శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - అరువది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 69)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
అరువది తొమ్మిదవ సర్గ
అయోధ్యనుండి వచ్చిన దూతలు భరత శత్రుఘ్నులు ఉన్న నగరంలో ప్రవేశించిన రాత్రి, భరతునికి ఒక చెడ్డ కల వచ్చింది. అదీ తెల్లవారు జామున వచ్చింది. మరునాడు భరతుని మనస్సు అంతా వ్యాకులంగా ఉండింది. స్నేహితులతో వినోద సంభాషణలలో పాలుపంచుకోలేక పోయాడు. విదూషకుల హాస్యపు మాటలకు స్పందించడంలేదు. మనసంతా వికలమయింది.ఇది చూచి ఒక స్నేహితుడు భరతుడు అలా విషాదంగా ఉండటానికి కారణం అడిగాడు. అప్పుడు భరతుడు తన మనసులో మాట ఈ విధంగా చెప్పాడు.
"మిత్రమా! ఈ రోజు నాకు ఒక చెడ్డ కల వచ్చింది. నా తండ్రి దశరథుడు ఒళ్లంతా మట్టికొట్టుకొని, వెంట్రుకలు విరబోసుకొని, ఆవు పేడ ఉన్న గుంటలో పడిపోయినట్టు కలవచ్చింది. అలా పడ్డ నా తండ్రి నూనె తాగుతున్నాడు. తరువాత నువ్వులు కలిసిన అన్నం తింటున్నాడు. తరువాత తలవంచుకొని నూనెలో మునిగి పోయాడు.
మిత్రమా! ఇంకా నాకు సముద్రము ఎండిపోయినట్టు గానూ, చంద్రుడు నేలమీద పడిపోయినట్టుగానూ, పట్టపగలే చీకట్లు కమ్మినట్టుగానూ, అయోధ్యలో ఉన్న రాజులు ఊరేగే ఏనుగునకు దంతములు విరిగినట్టుగానూ, ప్రతి ఇంట్లోనూ వెలిగే అగ్నులు ఆరిపోయినట్టుగానూ, భూకంపము వచ్చినట్టుగానూ, నాకు కలలో కనపడింది.
మిత్రమా!ఇదే కాకుండా నా తండ్రి ఇనపసింహాసనము మీద నల్లని దుస్తులు ధరించి కూర్చున్నట్టుగానూ, ఆయనను చూచి అందరూ నవ్వుతున్నట్టుగానూ, నా తండ్రి గాడిదలు కట్టిన రథము మీద దక్షిణ దిక్కుగా వెళుతున్నట్టుగానూ కల వచ్చింది.
ఈ స్వప్నములను బట్టి చూస్తే మా కుటుంబములో ఎవరో ఒకరికి మరణము ఆసన్నమయినది అని అర్థం అవుతూ ఉంది. ప్రస్తుతము వృద్ధుడు మా తండ్రి. ఆయన గురించే నాకు చింతగా ఉంది. ఎందుకంటే ఎవరైతే గాడిదలు కట్టిన రథంమీద దక్షిణ దిక్కుగా వెళ్లినట్టు కల వస్తుందో, అతని యొక్క చితి మంటలు త్వరలోనే చూడబడతాయి అని శాస్త్రప్రమాణము. ఎలాంటి దుర్వార్త వినవలసి వస్తుందో అని నా మనస్సులో చాలా ఆందోళనగా ఉంది. మరలా నా తండ్రిని చూస్తానా లేదా అని మనసంతా వ్యాకులంగా ఉంది." అని అన్నాడు భరతుడు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము అరువది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment