శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 64)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

అరువది నాల్గవ సర్గ

“కౌసల్యా! ఆ ప్రకారంగా నేను నా ప్రమేయం లేకుండానే ఆ ముని కుమారుని మరణానికి కారకుడిని అయ్యాను. అప్పుడు నాకు ఏంచెయ్యాలో తోచలేదు. కొంచెం సేపు ఆలోచించాను. అప్పుడు నాకు ఒక ఉపాయము తట్టింది. నేను కుండ నిండుగా స్వచ్ఛమైన జలమును తీసుకొని ఆ ముని కుమారుడు చెప్పిన మార్గములో నడుచుకుంటూ వారి ఆశ్రమమునకు చేరుకున్నాను.
ఆ ఆశ్రమములో ఒక వృద్ధ దంపతులు ఉన్నారు. వారు అంధులు. లేవలేకుండా ఉన్నారు. ఎవరైనా లేచి నడిపిస్తే గానీ నడవలేకున్నారు. వారే ఆ మునికుమారుని తల్లి తండ్రులు అని అనుకున్నాను. వారు తమ కుమారుని రాక కోసరము ఎదురు చూస్తున్నారు.తమ కుమారుని మంచి తనము గురించి మాట్లాడు కుంటున్నారు. కాని వారి కుమారుడు ఇంక ఎప్పటికీ తిరిగి రాడు అని తెలిస్తే వారి గుండె ఎలా బద్దలవుతుందో తల్చుకుంటేనే నా హృదయం తల్లడిల్లిపోయింది. ఆ ముని కుమారుని చంపిన దు:ఖము కంటే ఆవృద్ధ దంపతులను చూచిన తరువాత కలిగిన దుఃఖము రెట్టింపు అయింది.

నేను వారికి దగ్గరగా వెళ్లాను. నా అడుగుల చప్పుడు విన్ని ఆ వృద్ధులు నన్ను వారి కుమారుడు అని అనుకున్నారు. “కుమారా! ఏమి నాయనా. నీళ్లు తీసుకురావడానికి ఇంత ఆలస్యం అయింది. నాకు చాలా దాహంగా ఉంది. కొంచెము నీళ్లు ఇవ్వు నాయనా. తాగుతాను. అయినా నీకు ఇంకా నీటిలో ఆటలు ఏమిటి చెప్పు. నీ కోసరం మీ అమ్మ బెంగపెట్టుకుంది.లోపలకు వెళ్లి ఆమెను పలకరించు” అని అన్నాడు ఆ వృద్ధుడు.

నేను వారికి ఏమి సమాధానము చెప్పలేదు. “నాయనా కుమారా! ఏమి నాయనా మాతో మాట్లాడవు. నామీద కోపమా. ఈ వృద్ధుల మీద కోపం ఎందుకు కుమారా! మాకు నువ్వే కదా రెండు కళ్లు. నీ కళ్లతో మేము ఈ ప్రపంచాన్ని చూస్తున్నాము. నీ మీద ఆధార పడ్డ మామీద కోపం ఎందుకు కుమారా!" అని కొడుకు కోసం ఆరాటపడుతున్న ఆ వృద్ధుని చూస్తుంటే నా కడుపు తరుక్కుపోయింది. ఆయనను చూచి భయం కూడా వేసింది. అందుకని తత్తరపాటుతో భయం భయంగా ఆయనతో ఇలా అన్నాను.

“మహాత్మా! నేను మీ కుమారుడిని కాదు. దశరథుడు అనే క్షత్రియుడను. అహంకారముతో, అజ్ఞానముతో అవివేకముతో ఈ దు:ఖమును చేజేతులా తెచ్చిపెట్టు కున్నాను. నేను వేటకోసరము సరయూ నదీ తీరమునకు వచ్చాను. ఏనుగును చంపవలెనని మాటువేసి ఉన్నాను. నీ కుమారుడు నీరు కుండలో నీరు నింపు ధ్వని వినపడినది. అది ఏనుగు నీరు త్రాగు శబ్దము అని భ్రమించి శబ్దవేధి బాణముతో కొట్టాను. ఒక మానవ స్వరము హాహాకారము చేయడం వినిపించింది. వెంటనే పోయి చూచాను. అక్కడ నా బాణము దెబ్బతిన్న తమరి కుమారుడు కనిపించాడు. కేవలము ఏనుగును చంపవలెనని నేను వదిలిన బాణము మీ కుమారునికి తగిలినది. మీ కుమారుడు మీ గురించి నాకు తెలియజేసాడు. నేను మీ కుమారుని కోరిక ప్రకారము ఆయన బాధను తొలగించుటకు ఆయన గుండెలలో గుచ్చుకున్న బాణమును లాగివేసితిని. వెంటనే మీ కుమారుడు మరణించాడు. నేను నీరు తీసుకొని మీ కుమారుడు చెప్పిన మార్గములో మీ వద్దకు వచ్చాను. నేను కావాలని మీకుమారుని చంపలేదు. కేవలము అవివేకము వలన తొందరపాటువలన జరిగినది. మీరు ఏ శిక్షవేసినా నేను స్వీకరిస్తాను. మీ ఇష్టము." అని వారి ముందు నిలబడ్డాను.

ఆయన కొంచెము సేపు మాట్లాడలేదు. తరువాత ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు ఇక్కడకు వచ్చి నా కుమారుని మరణ వార్త చెప్పావు కాబట్టి బతికిపోయావు. లేకపోతే నీ శిరస్సు వేయి వక్కలు అయి ఉండేది. ఎవరైనా క్షత్రియుడు తెలిసీ తెలిసీ ముని కుమారుని చంపితే అతను దేవేంద్రుని పదవిలో ఉన్నాసరే అతడు శిక్షార్హుడే. ఎవరైనా తపస్సు చేసుకుంటున్న మునిని కానీ, మునికుమారుని గానీ చంపితే అతని శిరస్సు వెంటనే బద్దలయిపోతుంది. కాని నీవు ఈ అకృత్యమును తెలియక పొరపాటున చేసావు. కాబట్టి ఇంకా బతికి ఉన్నావు. లేకపోతే నీవే కాదు నీ వంశము సాంతము నాశనము అయి ఉండేది. జరిగింది ఏదో జరిగింది. ఇప్పుడు నీవు మా ఇద్దరినీ మా కుమారుని శరీరము ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. మా కుమారుని శరీరాన్ని కడసారిగా తడిమి తడిమి చూచుకుంటాము.” అని అన్నాడు.

అప్పుడు నేను ఆ ఇరువురు వృద్ధ దంపతులను వారి కుమారుడు చనిపోయిన స్థలమునకు తీసుకొని వెళ్లాను. ఆ తల్లి తండ్రులు వారి కుమారుని శవమును మీదపడి ఏడుస్తున్నారు. వారి అంతులేదు.

“కుమారా! నేను రా. మీ తండ్రిని వచ్చాను. లేచి నమస్కారము చేయి నాయనా! అయ్యో నేలమీద పడుకొని ఉన్నావా. లే నాయనా. మా మీద కోపం ఎందుకు నాయనా. మాతో మాట్లాడు. రేపటినుండి ప్రతి రోజూ ప్రాతఃకాలమున మాకు వేదము ఎవరు చదివి వినిపిస్తారు నాయనా! రేపటి నుండి నీ మధురమైన కంఠస్వరము మాకు వినపడదా! రేపటి నుండి ఎవరు పొద్దుటే స్నాన సంధ్య ముగించుకొని నా పక్కన కూర్చుని నాకు సేవలు చేస్తారు. రేపటి నుండి మాకు ఎవరు ఫలములు కందమూలములు తెచ్చి తినిపిస్తారు. కుమారా! నీ తల్లిని చూడు నాయనా. కళ్లులేని కబోధి. రేపటి నుండి ఆమె ఆలనా పాలనా ఎవరు చూస్తారు.  రా నాయనా. నీవు యమలోకమునకు వెళ్లకు. మన ఇంటికి రా పోదాము. రేపు మేము కూడా నీ వెంట యమలోకమునకు వస్తాము. అందరమూ కలిసే వెళదాము. నీవు లేని ఈ లోకంలో మేము ఉండలేము. అక్కడ యమునితో నేను మాట్లాడతాను. నీవు మా ఇద్దరినీ పోషించడానికి అనుమతి తీసుకుంటాను. నిస్సహాయులమైన మాకు యముడు ఆ మాతం అనుమతి ఇవ్వడా! తప్పకుండా ఇస్తాడు.

నాయనా! కుమారా! నీవు ఏం పాపం చేసావనిరా ఈ పాపాత్ముడు నిన్ను పొట్టన పెట్టుకున్నాడు. నీవు వీరగతిని పొందావు. నీవు కూడా వీరులు పోయే లోకములకు పోతావు. నీవు కూడా దిలీపుడు, సగరుడు, శైబ్యుడు, జనమేజయుడు, నహుషుడు, దుందుమారుడు మొదలగు మహానుభావులు పొందిన వీరగతినే నీవు పొందుతావు. అదీ కాకపోతే, నీవు ముని కుమారుడవు. నీకు సాధువులకు ఏ ఉత్తమగతి లభిస్తుందో ఆ ఉత్తమ గతులు పొందుతావు. నీకూ నిన్ను చంపిన వాడికీ ఉత్తమ గతులు
కలుగుతాయి.” అని ఆ వృద్ధుడు కొడుకును తలచుకుంటూ విలపిస్తున్నాడు.

తరువాత ఆ వృద్ధుడు తన కుమారునికి ఉదక క్రియలు నిర్వర్తించాడు. వారు ఆ కార్యక్రమము చేయు నప్పుడు నేను వారి పక్కనే చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాను. ఆ వృద్ధుడు తన కుమారునికి జలతర్పణములు వదిలిన తరువాత నన్ను చూచి ఇలా అన్నాడు. “ఓ రాజా! నీవు నీ బాణముతో నా ఒక్కగానొక్క కొడుకును నిర్దాక్షిణ్యంగా చంపి నన్ను నా పుత్రునికి దూరం చేసావు. మేము బతికీ ప్రయోజనము లేదు. కాబట్టి మా ఇద్దరినీ కూడా చంపెయ్యి. మేము మరణమును గురించి చింతించడం లేదు. కాని నీవు నా కుమారుని తెలిసి చంపినా తెలియక చంపినా, తప్పు తప్పే. దానికి నీవు శిక్ష అనుభవించక తప్పదు.

“నేను ఎలాగైతే నీ వలన నా పుత్రుని పోగొట్టుకొని కుమారా కుమారా అని ఏడుస్తూ మరణిస్తున్నానో, నువ్వు కూడా నీ కొడుకును చేజేతులా పోగొట్టుకొని హా పుత్రా హా పుత్రా అని ఏడుస్తూ మరణించు. ఇదే నేను నీకు ఇచ్చే శాపము." అని నన్ను శపించాడు. తరువాత వారు ఒక చితిని పేర్పించుకొని అగ్నికి ఆహుతి అయ్యారు.

కౌసల్యా! ఆ ప్రకారంగా నేను ఆ ముని కుమారుని మృతికి కారకుడినయి ఆతని తండ్రి శాపానికి ఆహుతి అయ్యాను. ఈ నాడు ఆ శాప ప్రభావంతో నా కుమారుని చేజేతులా అడవులపాలు చేసుకొని రామా రామా అంటూ ఏడుస్తున్నాను. నేను కూడా ఆ వృద్ధుడి వలెనే కొడుకా కొడుకా అని ఏడుస్తూ మరణించవలసిన సమయము ఆసన్నమయినట్టుంది." అని ఏడుస్తున్నాడు దశరథుడు.

కౌసల్యకు భర్తను ఎలా ఓదార్చాలో తెలియడం లేదు. మౌనంగా ఉంది. తరువాత దశరథుడే అన్నాడు. “ఓ కౌసల్యా! నేను తెలివితక్కువగా అడవులకు వెళ్లమంటే, రాముడు ధర్మం ధర్మం అంటూ అడవులకు వెళ్లాడు. రాముడు చేసింది ధర్మమే. కాని నేనే అధర్మానికి పాలుబడ్డాను. కొడుకును అడవులకు పంపాను.

లేకపోతే ఎవడైనా చేజేతులా కొడుకును పోగొట్టుకుంటాడా! పోనీ నేను తెలివి తక్కువ వాడిని. ఏ కొడుకైనా తండ్రి అడవులకు పో అంటే కోపించకుండా ఉంటాడా! కాని రాముడు కోపం తెచ్చుకోలేదు. అదే ధర్మం అంటాడు. నేను అధర్మంగా ప్రవర్తించినా రాముడు ధర్మంగా ప్రవర్తించాడు. కాని నాకు అవసాన దశ సమీపించింది. ఈ ఆఖరి ఘడియలలో రాముడు నా దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది. కౌసల్యా! అటు చూడు.యమదూతలు నాకోసరం వస్తున్నారు. శాప వశాత్తు నాకు నా మరణ కాలంలో నా రాముడు దూరం అయ్యాడు.

కౌసల్యా! నా ప్రాణాలు యమభటులు తీసుకుపోనవసరం లేదు. రాముడు నాకు దూరం కావడమే నా పుత్రశోకమే నాప్రాణాలు తీసేస్తుంది. రాముడు పద్నాలుగు సంవత్సరాల తరువాత అయోధ్యకు వచ్చినపుడు చూచే అదృష్టం నాకు లేదు. ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు. కేవలము దేవతలే ఆ దృశ్యము చూడగలరు. నా వంటిపాపాత్ముడికి ఆ అర్హత లేదు.

కౌసల్యా! ఒక్కొక్కటిగా నా అవయవాలు చలనం కోల్పోతున్నాయి. నా ఆయువు క్షీణించి పోతూ ఉంది. ఈ ఆఖరు క్షణాలలో కూడా రాముని స్మరణ నన్ను వదలడం లేదు.

రామా! రామా! ఎక్కడున్నావయ్యా! ఏం చేస్తున్నావయ్యా! ఒక్కసారి నా కళ్లకు కనపడవయ్యా! కౌసల్యా! నేను మరణిస్తున్నాను. ఓ కైకా! నీ ఉసురు కొట్టి నేను చచ్చిపోతున్నాను. నీవు ఆనందంగా ఉండు. నా కులాన్ని నాశనం చేసావు. నన్ను మరణానికి గురిచేసావు. నీవు కోరుకున్నట్టు నేను చచ్చిపోతున్నాను. చచ్చిపోతున్నాను.” అంటూ పలవరిస్తున్నాడు దశరథుడు. అలా పలవరిస్తూనే దశరథుడు ప్రాణాలు వదిలాడు.

దశరథుడు తాను పొందిన ముని శాపము గురించి చెబుతూ ఉండగానే కౌసల్య శోకభారంతో నిద్రలోకి జారుకుంది. అంతకు ముందే సుమిత్రకూడా నిద్రపోయింది. అందుకని వారికి నిద్రలోనే పలవరిస్తూ దశరథుడు ప్రాణాలు వదిలిన సంగతి తెలియదు. అప్పటికి అర్ధరాత్రి దాటింది. కౌసల్య అంత:పురములో నిశ్శబ్దము ఆవరించింది.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువదినాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)