శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 68)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది ఎనిమిదవ సర్గ
ఋషులు మాట్లాడిన మాటలు అన్నీ శ్రద్ధగా విన్నాడు వసిష్ఠుడు. మంత్రులతో ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు.“మహా ఋషులారా! ప్రస్తుతము భరత శత్రుఘ్నులు వారి మేమమామగారి ఇంట ఉన్నారు. వారిని తీసుకొని వచ్చుటకు వెంటనే దూతలను పంపెదను. దశరథుడు, తాను చనిపోకముందే భరతునికి రాజ్యము ఇస్తానని కైకకు మాట ఇచ్చిఉన్నాడు. కాబట్టి రాజ్యము ఎవరిది అన్న సమస్య తలెత్తదు. భరతుడు రాగానే అతనికి పట్టాభిషేకము జరిపించెదము." అని చెప్పాడు.
వసిష్ఠుని ఆదేశము ప్రకారము సిద్ధార్థుడు, జయంతుడు, విజయుడు, అశోకుడు, నందుడు అనే దూతలను పిలిపించాడు. వారితో ఇలా అన్నాడు. "దూతలారా! జాగ్రత్తగా వినండి. మీరు వెంటనే భరతుని వద్దకు వెళ్లండి. అతనికి దశరథుని మరణ వార్త తెలియనీయకండి. మీ మొహంలో ఎక్కడా విషాద చ్ఛాయలు కనపడకూడదు. నా మాటగా భరతునికి ఇలా చెప్పండి. “పురోహితులు అందరూ నీ హితము కోరుతున్నారు. నీతో ఒక అవసరమైన పని ఉన్నది. నీవు వెంటనే అయోధ్యకు రావలెను." అని చెప్పండి. రాముడు వనవాసమునకు వెళ్లిన విషయము ఏమాత్రము భరతునికి తెలియనీయకండి. మీరు వెళ్లునపుడు కేకయ రాజుకు భరతునికి శత్రుఘ్నునికి అనేక కానుకలు తీసుకొని వెళ్లండి." అని ఆదేశించాడు.
వసిష్ఠుని ఆదేశము ప్రకారము ఆ దూతలు భరతుని వద్దకు బయలుదేరారు. ఆ దూతలు హస్తినాపురము దాటి తరువాత గంగానదిని చేరుకొని, అక్కడి నుండి పశ్చిమంగా ప్రయాణించి పాంచాల దేశము చేరుకొని అక్కడి నుండి శరండా నదిని దాటి కులింగా నగరిని చేరుకున్నారు. అక్కడి నుండి ఇక్షుమతీ నదిని దాటి బాహ్లిక దేశము గుండా సుదామ పర్వతమును చేరుకున్నారు. అక్కడి నుండి విపాసా నదిని దాటి గిరివ్రజపురమును ప్రవేశించారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్
Comments
Post a Comment