శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 47)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నలుబది ఏడవ సర్గ

రాముని వెంట అడవులకు వచ్చిన బ్రాహ్మణులు పౌరులు ఉదయమే నిద్ర లేచారు. కాలకృత్యములు తీర్చుకున్నారు. సంధ్యా వందనము ఆచరించారు. రాముని కొరకు చూచారు. కాని సీతారామలక్ష్మణులు కనిపించలేదు. అడవి అంతా వెతికారు. కాని వారి జాడలేదు. వారిలో వారు ఇలా అనుకుంటున్నారు.

"ఏమిటీ మనము ఒళ్లు తెలియకుండా నిద్రపోయాము. ఉదయమే మెలుకువ రాలేదు. మన కోసం చూచి రాముడు తన దారిన తాను వెళ్లిపోయి ఉంటాడు. ఏం చేస్తాం. రాముడు ఇన్నాళ్లు మనలను కన్నబిడ్డలవలె చూచుకున్నాడు. ఇప్పుడు ఆయనకు అరణ్యవాసము దాపురించింది. అందుకే మనలను విడిచి వెళ్లి పోయాడు. ఇంక మనకు దిక్కు ఎవ్వరు. రాముని విడిచి మనము జీవించలేము. మనము కూడా రాముడు వెళ్లిన ఉత్తర దిక్కుగా వెళ్లాము. ఏనాటి కైనా రాముడు మనకు కనపడకపోతాడా! రాముడు లేకుండా జీవించడం కంటే రాముని వెదకడమే ఉత్తమము. లేకపోతే ఇక్కడే మనము పెద్ద చితి పేర్చుకొని అందులో అందరమూ అగ్ని ప్రవేశము చేస్తాము.
ఇప్పుడు మనము రాముడు లేకుండా అయోధ్యకు వెళితే,

మన ఇంట్లో వాళ్లు “రాముడు ఏడీ!" అని అడిగితే ఏమని సమాధానము చెప్పగలము. రాముని అరణ్యములలో వదిలి వచ్చాము అని చెప్పాలా! మనమందరమూ రాముని తిరిగి తీసుకు వస్తామని అయోధ్యావాసులు అందరూ మనకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మనము రాముడు లేకుండా వెళితే వారి దు:ఖమునకు అంతు ఉండదు.

రాముడు ఉన్నప్పుడు మనము అయోధ్యలో ఉన్నాము. రాముని వెంట అడవులకు వచ్చాము. రాముడు లేని అయోధ్యలో మరలా అడుగుపెట్టలేము. ఇప్పుడు ఏమి చెయ్యడం." అంటూ తమలో తాము వ్యాకులపడుతున్నారు.

కొంత మంది రథము పోయిన జాడలు అనుసరించి పోదామన్నారు. అందరూ రథము జాడల అనుసరించి వెళ్లారు.కాని ప్రయోజనం లేకపోయింది. ఇంక చేసేది లేక అందరూ తిరిగి అయోధ్య దారి పట్టారు. సాయంత్రానికి అయోధ్యానగరము చేరుకున్నారు. రాముని లేని అయోధ్య వారికి పాడుబడినట్టు కనిపించింది. చంద్రుడు లేని ఆకాశము లాగా వెలవెలబోతున్న అయోధ్యను వారు చూడలేక పోయారు. రాముని వదిలివచ్చిన దుఃఖముతో ఎవరి గృహములకు వారు వెళ్లిపోయారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)