శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 52)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

యాభై రెండవ సర్గ

మరునాడు తెల్లవారింది. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. “లక్ష్మణా! మనము గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి.గుహునితో చెప్పి గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేయమని చెప్పు." అని అన్నాడు.

లక్ష్మణుడు వెంటనే గుహుని పిలిచి ఒక నావను సిద్ధము చేయమని చెప్పాడు. వెంటనే గుహుడు రామలక్ష్మణులు గంగానదిని దాటుటకు ఒక నావను సిద్ధం చేసాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. "మిత్రమా! నన్ను నావను ఎక్కించుము" అని అన్నాడు. గుహుడు రామలక్ష్మణులను సీతను నావ ఉన్న ప్రదేశమునకు తీసుకొని వెళుతున్నాడు.

అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! మీరు గంగానదిని దాటి ఆవల ఒడ్డుకు వెళుతున్నారు. నేనేమి చేయాలి. సెలవివ్వండి."అని అడిగాడు.

రాముడు సుమంత్రుని వీపుమీద చేయి వేసి ఆప్యాయంగా నిమిరి "సుమంత్రా! నీవు అయోధ్యకు తిరిగి పొమ్ము. మా తండ్రి దశరథుని జాగ్రత్తగా చూచుకొమ్ము. నీవు చేసిన సాయమునకు కృతజ్ఞుడను. ఇంక నేను కాలి నడకన అరణ్యములలోకి వెళ్లెదను. నీవు అయోధ్యకు వెళ్లుము." అని అన్నాడు రాముడు.

అప్పుడు సుమంత్రుడు రాముని చూచి ఇలాఅన్నాడు. “రామా! అయోధ్యకు రాజువై ఉండి కూడా, నీవు సామాన్యుని వలె అడవులలో తిరుగుతున్నావు. తండ్రి ఆజ్ఞప్రకారము ఇటువంటి పని నీవు మాత్రమే చేయగల సమర్థుడవు. కాని నీకు వచ్చిన కష్టము సామాన్యమైనది కాదు. జీవితములో ఇలాంటి కష్టములు కూడా సంభవిస్తుంటే ఇంక వేదాధ్యయనము చేసి గానీ, మంచి ప్రవర్తన కలిగి ఉండి గానీ ప్రయోజనమేమి. రామా! నీవు చేసిన వనవాసము వృధాపోదు. ఈవనవాసమునకు ప్రతిఫలముగా నీకు సద్గతులు లభిస్తాయి. కాని మేమే దురదృష్ట వంతులము. నిన్ను అడవుల పాలుచేసిన ఆ కైక చేతి కింద బ్రతుక వలసిన దౌర్భాగ్య ము పట్టినది. ఏం చేస్తాము.” అని రాముని చూచి ఏడ్చాడు సుమంతుడు.

రాముడు సుమంత్రుని చూచి ఇలా అన్నాడు. “సుమంత్రా! అన్ని తెలిసినవాడవు నీవే ఇలా దుఃఖిస్తే ఎలాగ. మా ఇక్ష్వాకు వంశమునకు, ముఖ్యంగా మా తండ్రిగారికి నీవు ఆప్తుడవు. కాబట్టి నీవు మా తండ్రిగారి మంచి చెడ్డలు చూడాలి కదా. ఆ కైకను సంతోషపెట్టడానికి మా తండ్రిగారు ఏమి చెప్పినా, ఆయన మనస్సు బాధపడ కుండా నీవు ఆపనులు అన్నీ చేయాలి కదా! ప్రస్తుతము దశరథుడు అయోధ్యకు రాజు ఆయన మాట పాలించడం మన అందరి కర్తవ్యము.

దశరథమహారాజు అనుచితమైన పనులు చెప్పినా అవి చేయడం మన కర్తవ్యము. కాబట్టి నీవు అయోధ్యకు పోయి దశరథ మహారాజుకు, నేను నమస్కరించినట్టుగా చెప్పి, ఇంకా నా మాటలుగా ఇలా చెప్పు.

"తండ్రిగారూ! నేను గానీ, లక్ష్మణుడు గానీ, సీత గానీ, మేము అడవులలో నివసించవలసి వచ్చినదే అని ఏ మాత్రమూ బాధపడటం లేదు. అరణ్యవాసము పదునాలుగుసంవత్సరములు పూర్తిచేసుకొని మేము అయోధ్యకు తిరిగి వస్తాము. అప్పుడు మేమందరమూ నీ కళ్ల ఎదుటనే ఉంటాము." అని నా మాటగా మా తండ్రిగారికి చెప్పు.

అలాగే మాతల్లి కౌసల్యను, కైకను, ఇతర తల్లుల యోగక్షేమము లను అడిగినట్టు చెప్పు. నేను, సీత, లక్ష్మణుడు మా తల్లి కౌసల్యకు పాదాభి వందనము చేసామని చెప్పు. మా తండ్రిగారికి మేమందరమూ పాదాభివందనము చేసామని చెప్పు. వీలైనంత త్వరగా మా తమ్ముడు భరతుని తీసుకొని వచ్చి అయోధ్యకు రాజుగా అభిషేకము చేయమని నామాటగా మా తండ్రిగారికి చెప్పు. 

రాజ్యాభిషిక్తుడు అయిన తరువాత భరతునితో ఈ విధంగా నా మాటగా చెప్పు. “భరతా! నీకు నీ తల్లి కైక ఎలాగో. నా తల్లి కౌసల్య, లక్ష్మణుని తల్లి సుమిత్రకూడా అలాగే. మన తండ్రిగారి కోరిక అనుసరించి నీవు అయోధ్యకు పట్టాభిషిక్తుడవై ఇహపరములలో సుఖాలు అనుభవించు.” ఈ విధంగా భరతునికి చెప్పు. సుమంత్రా! ఇంక నీవు అయోధ్యకు బయలు దేరు." అని అన్నాడు.

రాముడు చెప్పి మాటలన్నీ విన్న సుమంత్రుడి దుఃఖానికి అంతులేదు. రామునితో ఇలా అన్నాడు. “రామా! నేను నీ అనుచరుడను. భక్తుడను. కాని, నీవు చెప్పిన పనులన్నీ నేను చేయలేను. నన్ను క్షమించు. నిన్ను ఈ అడవులలో విడిచి పెట్టి నేను ఒంటరిగా అయోధ్యకు వెళ్లలేను. రాముడు నా రథము మీద అడవులకు వస్తున్నప్పుడు, అయోధ్యా వాసులు ఆ రథం వెంట పరుగెత్తి ఎంతో దు:ఖించారు. ఇప్పుడు రాముడు లేకుండా నేను రథాన్ని మాత్రం అయోధ్యకు తీసుకొని వెళితే వారి గుండెలు బద్దలవుతాయి. ఎందుకంటే అయోధ్యావాసుల గుండెల్లో నీవు కొలువుదీరి ఉన్నావు. వారు దూరంగా ఉన్నా అనుక్షణం నిన్ను తలచుకుంటూనే ఉంటారు.

ఓ రామా! నీవు అరణ్యమునకు నా రథము మీద వచ్చునప్పుడు అయోధ్యాపౌరులు ఎంతగా ఏడ్చారో, ఇప్పుడు నీవు లేకుండా వచ్చిన రథమును చూచి అంత కన్నా ఎక్కువ ఏడుస్తారు. కాబట్టి నీవు లేని రథమును నేను అయోధ్యకు తీసుకొని వెళ్లలేను.

అది సరే! నేను కౌసల్య వద్దకు పోయి ఏమని చెప్ప మంటావు? నీ కుమారుని అరణ్యములలో విడిచివచ్చాను అని చెప్పమంటావా! అది నా వల్లకాదు. ఆమాట చెప్పి నీ తల్లిని మరింత దు:ఖపెట్టలేను. కాబట్టి నేను అయోధ్యకు తిరిగి వెళ్లలేను. నీ వెంటనే ఇక్కడే ఉంటాను. అలా కాకుండా నన్ను వదిలిపెట్టి నీవు వెళ్లిపోతే, నేను ఇక్కడే చితి పేర్చుకొని అగ్నిలో దూకుతాను.

ఓ రామా! నేను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను. నీకు సాయంగాఉంటాను. అనువైన మార్గములలో నిన్ను రథం మీద తీసుకొని వెళతాను. ఇంతకాలము నీవు ఎక్కిన రథము తోలాను. ఇప్పుడు నీ వెంట ఉండి నీతో వనవాససుఖము అనుభవిస్తాను.

ఓ రామా! నేనే కాదు. నీకు సేవచేసిన ఈ హయములు కూడా ఉత్తమ గతులు పొందగలవు. నాకు స్వర్గలోక సుఖములు కూడా వద్దు. నీతోపాటు అరణ్యములలో ఉంటాను. నీవు లేని అయోధ్యలో ఉండలేను. వనవాసము పూర్తి అయిన తరువాత మనమందరమూ ఇదే రథము మీద అయోధ్యకు పోదాము. ఓ రామా! నీ వెంట ఉంటే ఈ పదునాలుగు సంవత్సరములు క్షణాల్లా గడిచిపోతాయి. కాబట్టి నన్ను నీ వెంట ఉండేటట్టు అనుగ్రహించు." అని వేడుకున్నాడు సుమంత్రుడు.

ఆ మాటలువిన్న రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “నీకు నా మీద ఉన్న భక్తి, గౌరవము నాకు తెలియవా చెప్పు. అయినా నిన్ను అయోధ్యకు ఎందుకు పంపుతున్నానో తెలుసా! నేను నిజంగా వనవాసమునకు వెళ్లాను అని నీవు కైకకు చెబితే ఆమె నమ్ముతుంది. లేకపోతే మహారాజు దశరథుడు నన్ను వేరేచోటికి పంపి వనవాసమునకు పంపాను అని అబద్ధం చెప్పాడు అని అనుకుంటుంది. కాబట్టి నీవు వెళ్లి మా వనవాసము సంగతి చెప్పి, కైక మనసులో ఉన్న శంకను పోగొట్టాలి.

నీ మాట నమ్మి కైక తన కుమారునికి పట్టాభిషేకము చేయిస్తుంది. లేకపోతే అయోధ్య అనాధగా ఉండిపోతుంది. కాబట్టి నీవు అయోధ్యకు వెళ్లక తప్పదు. అయోధ్యకు పోయి నీకు ఏమేమి
చెయ్యమని చెప్పానో అవన్నీ చేయి." అని పలికాడు రాముడు.

తరువాత గుహుని చూచి రాముడు ఇలా అన్నాడు. "మిత్రమా! నేను జనావాసములలో నివసించరాదు. కేవలము అరణ్యములలో ఆశ్రమములలో మునివేషధారణలో నివసించాలి. కాబట్టి నేను లక్ష్మణుడు జటలు ధరించాలి. దానికి అనువగు మర్రిపాలు తెప్పించు.” అని అన్నాడు.

వెంటనే గుహుడు మర్రిపాలు తెప్పించాడు. ఆ మర్రిపాలను రాముడు లక్ష్మణుడు తమ వెంట్రుకలకు పట్టించారు. తన కేశములను పైకి ఎత్తి ముని కుమారుల వలె కట్టుకున్నారు. అప్పుడు రామక్ష్మణులు ముని కుమారులవలె శోభించారు. తరువాత రాముడు వెంటనే త్వర త్వరగా గంగానది వైపు వెళ్లాడు. సీత, లక్ష్మణుడు రాముని అనుసరించారు. అందరూ పడవను సమీపించారు.

"లక్ష్మణా! ముందు నీవు పడవలో ఎక్కి తరువాత సీతను ఎక్కించుము." అని అన్నాడు. కాని లక్ష్మణుడు ముందు సీతను పడవలో ఎక్కించి తరువాత తాను ఎక్కాడు. తరువాత రాముడు పడవలో ఎక్కాడు. పడవ మెల్లిగా గంగానదిలో కదిలింది. రాముడు, సీత, లక్ష్మణుడు గంగానదీమతల్లికి నమస్కరించారు. రాముడు గుహునికి, సుమంత్రునికి వీడ్కోలు చెప్పాడు.
పడవ గంగానది మధ్యకు చేరుకుంది. 

అప్పుడు సీతాదేవి గంగానదికి నమస్కరించి ఇలా మొక్కుకుంది. "తల్లీ గంగా మాతా! నేను, రాముడు, లక్ష్మణుడు పద్నాలుగేళ్లు వనవాసము చేసి సుఖంగా తిరిగి వచ్చేట్టు దీవించు. తిరిగి వచ్చునపుడు నిన్ను పూజిస్తాను. నీ దీవెనలు ఫలించి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషేకము చేసుకున్న నాడు, నీకు సంతోషము కలిగేటట్టు బ్రాహ్మణులకు లక్షలాది గోవులను, వస్త్రములను, దానంగా ఇస్తాను. బ్రాహ్మణులకు భోజనము పెడతాను. నేను వనవాసము నుండి తిరిగి వచ్చిన తరువాత నీకు నూరు కుండలతో సురను (మద్యమును), మాంసాహారమును సమర్పించుకుంటాను. నీకే కాదు, నీ తీరమున గల సమస్త దేవాలయములలోనూ పూజలు చేయిస్తాను. మేము క్షేమంగా అయోధ్యకు తిరిగి వచ్చేట్టు దీవించు." అని గంగా దేవికి మొక్కుకుంది సీత.

పడవ గంగానది దక్షిణ తీరమునకు చేరింది. సీతారామ లక్షణులు పడవ దిగి అడవిలోకి నడుచుకుంటూ వెళ్లారు. రాముడు లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు. "లక్ష్మణా! మనము జనావాసములలో ఉన్నను, జనములు లేని ప్రదేశములో ఉన్నను, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనలను మనం రక్షించుకోవాలి. ఈ అరణ్యములో జన సంచారము కనపడటంలేదు. వన్యమృగములనుండి మనలను మనం రక్షించుకోవాలి. అందుకని నీవు ముందు నడువు. నేను నీ వెనక నడిచెదను. మనమధ్య సీత ఉంటుంది. మనము ఇద్దరము ఒకరిని ఒకరు రక్షించుకుంటూ సీతను కూడా రక్షించాలి.

లక్ష్మణా! మనకు ముందు జాగ్రత్త అవసరము. పరిస్థితి చేయి దాటిపోయిన తరువాత, చింతించి ప్రయోజనము లేదు. సీతకు వనవాసములోని కష్టముల గురించి తెలియదు. ఇంక మీదట తెలుసుకుంటుంది. సీతా! ఈ అరణ్యములలో ఉద్యానవనములు ఉండవు. అగాధమైన లోయలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడవాలి."అని అన్నాడు రాముడు.

రాముడు చెప్పినట్టు లక్ష్మణుడు ముందు నడుస్తూ దారిని చూపిస్తున్నాడు. తరువాత సీత, ఆమె వెనక రాముడు నడుస్తున్నారు.

వీరి సంగతి ఇలాఉంటే అక్కడ సుమంత్రుడు, పడవ కంటికి కనపడినంతవరకూ రాముని చూస్తూ ఉన్నాడు. పడవ కనుమరుగు కాగానే, దు:ఖంతో కుమిలిపోయాడు. రథమును తీసుకొని
అయోధ్యకు వెళ్లాడు.

రాముడు, సీతా లక్ష్మణులతో అడవులలో ప్రయాణం చేసి వత్సదేశము చేరుకున్నాడు. ఇంతలో చీకటి పడింది. రామ లక్ష్మణులు అడవిలో దొరికే వరాహములను, దుప్పులను, చంపి వాటి మాంసమును సేకరించారు. అందరూ ఒక పెద్ద వృక్షము మొదట విశ్రమించారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)