శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 63)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది మూడవ సర్గ
దశరథుడు కలతనిద్రలో ఉన్నాడు. పూర్వము జరిగిన సంఘటనలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. నిద్రపట్టడం లేదు. ఆ విషయం కౌసల్యకు చెబితే తన దుఃఖము కొంచెమైనా ఉపశమిస్తుంది అని అనుకున్నాడు. కౌసల్యను పిలిచాడు. తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఆమెతో ఇలా చెప్పసాగాడు.“ ఓ కౌసల్యా! మానవుడు తాను చేసిన పుణ్యమునకు పాపమునకు ఈ జన్మలోనే తగిన ఫలితాన్ని అనుభవిస్తాడు. వాడు ఎవరైనా సరే, ఒక పనిని మొదలు పెట్టే ముందు, తాను చేయబోయే పని మంచిదా, చెడ్డదా, ఆ పని వలన మంచి ఫలితము వస్తుందా లేక చెడ్డ ఫలితము వస్తుందా అని తెలుసుకొని తరువాత ఆ పని మొదలుపెట్టాలి. అలా చెయ్యని వాడు మూర్ఖుడు, ఏమీ తెలియని వాడు అని పెద్దలు అంటారు.
మోదుగుపూలు పెద్దవిగా ఉంటాయి. కాని మామిడి పూత చాలా చిన్నదిగా ఉంటుంది. మోదుగ పూలు పెద్దవి కాబట్టి పెద్ద పెద్ద కాయలు, పండ్లు కాస్తాయి అని మామిడి చెట్లను నరికి, మోదుగ చెట్లను పెంచిన వాడు మూఢుడు కాక మరేమవుతాడు. ఎందుకూ పనికిరాని మోదుగ కాయలను చూచి ఏడుస్తాడు. తాను చేయబోయే పనికి ఎలాంటి ఫలితం వస్తుందో తెలియకుండా ఆ పని చేసేవాడు, పూతా పిందే లేని చెట్టుకు నీరు పోసి పెంచిన వాడితో సమానము. మామిడి చెట్టులాంటి రాముని అడవులకు పంపి, మోదుగ చెట్లను పెంచుతున్నాను. కాని ఈ పాపమునకు బలమైన
కారణము ఉంది.
నేను మంచి యవ్వనములో ఉండగా నాకు శబ్దవేధి విద్యనేర్చుకున్నాను. ఎంత చీకటిలో ఉన్న మృగము నైనా అది చేయు శబ్దమును విని దానిని గురితప్పకుండా కొట్టగల నేర్పు నాకు ఉండేది. అదే నాకు చేటు తెచ్చింది. మహా పాపము చేయించింది.
ఓ కౌసల్యా! అప్పటికి నాకు వివాహము కాలేదు. మంచి యవ్వనములో ఉన్నాను. పైగా యువరాజును కోరికలు ఎక్కువ. దానితో కూడా మదము, గర్వము కూడా ఎక్కువే. ఒక వర్షాకాలంలో నేను సరయూనది సమీపములోని అడవికి వేటకు వెళ్లాను. వేటాడి వేటాడి అలసి పోయాను. అంతలో చీకటి పడింది. నాకు రాత్రిళ్లు వేటాడటం చాలా ఇష్టం. సరోవరములో నీటిని తాగుటకు వచ్చు జంతువులు నీరు తాగునపుడు చేయు గుడ గుడ శబ్దములను బట్టి వాటిని బాణములతో కొట్టి వినోదించేవాడిని.
అదే ప్రకారము ఆ రాత్రికూడా నేను ఒక సరోవరము దాపున మాటు వేసి కూర్చున్నాను. ఆ రోజు ఒక ఏనుగును వేటాడవలెనని సంకల్పముతో ఉన్నాను. ఇంతలో నీటిలో దిగిన శబ్దము, కుండలో నీరు నింపునపుడు వచ్చే శబ్దము నాకు వినపడ్డాయి. నేను ఏనుగు తన తొండముతో నీరు తాగుతూ ఉంది అని అనుకున్నాను. ఒక బాణము తీసి, ఆ శబ్దము వచ్చు వైపు గురిపెట్టి కొట్టాను. ఏనుగు ఘీంకారమునకు బదులు "అయ్యో అమ్మా అమ్మా" అంటూ మనిషి అరిచిన శబ్దము వినపడింది.
నేను పరుగు పరుగున ఆ సరోవరము వద్దకు వెళ్లాను. అక్కడ ఒక ముని కుమారుడు పడి ఉన్నాడు. నేను వదిలిన బాణము అతని గుండెల్లో గుచ్చుకొని ఉంది.
"మేము ఈ అడవితో తపస్సుచేసుకుంటుంటే మా మీద ఏ దుర్మార్గుడు బాణప్రయోగము చేసినాడో కదా! మేము ఎవరికీ అపకారము చేయలేదే! నీళ్లు తీసుకొని పోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. కాని నన్ను ఎవరో బాణంతో కొట్టారు. మేము హింస అంటే ఏమిటో ఎరుగము. ఎవరికీ ఏ విధమైన అపకారమూ చెయ్యము. అటువంటిమాకు ఈ విధంగా బాణంతో కొట్టి మరణ శిక్ష విధించుటకు కారణమేమి? నేను ఎవరికీ ఏ అపకారము చెయ్యలేదు. అంటువంటిది నన్ను ఎందుకు బాణంతో కొట్టాల్సివచ్చింది. అతడు ఎవరో కానీ ఏ విధంగానూ మంచి ఫలితము ఇవ్వని ఈ పని చేసి మహాపాపం చేసాడు. నేను చనిపోతున్నందుకు నాకు విచారములేదు. కాని నా తల్లి తండ్రుల గురించే నాకు బాధగా ఉంది. నా తల్లి తండ్రులను వారి వృధ్యాప్యములో నేను వారిని పోషిస్తున్నాను. నేను ఇలా అర్థాంతరంగా మరణిస్తే వారికి దిక్కు ఎవరు? ఆ మూర్ఖుడు ఎవరో గానీ నన్ను మాత్రమే చంపలేదు. నాతోపాటు నా తల్లితండ్రులను కూడా చంపాడు. " అని పరి పరి విధములుగా బాధతో విలపిస్తున్నాడు.
ఆ మాటలు విన్న మా మనసు వికలమైపోయింది. ఏమి చెయ్యడానికి తోచలేదు. ఆ ముని కుమారుని దగ్గరగా వెళ్లాను. అతడు తెచ్చిన కుండా పక్కనే పడి ఉంది. అతని శరీరం అంతా రక్తంతో తడిసిపోయి ఉంది. నేను అతని పక్కనే కూర్చున్నాను. ఆ ముని కుమారుడు కళ్లు పైకెత్తి నన్ను చూచాడు.
“ఓ రాజా! నువ్వేనా నన్ను బాణంతో కొట్టింది. నేను నీకు ఏమి అపకారము చేసానని నన్ను బాణంతో కొట్టావు. నేను నా తల్లి తండ్రుల కొరకు నీళ్లు తీసుకొని పోవడానికి వచ్చాను. అది అపరాధమా! నువ్వు నన్నే కాదు. నా తల్లి తండ్రులనుకూడా చంపావు. నా తల్లి తండ్రులు దాహంతో అలమటిస్తున్నారు. నేను నీళ్లు తీసుకొని వస్తానని నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని నేను ఇక్కడ బాణము తగిలి చనిపోయినట్టు వారికి తెలియదు. నా తండ్రికి నేను చనిపోయానని తెలిసినా ఏమీ చేయలేడు కదా! ఒక వృక్షమును నరుకుతుంటే పక్కన ఉన్న వృక్షము ఏమీ చేయలేనట్టు, నేను చనిపోతున్నా నా తండ్రి ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్నాడు. కాని, నా తండ్రి, నాకు ఈ దుస్థితి కలిగించిన నిన్ను, దారుణంగా శపించగలడు. అందుకని నీవు ఈ జలమును తీసుకొని పోయి నా తండ్రికి ఇచ్చి ఆయన దాహము తీర్చు. ఆయన శాంతిస్తాడు. అదుగో ఆ కనపడే కాలి బాట వెంట వెళితే మా ఆశ్రమము వస్తుంది. నీవు వెంటనే వెళ్లి మా తండ్రికి ఈ విషయం చెప్పు.
ఓ రాజా! నీవు కొట్టిన బాణము నా శరీరంలో గుచ్చుకొని చాలా బాధకలిగిస్తూ ఉంది. నీవు దానిని బయటకు లాగు. నాకు సత్వరమే మరణం ప్రసాదించు." అని ఆ ముని కుమారుడు నాతో అన్నాడు.
నేను ఆ బాణమును తీస్తే అతను వెంటనే మరణిస్తాడు. తియ్యకపోతే మరణయాతన అనుభవిస్తాడు. ఏం చేయాలో నాకు తోచలేదు. నేను పడుతున్న బాధను గ్రహించాడు ఆ ముని కుమారుడు. కాని అప్పటికే ఆ ముని కుమారుడు బాధతో నేల మీదపడి గిలా గిలా కొట్టుకుంటున్నాడు. అంత బాధలో కూడా నాతో ఇలా అన్నాడు.
"ఓ రాజా! నీవు బ్రహ్మ హత్య చేసానని భయపడకు. ఎందుకంటే నేను బ్రాహ్మణుడను కాను. నా తండ్రి వైశ్యుడు. నా తల్లి శూద్ర వనిత. కాబట్టి నీకు ఆభయం లేదు." అని అంత బాధలో కూడా నా మనసుకు ఊరట కలిగించాడు. ఆ ముని కుమారుడి బాధను చూడలేక నేను అతని శరీరము నుండి బాణమును లాగేసాను. ఆ ముని కుమారుడు నా వంకే చూస్తూ ప్రాణములు విడిచాడు. నేను కొట్టిన బాణముచే మృతిచెందిన ఆ ముని కుమారుని చూచి నా మనస్సుకు చాలా బాధకలిగింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment