శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 48)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నలుబది ఎనిమిదవ సర్గ

రామునితో వెళ్లిన పౌరులు తిరిగి రావడం చూచారు అయోధ్యపుర స్త్రీలు. వారు రాముని తిరిగి తీసుకొని వస్తారు అని ఎంతో ఆశతో ఉన్నారు. వారి ఆశలు అన్నీ నిరాశలు అయ్యాయి. రాముని అడవిలో వదిలి ఇళ్లు చేరిన పౌరులు తమ తమ భార్యా పుత్రులకు తమ ముఖములు చూపించలేక పోయారు. అయోధ్యలో ఎవరూ తమ తమ ఇళ్లలో వంటచేసుకోలేదు. దేవాలయములలో పూజలు జరగలేదు. వర్తకవాణిజ్యములు మూతబడ్డాయి.

రాముడు అడవులకు పోయినందుకు ప్రతి ఇంటిలోనూ దు:ఖము శోకము తాండిస్తూ ఉంది. రాముని లేని అయోధ్యలో తమకు సుఖసంతోషాలు ఎక్కడివని అందరూ అనుకుంటున్నారు. ఈ లోకంలో ఎవరన్నా పుణ్యము చేసుకున్న వాడు ఉన్నాడు అంటే అతడు లక్ష్మణుడే. ఎందుకంటే అతడు ఒక్కడే రాముడి వెంట అరణ్యములకు వెళ్లాడు. రామునికి సేవచేస్తున్నాడు. ఇది వారందరి నిశ్చితాభిప్రాయము. రామునికి అనునిత్యమూ ఫలములను ఇస్తూ సేవ చేసే వృక్షములు తమ కన్నా ఎంతో మేలు అని అనుకొన్నారు. సీతారాములకు ఆనందం కలిగించే వివిధరకములైన పూలు తమకన్నా ఎంత పుణ్యం చేసు కున్నాయి అని అనుకొన్నారు.

కొండల మీదినుండి పర్వతముల మీది నుండి జలజలపారే సెల ఏళ్లు రామునికి స్నానమునకు కావలసిన నీటిని సమకూరు స్తున్నాయి. ఇవి తమ కన్నా ఎంతో మేలైనవి అని అనుకొన్నారు. తాము అయోధ్యలో ఉన్నా సుఖపడలేమని, రాముని తో పాటు అరణ్యములలో ఉంటేనే తాము సుఖసంతోషాలతో ఉండగల మని అనుకొన్నారు. అయోధ్యావాసము తమకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేదని వారి నిశ్చితాభిప్రాయము.

ప్రస్తుతము అయోధ్యకు రాణి కైక. దశరథుడు నామమాత్రపు రాజు. రాజ్యము కొరకు రాముని, తనభర్తను వదిలి వేసిన కైక ఇంక ఎవరిని లక్ష్యపెడుతుంది. కైక రాజ్యములో ఆమెకు సేవకులుగా ఎంతమాత్రము ఉండజాలము అని అందరూ అనుకున్నారు. రాముని అడవికి పంపిన దుర్మార్గురాలు. ఆమె పాలనలో ఎవరు సుఖపడతారు. సుఖంగా జరుగుతున్న అయోధ్య పాలన, కైక వలన అస్తవ్యస్తము అయింది. సర్వనాశనము అయింది.

రాముడు అరణ్యములకు వెళ్లాడు, రాముని చూడనిదో దశరథుడు జీవించలేడు. దశరథుని మరుణానంతరము అయోధ్యలో సుఖము, సంతోషము కరువవుతాయి. అంతా శోకమయం అవుతుంది. అయోధ్యా వాసుల పుణ్యము అంతరించింది. అందుకే రాముడు మనలను విడిచి వెళ్లిపోయాడు. ఇప్పుడు రాముడు వెంట అడవులకు వెళ్లడమో లేక విషంతాగి చావడమో రెండే మార్గాలు అయోధ్యా వాసులకు మిగిలి ఉన్నాయి. అంతేగాని భరతుని పాలనలో బతకడం అసాధ్యము. రాముడు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు వెన్నెల ఉంటాయి.”

ఈ ప్రకారంగా అయోధ్యలో ఉన్న స్త్రీపురుషులు ఎవరికి తోచినట్టు వారు అనుకుంటున్నారు. ఇంతలో సూర్యాస్తమయము అయింది. చీకట్లు అలుముకుంటున్నాయి. నగరంలో జనసంచారము తగ్గిపోయింది. ఆరోజు అయోధ్యలో ఉన్న ప్రజలు తమ తమ కుమారు లను, సోదరులను పోగొట్టుకున్నట్టు శోకసముద్రంలో మునిగి పోయారు. అయోధ్యలో ఎటువంటి వినోదకార్యక్రమములు, ఉత్సవములు జరగడం లేదు. అయోధ్యలో ఆనందమే కరువైపోయింది. చంద్రుడి లేని ఆకాశమువలె నీరులేని సముద్రము వలె రాముడు లేని అయోధ్య అనాధ అయింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)