచిది కాదు. నీవు దు:ఖపడి, నన్ను, సీతను కూడా దుఃఖపడేట్టు చేస్తున్నావు. రామా! నిన్ను చూసి నేను, సీత ఈ వనవాస కష్టములను తృణప్రాయంగా అనుభవిస్తున్నాము. నీవు లేకపోతే మేము నీటి లోనుండి బయటకు తీసిన చేపల మాదిరి గిలా గిలా కొట్టుకుంటాము.
ఓ రామా! నాకు నీవే సర్వస్వము. నీ తరువాతనే నా తల్లి, తండ్రి, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులు. తుదకు నిన్నువిడిచి స్వర్గమునకు వెళ్లమన్నా వెళ్లను. ఇది నానిశ్చయము. కాబట్టి ఇంక నిశ్చింతగా నిద్రించు.” అని అన్నాడు లక్ష్మణుడు.
లక్ష్మణుని మాటలతో కొంచెం ఊరట చెందాడు రాముడు. ఈ పదునాలుగేళ్లు వనవాసము లక్ష్మణుని సాయంతో సంపూర్ణం చేయాలి అని అనుకున్నాడు. ఆ ఊహలతోనే నిద్రలోకి జారుకున్నాడు రాముడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై మూడవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment