శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 62)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

అరువది రెండవ సర్గ

రాముని వియోగంతో కుమిలిపోతున్న కౌసల్య అన్న మాటలకు దశరథుడు బదులు చెప్పలేకపోయాడు. తనలో తాను దు:ఖిస్తున్నాడు. ఆ దు:ఖంలోనే దశరథునికి తాను పూర్వము చేసిన పాపము గుర్తుకు వచ్చింది. తాను వేసిన శబ్దవేధి బాణముల వలన కలిగిన మహాపరాధము తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తానుచేసిన పాపము మరొకరితో పంచుకొంటేనేగాని తీరదు అని అనుకున్నాడు. కౌసల్య వంక తిరిగాడు. ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అన్నాడు.

“కౌసల్యా! భర్త గుణవంతుడైనా, దుర్మార్గుడైనా, సతికి పతియే కదా ప్రత్యక్ష దైవము. నీకు దుఃఖము లేదు అని నేను అనను. కాని ఎంత దు:ఖములో కూడా భర్తనైన నన్ను ఈ విధంగా తిట్టడం ధర్మమేనా! ఆలోచించు." అని అన్నాడు.

ఆ మాటలకు కౌసల్య తన కన్నీటితోనే బదులు చెప్పింది. అలాగే దశరథుని పాదముల మీద వాలి పోయింది. ఆయన పాదములు తన కన్నీటితో అభిషేకించింది.

“మహారాజా! మీరు నన్ను వేడుకొనడం ద్వారా నన్ను మీరు ఖండ ఖండాలుగా ఖండించినట్టయింది. మిమ్మల్ని తిట్టడం ద్వారా నేను మహాపరాధమే చేసాను. కాని మీరు కోపించకుండా నన్ను అనునయిస్తున్నారు. నేను ఎంత పాపం చేసానో ఇప్పుడు నాకు అర్థం అయింది. ఓ మహారాజా! మీరు ధర్మాత్ములు అని నాకు తెలియును. నాకూ ధర్మం తెలుసు. అంత అవివేకురాలిని కాను. కానీ పుత్రశోకం తట్టుకోలేక ఆ బాధలో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను.

మహారాజా! తమరికి తెలియనిది కాదు. శోకము అన్ని అపరాథములకు మూలము. శోకసముద్రములో మునిగిన వాడికి మంచి చెడూ తెలియదు. శాస్త్రజ్ఞానము నశిస్తుంది. ధైర్యాన్ని కోల్పోతాడు. తాను ఏం చేస్తున్నాడో ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉంటాడు. శోకము మనిషికి కనపడని శత్రువు. సర్వనాశనం చేస్తుంది. ఎదురుగా ఉన్న శత్రువు కొట్టిన దెబ్బను తట్టుకోవచ్చు కానీ, మనసులో పుట్టిన చిన్నపాటి దు:ఖమును తట్టకోడం కష్టం. అన్ని ధర్మములు తెలిసినవారు, సర్వసంగపరిత్యాగులు అయిన సన్యాసులు కూడా శోకముతో కుమిలిపోవడం, మూర్ఖంగా ప్రవర్తించడం మనకు తెలుసుకదా!

ఓ మహారాజా! రాముడు మనలను విడిచిపోయి నేటికి ఐదు దినములు అయినది కానీ నాకు ఐదు సంవత్సరములు అయినట్టుంది. రాముడు మనసులో మెదిలితేనే నాకు దుఃఖము ముంచుకొస్తూ ఉంది. ఆ శోకావేశములో ఏమేమో మాటలాడి ఉంటాను. నన్ను క్షమించండి." అని ప్రార్థించింది కౌసల్య.

ఇంతలో సాయంకాలము అయింది. దశరథుడు అలాగే ఒరిగిపోయి నిద్రలోకి జారుకున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)