శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 67)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది ఏడవ సర్గ
మరునాడు సూర్యోదయము అయింది. మంత్రులు, బ్రాహ్మణులు, పురప్రముఖులు సభకు వచ్చారు. ఆ సభకు మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు మహామునులు కూడా వచ్చారు. వారందరూ రాజ పురోహితుడైన వసిష్ఠుని చూచి వేర్వేరుగా ఇలా అన్నారు.“నిన్న రాత్రి మహారాజు దశరథుడు చనిపోయాడు. పెద్దకుమారుడు రాముడు ఇక్కడ లేడు. అరణ్యములకు వెళ్లాడు. లక్ష్మణుడు కూడా రాముని అనుసరించాడు. మిగలిన ఇద్దరు కుమారులు వారి మాతామహుని ఇంటిలో (తాతగారి ఇంటిలో) ఉన్నారు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. రాజులేని రాజ్యములో అన్ని రకములైన అనర్థములు జరుగుతాయి. యజ్ఞయాగములు జరగవు. పుణ్యకార్యములు జరగవు. అరాచకము ప్రబలుతుంది.
రాజు లేని రాజ్యములో న్యాయము చెప్పేవారు ఉండరు. తప్పుచేసిన వారిని శిక్షించే వారు ఉండరు. ఆస్తి తగాదాలు పరిష్కారం కావు. రాజు లేని రాజ్యములో గోవులకు రక్షణ ఉండదు. వ్యవసాయము కుంటుపడుతుంది. రాజులేని రాజ్యములో విద్యాలయాలు, యుద్ధ విద్యను బోధించు శిక్షణాలయాలు మూతబడతాయి. సైన్యము నిర్యీర్యము అవుతంఉది. రాజు లేని రాజ్యములో ప్రజలకు రక్షణ ఉండదు. ప్రజలు నిర్భయంగా తిరగడానికి భయపడతారు.
శత్రు రాజులు మన దేశము మీదికి దండెత్తే అవకాశము ఉంది. రాజ్యములోని సమస్త సంపదలు రాజు అధీనములు, ఆ రాజే లేకపోతే ఆ సంపదలకు అధిపతి ఎవరు అనే సందేహము వస్తుంది. రాజు లేని రాజ్యములో దుండగులు చెలరేగి అన్ని రకాల నేరాలకు పాల్పడతారు.రాజ్యములోని ప్రజలకు రాజే తల్లి, తండ్రి, హితుడు. ధర్మాధర్మ విచక్షణ చేసేది రాజు. అందుకనే రాజును యమ,కుబేర, ఇంద్ర, వరుణులతో పోలుస్తారు. రాజులేని రాజ్యము అంధకార బంధురము
అవుతుంది.
కాబట్టి ఓ వసిష్ట మహర్షీ! మేము చెప్పిన విషయములను పరిశీలించి, ఇక్ష్వాకు వంశములోని వారిని ఎవరినైనా ఒక ఉత్తముని రాజ్యాభిషిక్తుని చేయడం ధర్మం." అని పలికారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment