శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరవయ్యవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 60)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరవయ్యవ సర్గ
ఇంతలో కౌసల్య సుమంత్రుని చూచి ఏడుస్తూ ఇలా అంది. “సుమంత్రా! నేను రాముని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నన్ను కూడా రాముని వద్దకు తీసుకొనిపో. నీవు నన్ను రాముని వద్దకు తీసుకొని పోతావా లేక నన్ను యమలోకానికి పొమ్మంటావా నువ్వే చెప్పు. రథమును వెనక్కు మరల్చు." అని ఆవేశంతో పలికింది కౌసల్య.అప్పుడు సుమంత్రుడు చేతులు జోడించి ఇలా అన్నాడు. “అమ్మా! మీరు శోకమును వదిలిపెట్టండి. రాముడికి అడవులలో ఏ కష్టమూ రాదు. లక్ష్మణుడు రాముని పక్కన ఉండగా రామునికి ఏలోటూ రాదు. ఇంక సీత కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఉంది. ఏ మాత్రం భయం, బాధ పడటం లేదు. భర్తతో సంతోషంగా ఉంది. ఇక్కడ ఉద్యానవనములలో ఎలా విహరిస్తూ ఉందో అడవులలో కూడా అలాగే విహరిస్తూ ఉంది. సీత తనకు ఇచ్చిన ఆభరణములు ధరించి ఎంతో ఉల్లాసంగా ఉద్యానవనములో తిరుగుతున్నట్టు అడవులలో విహరిస్తూ ఉంది. ఆమెలో ఆత్మ విశ్వాసము కనపడుతూ ఉంది. ఏ మాత్రం దు:ఖము కనపడటం లేదు. సీత హృదయము ఎల్లప్పుడూ రాముని యందే లగ్నం అయి ఉంది. రాముడు ఎక్కడ ఉంటే అదే ఆమెకు అయోధ్య. రాముడు లేని అయోధ్య సీతకు అడవులతో సమానమే. కాబట్టి మనము రామ లక్ష్మణుల గురించి గానీ సీత
గురించి గానీ శోకించనవసరము లేదు.
ఇంక సీత కైకను గురించి ఏమేమో అన్నది కానీ నాకు గుర్తు లేదు. కానీ సీతారామలక్ష్మణులు మాత్రం ఎంతో ఉల్లాసంగా ఉన్నారు అని మాత్రం చెప్పగలను." అని సుమంత్రుడు పరి పరి విధాలుగా ఓదారుస్తున్నా కౌసల్య తన దు:ఖము మానలేదు. రామా రామా అని పలవరిస్తూ ఉంది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరవయ్యవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment