శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 65)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

అరువది ఐదవ సర్గ

మరునాడు తెల్లవారింది. రోజూ మాదిరి వంది మాగధులు దశరథ మహారాజును నిద్రలేపడానికి వచ్చారు. వారు దశరథుని గూర్చి మంగళకరములైన వాక్యములు పలుకుతూ స్తోత్రపాఠములు చదువుతున్నారు. గాయకులు దశరథుని వంశ చరిత్రను గానం చేస్తున్నారు. వారి స్తోతపాఠములతో కౌసల్యా మందిరము మారుమోగిపోయింది.

పరిచారికలు దశరథుని నిద్రలేపడానికి ఆయన పడుకున్న శయ్య దగ్గరకు వచ్చారు. మరి కొంత మంది మంచి గంధము కలిపిన నీరుతో నిండిన కుండలు తీసుకొని వచ్చారు. వారు దశరథుని శయ్యకు కొంచెం దూరంలో నిలబడ్డారు. సాధారణంగా మహారాజు ఈపాటికి నిద్రలేచేవారు. కాని ఇన్ని స్తోత్రపాఠములు చదువుతున్నా ఆయన అటు ఇటు కూడా కదలడం లేదు. వారికి అనుమానం కలిగింది. కాని అలాగే నిలబడి పోయారు.

ఇంతలో కొంతమంది వృద్ధ పరిచారికలు, దశరథుని వద్ద చనువు ఉన్న వాళ్లు, అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్నారు. వారు దశరథుని శయ్య దగ్గరకువెళ్లారు. ఆయనను సున్నితంగా తట్టి లేపడానికి ప్రయత్నించారు. ఆయనలో చలనం లేదు. వారికి భయం వేసింది. వణుకుతూ అలాగే నిలబడిపోయారు. వారి మనస్సు కీడు శంకించింది. మహారాజు మరణవార్తను బయటకు చెప్పడానికి వారికి ధైర్యము చాలడం లేదు.

వారు పరుగుపరుగున కౌసల్య సుమిత్రల వద్దకు వెళ్లారు. అప్పటికి వారు నిద్రలేవలేదు. అప్పటికి వారికి విషయం బోధపడింది. రాత్రి అందరూ నిద్రించిన తరువాత దశరథుని ప్రాణాలు నిద్రలోనే పోయాయి. ఆవిషయం రాణులకు తెలియదు అని వారికి అవగతమయింది. వారు ఏడుస్తూ కౌసల్యను నిద్ర లేపారు. వారికి ఏం చెప్పాలో తోచలేదు. దశరధుని వంక చూపించారు.

కౌసల్య దశరధుని వద్దకు వెళ్లింది. ఆయన మరణించాడు అని అర్థం అయింది. "హా నాధా!" అంటూ బిగ్గరగా కేకపెట్టి దశరథుని మీద పడిపోయింది. దశరథుని మరణ వార్త అంత:పురము అంతటా వ్యాపించింది. దశరథుని భార్యలందరూ అక్కడకు చేరుకున్నారు. అందరూ బిగ్గరగా ఏడుస్తున్నారు. కైకకు కూడా దు:ఖము కట్టలు తెంచుకొని వస్తోంది. ఆమెకూడా బిగ్గరగా ఏడుస్తోంది. వారి రోదనలతో అంత:పురము నిండిపోయింది. పరిచారికలకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అటుఇటు పరుగెత్తుతున్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువై ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)