శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 49)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది తొమ్మిదవ సర్గ
తనతో వచ్చిన అయోధ్యావాసులు నిద్ర లేవకముందే లేచిన రాముడు తన ప్రయాణం కొనసాగించాడు. సూర్యోదయము అయేటప్పటికి చాలా దూరం వచ్చేసారు. రామ లక్ష్మణులు ప్రాతఃసంధ్యను పూర్తి చేసుకొని మరలా ప్రయాణం అయ్యారు. అనేక గ్రామాల గుండా ప్రయాణిస్తున్నారు. ఆ గ్రామ ప్రజలు రాముని వనవాసము గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు."ఆ దశరథుడు కామానికి వశుడై తన భార్య కైక మాటలు విని కన్నకుమారుని అడవులకు వెళ్లగొట్టాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి మాట కాదనలేక అడవులకు వెళ్లాడు ఏమి ఆశ్చర్యము. అయినా రాముడు అడవులకు వెళ్లాడు. ఆయనతో పాటు సీత ఎందుకు వెళ్లాలి? సుకుమారి అయిన సీత అడవులలో ఎలా ఉండగలదు? రామునితోపాటు సీత కూడా అన్ని కష్టాలు పడవలసిన దేనా! ఎంత దారుణము.” అని రక రకాలుగా అనుకుంటున్నారు.
వారి మాటలు వింటూ రాముడు అరణ్యముల వంక సాగుతున్నాడు. వారు వేదశ్రుతి అనే నదిని దాటారు. దక్షిణ దిక్కుగా ఉన్న అగస్త్య ఆశ్రమము వైపు ప్రయాణం చేస్తున్నారు. అలా ప్రయాణం చేస్తూ వారు గోమతీ నదీ తీరానికి చేరుకున్నారు. గోమతీ నదిని దాటిన తరువాత వారు స్యందికా నదిని చేరుకున్నారు. ఆ నదిని కూడా దాటి వారు పూర్వము మను చక్రవర్తి రాముని మూల పురుషుడైన ఇక్షాకువునకు ఇచ్చిన విశాలమైన భూములలోకి ప్రవేశించారు. ఆ భూమి నంతనూ రాముడు సీతకు చూపించి దాని గురించిన వృత్తాంతమును సీతకు వివరించాడు. సారవంతమైన ఆ భూముల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు. అనేక వన్యప్రాణులతో నిండిన అడవులలో గుండా వారు వెళుతున్నారు. అప్పుడు సుమంత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు.
“సుమంత్రా! నేను వనవాసము ముగించుకొని తిరిగివచ్చి తల్లితండ్రుల దర్శనము చేసుకొని ఈ వనసీమలలో ఎప్పుడు తనివిదీరా వేటాడెదనో కదా! వేట క్షత్రియులకు ఉచితమే కానీ నాకు ఎందుకో సరయూనదీతీరములో ఉన్న ఈవనములలో వేటాడవలెనని కోరిక అంతగా లేదు. అసలు నాకు వేట మీద అంత మక్కువ లేదు. అరణ్యములలో వాటి మానాన అవి బతుకుతున్న అమాయకమైన ఆ పాణులను, కేవలం మన ఆనందం కోసరం, వేట మిషతో చంపడం పాపం కదా! అందుకనే నాకు వేట మీద అంతగా కోరిక లేదు. కాని క్రూర మృగములు విజృంభించినపుడు వేటాడక తప్పదు." అని వేట గురించి ముచ్చటించుకుంటూ రాముడు సుమంత్రుడు నడిపే రథం మీద ప్రయాణిస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదితొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment