శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - యాభైయవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 50)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
యాభైయవ సర్గ
రాముడు సీతాలక్ష్మణ సమేతుడై రథము మీద కోసల దేశపు సరిహద్దుల వద్దకు వచ్చాడు. అయోధ్య ఉన్న వంక తిరిగాడు. రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ “కాకుత్థ్స వంశస్థులచే పరిపాలింప బడుతున్న ఓ అయోధ్యా నగరమా! పుట్టినప్పటి నుండి నీ ఒడిలో పెరిగాను. ఇప్పుడు విధి వశాత్తు నిన్ను విడిచి వెళుతున్నాను. నిన్ను, నీలో నివసించు ప్రజలను విడిచిపోవుటకు మీ అనుమతి కోరుతున్నాను. అచిరకాలములోనే నేను వనవాసము పూర్తి చేసుకొని తిరిగి వస్తాను. అయోధ్యానగర ప్రవేశము చేస్తాను.”అని అయోధ్యాపురికి నమస్కరించాడు.అప్పటికే రాముడు వచ్చాడని వార్త తెలిసి సమీప గ్రామ ప్రజలు రాముని చూడటానికి అక్కడకు చేరుకున్నారు. వారిని చూచి రాముడు ఇలా అన్నాడు. “మీరు నా మీద జాలి చూపించారు. కాని మీ మీ పనులు మానుకొని నాకోసం దు:ఖించడం మంచిది కాదు. మీ పనులు చూచుకొనుడు." అని వారికి నమస్కరించి చెప్పాడు. వారుకూడా రామునికి పట్టిన దుర్దశకు దుఃఖిస్తున్నారు. తరువాత రాముడు కోసల దేశమును దాటి వెళ్లిపోయాడు.
రాముడు ప్రయాణించు రథము పరమ పవిత్రమైన గంగాతీరము చేరుకొంది. గంగానదీ తీరమున గల మున్యాశ్రమ ములు గంగానదికి అలంకారముగా శోభిల్లుతున్నాయి. దేవలోకమునుండి అప్సరసలు గంగా స్నానము కొరకు అక్కడకు వస్తూ ఉంటారు. పవిత్రమైన ఆ గంగను దేవతలు, దానవులు,గంధర్వులు సదా సేవిస్తూ ఉంటారు. గంగ కొన్ని ప్రదేశములలో వేగంగానూ కొన్ని ప్రదేశములలో నెమ్మదిగానూ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గంగానదిలో హంసలు, సారస పక్షులుయధేచ్ఛగా విహరిస్తుంటాయి. గంగానదికి ఆ ఒడ్డున ఈ ఒడ్డున ఉన్న పచ్చని చెట్లు గంగానదికి అలంకరించిన పూలమాలల వలె ప్రకాశిస్తున్నాయి. గంగానదీజలములు నిర్మలంగా స్వచ్ఛంగా పారుతున్నాయి. కాని అక్కడక్కడ మదగజములు గంగానదిలో దిగి స్నానము చేయడం వల్ల నీరు కలుషితము అవుతూ మరలా నిర్మలంగా మారుతూ ఉంది. గంగానదీ తీర ప్రాంతము అంతా మధురమైన ఫల వృక్షములతోనూ. పూల మొక్కలతోనూ నిండి సర్వాలంకార శోభిత అయిన మంగళకరమైన స్త్రీ వలె శోభిల్లుతూ ఉంది. అటువంటి గంగాతీరము వెంట ప్రయాణించి రాముడు శృంగిబేరపురమునకు చేరుకున్నాడు.
“సుమంత్రా! రథమును ఆపుము. ఇక్కడ ఒక ఇల్గుదీ వృక్షము ఉన్నది. ఈ వృక్షము ఫలములతో నిండి ఉంది. ఈ రాతికి మనము ఇక్కడే ఉండెదము. పవిత్ర గంగానదిలో స్నానము చేసి, ఈ చెట్టు కిందనే నిద్రించెదము." అని అన్నాడు రాముడు.
రాముని ఆదేశము ప్రకారము సుమంత్రుడు రథమును ఆవృక్షము కింద నిలిపాడు. రాముడు, లక్ష్మణుడు, సీత రథము దిగారు.
సుమంత్రుడు కూడా రథము దిగి రథమునకు కట్టిన గుర్రములను మేతకు విడిచి పెట్టి, రాముని వద్దకు వచ్చాడు.
ఆ శృంగిభేరపురంలో బోయజాతికి చెందిన వాడు, అక్కడ ఉన్న బోయలకు నాయకుడు, రామునికి మిత్రుడు అయిన గుహుడు అనే బోయవాడు నివసిస్తున్నాడు. రాముడు తన రాజ్యమునకు వస్తున్నాడని ముందే తెలిసిన గుహుడు కుల పెద్దలతోనూ, సేవకులతోనూ రాముని వద్దకు వచ్చాడు. గుహుని రాక విని రాముడు అతనికి ఎదురుపోయి అతనిని కౌగలించుకున్నాడు. గుహుని క్షేమసమాచారములు అడిగి తెలుసుకున్నాడు.
“రామా! ఇది నీకుపరాయి ఇల్లు కాదు. నీకు అయోధ్య ఎలాగో ఇదీ అలాగే. నీ ఇష్టం వచ్చినట్టు ఉండవచ్చును. నీ వంటి మిత్రుడు అతిథిగా రావడం నేను చేసుకున్న అదృష్టం. నీకు ఏమి కావాలో ఆజ్ఞాపించు. క్షణంలో సమకూరుస్తాను." అని అన్నాడు గుహుడు. రామునికి, సీత, లక్ష్మణుడు, సుమంత్రునికి రకరకాలైన భోజనములు, పానీయములు సమకూర్చాడు.
“రామా! భోజన పదార్థములు సిద్ధంగాఉన్నాయి. మీరందరూ భోజనం చేయండి." అని అన్నాడు. అప్పుడు రాముడు గుహునితో ఇలా అన్నాడు. “నీవు నా వద్దకు వచ్చి నన్ను ఆదరించడమే నీవు మాకు ఇచ్చే ఆతిధ్యము. నేను ప్రస్తుతము వనవాసములో మునివృత్తిలో ఉన్నాను. ఎవరు ఏమి ఇచ్చినా తీసుకొనను. ఫలములు తప్ప వేరే ఆహారము తీసుకొనను. కాని నా రథమునకు కట్టిన అశ్వములు మా తండ్రిగారికి ఎంతో ప్రియమైనవి. వాటికి కావలసిన ఆహారము సమకూర్చుము. అదే నాకు మహదానందము.” అని అన్నాడు రాముడు.
వెంటనే గుహుడు అశ్వములకు కావలసిన ఆహార ఏర్పాట్లు చేసాడు. ఆ రాత్రికి రాముడు కేవలము నీరు ఆహారంగా తీసుకొని నిద్రించాడు. గుహుడు ఆ రాత్రికి అక్కడే ఉన్నాడు. లక్ష్మణునితోనూ, సుమంత్రునితోనూ మాట్లాడుతూ మేలుకొని ఉన్నాడు.
రామునికి ఓ పట్టాన కటిక నేలమీద నిద్రపట్టలేదు. ఆ రాత్రి చాలా దీర్ఘంగా ఉన్నట్టు అనిపించింది రామునికి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము యాభైయవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment