శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 66)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది ఆరవ సర్గ
కౌసల్య తన భర్త దశరథుని తలను ఒడిలో పెట్టుకొని దు:ఖిస్తూ ఉంది. తలపైకెత్తి కైకను చూచింది. ఆమె కోపం కట్టలు తెంచుకొంది.“ఏమ్మా! కైకా! నీ కోరిక తీరిందా! నీ మనస్సు శాంతించిందా! ఇంక నువ్వు, నీ కొడుకు, ఈ అయోధ్యను ఏలుకోండి. మీకు అడ్డు వస్తాడని నా కొడుకును అడవులకు పంపావు. ఇప్పుడు మొగుడిని చంపావు. ఇంక నీకు అడ్డేముంది. నా కొడుకు రాముడు నన్ను విడిచి అడవులకు వెళ్లిపోయాడు. నా భర్త నన్ను విడిచి స్వర్గానికి పోయాడు. ఇంక నాకు ఎవరు మిగిలారు. ఎవరి కోసం బతకాలి. నీ లాంటిది తప్ప మొగుడు లేకుండా ఏ స్త్రీ బతకలేదు. బతకడానికి ఇష్టపడదు కూడా.
ఓ కైకా! నీవు ఏం చేస్తున్నావో నీకు తెలిసే చేసావా! లేక ఆ గూని దాని మాటలు విని ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! ఏది ఏమైనా మాకు మా భర్తను దూరం చేసావు. ఓ కైకా! నీవు మాకే కాదు. జనక మహారాజును కూడా దు:ఖములో ముంచావు. తన కూతురు అడవులలో ఎన్ని కష్టములు పడుతున్నదో అని జనకుడు ఎంతదు:ఖిస్తున్నాడో కదా! ఇంతకూ రామునికి తన జనకుని మరణ వార్త ఎలా తెలుస్తుంది. తన తల్లి అనాధ అయింది అని ఎవరు చెబుతారు. రాముడు ఎక్కడ ఉన్నాడని వెతుకుతారు! నా భర్త రాముని గూర్చి, సీతను గూర్చి, తలంచుకొని ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలాడు. నేను కూడా ఆయన వెంటనే వెళతాను. నా భర్తతో పాటు చితి మీదకూర్చుని అగ్నికి ఆహుతి అవుతాను. నా భర్తను అనుసరించడం తప్ప నాకు వేరుమార్గము లేదు.” అంటూ కౌసల్య భర్త శవాన్ని కౌగలించుకొని భోరు భోరున ఏడుస్తూ ఉంది.
ఇంతలో కులగురువు వసిష్టులు, అమాత్యులు అక్కడకు చేరుకున్నారు. వసిష్ఠుని ఆదేశము మేరకు అంత:పుర పరిచారికలు కౌసల్యను లేపి అక్కడి నుండి దూరంగా తీసుకొని పోయారు. అమాత్యులు దశరథుని శరీరమును ఒక తైలద్రోణిలో పదిలపరిచారు. శవమునకు చేయవలసిన కర్మక్రతువులు అన్నీ నిర్వర్తించారు. ఆ సమయంలో దశరథుని కుమారులు ఎవరూ అయోధ్యలో లేరు. రామలక్ష్మణులు అడవులలో ఉన్నారు. భరత శత్రుఘ్నులు వారి మేనమామల ఇంట్లో ఉన్నారు. అందుకని దశరథునికి దహనక్రియలు నిర్వర్తించడానికి వీలులేదు. వారు వచ్చేదాకా నిరీక్షించాలి. కాబట్టి దశరథుని శరీరమును తైలద్రోణిలో భద్రపరిచారు. (తైలద్రోణి అంటే పలు విధములైన నూనెలు(preservatives) కలిగిన తొట్టె అని అర్థము.)
అప్పటి దాకా దూర దూరంగా ఉన్న దశరథుని భార్యలు అందరూ దగ్గరగా వచ్చారు. తైలద్రోణిలో ఉన్న మహారాజు శవాన్ని చూచి బిగ్గరగా రోదిస్తున్నారు.
“ఓ మహారాజా! మాకు రాముడిని దూరం చేసావు. ఇప్పుడు నువ్వుకూడా దూరంగా వెళ్లిపోయావా! చేతులారా తన భర్తను చంపిన కైక పాలనలో మేము ఎలా ఉండగలము. రాముడూ లేకుండా, నీవూ లేకుండా, ఈ కైక పెట్టే బాధలనుసహిస్తూ మేము ఎలా జీవించగలము. ఈ కైక సామాన్యురాలు కాదు. తన స్వార్థం కోసరం రాముని అడవులకు పంపింది. కట్టుకున్న భర్తను చంపించింది. ఇక మమ్మల్ని మాత్రం విడిచి పెడుతుందా?" అని అగమ్యగోచరమైన వారి భవిష్యత్తును తలచుకుంటూ నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తున్నారు.
వీరి పరిస్థితి ఇలా ఉంటే, అటు రాముని, ఇటు మహారాజును పోగొట్టుకున్న అయోధ్యావాసుల జీవితాలలో చీకట్లు ముసురు కున్నాయి. అందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. పురజనులు అందరూ వీధులలో గుంపులు గుంపులుగా చేరి కైక అకృత్యములను గురించి తదుపరి పరిణామాల గురించి చర్చించుకుంటున్నారు. కన్నీరు కారుస్తున్నారు. చంద్రుడు లేని ఆకాశం వలె మహారాజులేని అయోధ్య శోభావిహీనం అయింది. సూర్యవంశపు మహారాజు అయిన దశరథుని మరణమును చూడలేక సూర్యుడు కూడా పడమటి దిక్కున దాక్కున్నాడు. అయోధ్య అంతా చీకట్లు అలముకున్నాయి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము అరువది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment