శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 46)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

నలుబది ఆరవ సర్గ

తమసానదీ తీరమునకు చేరుకున్న రాముడు, సీతతో, లక్ష్మణునితో ఇలా అన్నాడు.
“ఓ సీతా! లక్ష్మణా! ఇప్పుడు మనము వనవాసములోకి ప్రవేశించాము. మన వనవాసములో ఇది తొలి రాత్రి. చీకట్లు కమ్ముకుంటున్నాయి. పక్షులు కూడా తమ తమ గూళ్లకు చేరి నిశ్శబ్దంగా నిద్రపోతున్నాయి. అయోధ్యలోని మనవారందరూ మన కోసము దు:ఖిస్తూ ఉంటారు. ముఖ్యంగా నా తల్లి కౌసల్య, నా తండ్రి దశరథుడు నా కోసం ఏడ్చి ఏడ్చి అంధులుగా మారిపోతారా అని భయంగా ఉంది. నా తల్లి తండ్రులను ఇంక భరతుడే ఓదార్చాలి. అయినా ధర్మాత్ముడు అయిన భరతుడు ఉండగా నా తల్లితండ్రులకు భయమేముంటుంది.

లక్ష్మణా! నీవు నా వెంబడి రావడం నా మంచికే జరిగింది. లేకపోతే నేను ఒక్కడినే సీతా సంరక్షణ భారం వహించవలసి వచ్చేది. ఓ లక్ష్మణా! ఈ రాత్రికి నేను ఆహారం ఏమీ తీసుకోను. కేవలము నీళ్లు తాగి ఉంటాను. నాకు భోజనము చెయ్యాలని కోరిక లేదు. నీవు మాత్రము మన రథాశ్వములను జాగ్రత్తగా చూచుకో. వాటికి కావలసిన ఆహారపానీయాలు అందాయోలేదో చూడు." అని అన్నాడు
రాముడు.

రథమును తోలుకొని వచ్చిన సుమంత్రుడు గుర్రములకు కావలసిన ఆహారము పెట్టాడు. వాటిదగ్గరే ఉన్నాడు. తరువాత సుమంత్రుడు రామునకు, సీతకు, లక్ష్మణునకు చెట్ల ఆకులతో కూడిన శయ్యలు(పడకలు) ఏర్పాటు చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ శయ్యలమీద పడుకున్నారు. రాముడు సీత నిద్రపోయారు గానీ, సుమంత్రునికి లక్ష్మణునికి నిద్రపట్టలేదు. వారు ఇద్దరూ రాముని సద్గుణముల గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఇంతలో రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. సూర్యోదయము కావచ్చింది. రాముని వెంట వచ్చిన బ్రాహ్మణులుకూడా తమసానదీ తీరంలో నిదించారు.

పెందరాడే నిద్రలేచిన రాముడు లక్ష్మణునితో ఇలాఅన్నాడు. “ఓ లక్ష్మణా! వీరిని చూడు. నాకోసరము, నామీద ప్రేమతో అభిమానంతో తమ తమ గృహములను విడిచి నా వెంట అడవులకు వచ్చారు. చెట్ల కింద, కటిక నేలమీద నిద్రిస్తున్నారు. వీరు నా కోసం తమ ప్రాణములనైనా ఇస్తారు కానీ తమ తమ నివాసములకు వెళ్లేటట్టులేదు. కాబట్టి అధర్మమైనా నాకు ఒక మార్గము తోచుచున్నది. వీరందరూ నిద్రలేచే లోపు మనము రథం ఎక్కి దూరంగా వెళ్లి పోదాము. అప్పుడు వీరు చేసేది లేక తిరిగి అయోధ్యకు వెళ్లిపోతారు. మనతో పాటు వీరికీ వనవాసము తప్పుతుంది. ఇంక వీళ్లకు ఈ చెట్లకింద నిద్రించే అవసరము ఉండదు. పౌరులకు ఏదైనా దు:ఖము కలిగితే రాజులు తొలగించాలి కానీ, రాజులే పౌరులకు దు:ఖము కలిగించకూడదు." అని అన్నాడు రాముడు.

“రామా! నీ మాటలు చాలా బాగున్నాయి. అలాగే చేద్దాము. సుమంత్రా రథమును సిద్ధం చెయ్యి. మనం వెంటనే బయలుదేరాలి.” అని అన్నాడు లక్ష్మణుడు.

సుమంత్రుడు త్వరత్వరగా రథమును సిద్ధం చేసాడు. రాముడు, సీత, లక్ష్మణుడు రథం ఎక్కారు. వారు రథము మీద తమసా నదీ తీరాన్ని దాటారు. రాముడు సుమంత్రునితో ఇలా అన్నాడు. “ఓ సుమంత్రా! నీవు ఉత్తరదిక్కుగా కొంతదూరం ప్రయాణించి తరువాత రథమును వెనుకకు తిప్పుకొనిరమ్ము. మా వెంట వచ్చిన బ్రాహ్మణులకు కనపడకుండా మరలా మావద్దకు రథమును తీసుకొని రా. ఎట్టి పరిస్థితులతోనూ మా విషయం వారికి తెలియనియ్యకు.” అని అన్నాడు. సుమంత్రుడు.

రాముడు చెప్పినట్టే చేసి రథమును మరలా రాముని వద్దకు తీసుకొని వచ్చి నిలిపాడు. తరువాత సీతారామలక్ష్మణులు రథం ఎక్కారు. సుమంత్రుడు రథమును అరణ్యమార్గములో పోనిచ్చాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్

Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)