శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 61)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది ఒకటవ సర్గ
తరువాత కౌసల్య, మహారాజు దశరథుని చూచి ఇలా పలికింది. “మహారాజా! తమరు దయగలవారని ముల్లోకములలో అనుకుంటారు కదా! కాని కన్నకుమారుని, కోడలిని, ఎలా అడవులకు పంపగలిగావు. నీ దయాగుణము అంతా ఏమయింది? అది సరే! ఏ పాపమూ ఎరుగని సీతను కూడా అడవులకు పంపావు కదా! ఆమె అడవులలో ఎలా తిరుగ గలదు? ఆ కందమూలములు ఎలా తినగలదు అని ఆలోచించావా! పొద్దుటే మంగళవాద్యములను వినడానికి అలవాటు పడిన సీత క్రూరమృగముల అరుపులు ఎలా వినగలదు అని ఎన్నడైనా ఆలోచించారా! తమరి కన్న కుమారుడు అడవులలో ఎటువంటి బాధలు పడుతున్నాడో మీకు తెలుసా! రాముని చూడకుండా ఉండటానికి మీది హృదయమా లేక బండరాయా!మహారాజా! రాముడు పదునాలుగు సంవత్సరములు వనవాసము ముగించుకొనితిరిగి అయోధ్యకు వచ్చిన నాడు భరతుడు తిరిగి రాజ్యమును రామునికి ఇస్తాడంటారా! ఒక వేళ భరతుడు ఇచ్చినా రాముడు తిరిగి రాజ్యము స్వీకరిస్తాడా! ఏమో నాకు మాత్రం ఊహకు కూడా అందటం లేదు. ఎందుకంటే మరొక మృగము తిన్న ఆహారమును పెద్దపులి తినదు. అలాగే భరతుడుకి ఇవ్వబడిన రాజ్యమును రాముడు తిరిగి స్వీకరించడు.
రాముడు ఆత్మాభిమానము కలవాడు కదా! యుద్ధము చేసి అన్నా రాజ్యము తీసుకుంటాడు కానీ భరతుని దయాధర్మభిక్ష కిందతీసుకోడు. రామునికి జరిగిన అవమానానికి ఆరోజే రాముడు తమరిని నరికి వేసి ఉండేవాడు. కానీ తండ్రి అనే గౌరవంతో విడిచి పెట్టాడు అని అనుకుంటాను. లేకపోతే రాముని పరాక్రమునకు ముల్లోకములలో తిరుగులేదు కదా! తన తోకతొక్కిన వాడిని వ్యాఘ్రము ఎలా క్షమించదో అలాగే తనకు అపకారము చేసిన వాడిని రాముడు కూడా క్షమించడు. అటువంటి రాముని పరాక్రమాన్ని వీరత్వాన్నీ నీవు నాశనం చేసావు. దేశం నుండి వెళ్లగొట్టావు. ఇది ధర్మాత్ములు చెయ్యదగిన పనేనా!
ధర్మ శాస్త్రము ప్రకారము స్త్రీకి మొదటి రక్షకుడు భర్త. రెండవ రక్షకుడు కుమారుడు. మూడవ రక్షకుడు జ్ఞాతి. నాకు భర్తగా నువ్వు ఉండీ లేనట్టే. నాకు నా కుమారుని దూరం చేసావు. నన్ను గతిలేని దానిని చేసావు. అధోగతి పాలు చేసావు. నన్నే కాదు ఈదేశాన్నే నాశనం చేసావు. దిక్కులేకుండా చేసావు. నీవు చేసిన పనుల వలన నీ భార్య కైక, నీ కుమారుడు భరతుడు మాత్రమే ఆనందిస్తారు. తక్కినవాళ్లు దు:ఖములో మునిగితేలుతున్నారు. కేవలం ఇద్దరి సుఖం కోసం ఇంతమందిని క్షోభపెట్టడం ధర్మమా!" అని కౌసల్య దశరథుని అనరాని మాటలు అంటూ ఉంటే దశరథుడు కిమ్మనకుండా అన్నీ భరిస్తున్నాడు. తాను చేసిన తప్పుకు ఇదే సరైన శిక్ష అని అనుకుంటూ అన్నింటినీ భరిస్తున్నాడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment