శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభై ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 51)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

యాభై ఒకటవ సర్గ

గుహుడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. "లక్ష్మణ కుమారా! వనవాస వ్రతము రామునికి కానీ నీకు కాదు కదా! నీకోసరము మెత్తని శయ్య సిద్ధమే చేసాము. నీవు దీని మీద పడుకో. మాకు ఈ కటికరాళ్ల మీద పడుకోవడం అలవాటే. నీవు రాచబిడ్డవు. నీవు పడుకోలేవు. మేము రాత్రి అంతా మేలుకొని రామునికి, నీకు కాపలా కాస్తాము.

లక్ష్మణా! నాకు ఈ లోకములో రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరూ లేరు. అటువంటి రాముడు ఇలా ఒంటరిగా అడవిలో కటికనేల మీద నిరాహారంగా నిదించడం బాధాకరంగా ఉంది. నీకు, రామునికి ఈ అరణ్యములో ఎలాంటి భయమూ లేదు. మాకు ఈ అరణ్యము కొత్త కాదు. నీవు సుఖంగా నిద్రించు." అని అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు గుహునితో ఇలా అన్నాడు.“మిత్రమా! నీవు మా పక్కన ఉండగా మాకు ఏమి భయము. అటుచూడు. నా అన్న, నా వదిన అలా కటికనేల మీద పడుకొని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది. అసలు నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది. రాజాంత:పురములలో పట్టుపరుపుల మీద పవళించిన సీతారాములు నేడు ఆ గడ్డిపానుపు మీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో చూడు. 

రాముడు దశరథునికి, ఎన్నో పూజలు వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తే పుట్టిన వాడు. అటువంటి రాముడు అడవులకు వెళితో దశరథుడు జీవించగలడా! ఏమో కొద్ది రోజులలో అయోధ్య అనాధ అవుతుందేమో అని భయంగా ఉంది. రాముని కొరకు ఏడ్చి ఏడ్చి అంత:పుర స్త్రీలు అందరూ ఈ పాటికి మౌనం వహించి ఉంటారు. రాముని తల్లి కౌసల్య, దశరథుడు, రాముడు లేడు అనే శోకంతో ఏమయ్యారో అని దిగులుగా ఉంది.

నా తల్లి సుమిత్ర నా తమ్ముడు శత్రుఘ్నుని చూచుకుంటూ జీవించి ఉంటుందేమో కానీ, ఒక్కగానొక్క కొడుకును దూరం చేసుకున్న కౌసల్య జీవించి ఉండలేదు. అదే నాకు బాధగా ఉంది. రాముడు లేని అయోధ్య కూడా నిర్జీవము అయిపోయింది. చిన్నప్పటినుండి ప్రాణానికి ప్రాణంగా చూసుకొన్న రాముడు దూరం కాగానే దశరథుని ప్రాణాలు అతని దేహంలో ఉండటం కష్టమే. రాజు మరణించగానే, కౌసల్య ప్రాణత్యాగము చేస్తుంది. కౌసల్య చనిపోగానే నా తల్లి కూడా ఆమెనే అనుసరిస్తుంది. వారి కందరికీ భరతుడు ఉత్తర క్రియలు నిర్వర్తించాలేమో!

మిత్రమా! నేను ఏమేమో ఊహించుకొనుచున్నాను. అవన్నీ నిజం కావేమో. మేము అయోధ్యకు తిరిగి వచ్చువరకూ దశరథుడు మా కోసరం అయోధ్యానగర ముఖద్వారము వద్ద వేచి ఉండి, మమ్ములను సాదరంగా ఆహ్వానించి లోపలకు తీసుకుపోతాడేమో! మేమందరమూ మా తల్లులతో ఆనందంగా ఉంటామేమో! మిత్రమా! ఏదైనా జరగ వచ్చు. దేనినీ మనము కాదనలేము కదా!" అంటూ పరిపరివిధముల మాట్లాడుచున్న లక్ష్మణుని మాటలు వింటూ ఉన్న గుహుని కూడా దుఃఖము ఆగలేదు. రామునికి, అయోధ్యకు పట్టిన దుర్గతి తలుచుకుంటూ బాధపడ్డాడు. వారిరువురి దీనాలాపములతో ఆ రాత్రి గడిచి పోయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభై ఒకటవ సర్గసంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)