శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 70)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
డెబ్బదవ సర్గ
భరతుడు తనకు వచ్చిన కల గురించి తన స్నేహితునికి చెబుతున్న సమయంలో అయోధ్యనుండి వచ్చిన దూతలు భరతుని వద్దకు వచ్చారు. కేకయ రాజును కలుసుకున్నారు. కేకయ రాజు కుమారుడు యుధామన్యుని కలుసుకున్నారు. అయోధ్యనుండి తెచ్చిన కానుకలు వారికి సమర్పించారు. కేకయ రాజు అనుమతితో భరతునితో ఇలా అన్నారు.“రాజకుమారా! తమ కులగురువు వసిష్ఠుడు, తక్కిన గురువులు తమరి కుశలము అడగమని చెప్పారు. వసిష్ఠుల వారికి నీతో అత్యవసరంగా చర్చించవలసిన అవసరము ఉన్నదట. అందుకని తమరిని వెంటనే అయోధ్యకు బయలుదేరి రమ్మని చెప్పారు. దూతలు వసిష్ఠుడు చెప్పినట్టు చెప్పారు.
భరతుడు ఆ దూతలకు కానుకలు ఇచ్చి సత్కరించాడు. “దూతలారా! నా తండ్రి దశరథుడు క్షేమంగా ఉన్నాడా. నా అన్న రాముడు, లక్ష్మణుడు క్షేమంగా ఉన్నారా! రాముని తల్లి కౌసల్య ఆరోగ్యంగా ఉన్నదా! లక్ష్మణ, శత్రుఘ్నుల తల్లి సుమిత్రాదేవి క్షేమంగా ఉన్నదా! స్వాతిశయము కలదీ, ఎల్లప్పుడూ తన సుఖము మాత్రమే చూచుకొనేదీ, కోపస్వభావము కలదీ, గర్విష్టి అయిన మా తల్లి కైక క్షేమంగా ఉన్నదా! మా అమ్మ నాతో చెప్పమని ఏమైనా సమాచారము పంపినదా! " అని ఆతురతగా అడిగాడు భరతుడు.
ఆ మాటలకు దూతలు ఇలా బదులు చెప్పారు. “రాకుమారా! నీవు ఎవరెవరినీ అయితే అడిగావో వారందరూ క్షేమంగా ఉన్నారు. నిన్ను లక్ష్మీదేవి వరించినది. (నిన్ను రాజ్యలక్ష్మి వరించినది. అయోధ్యకు రాజు కాబోతున్నావు అని నర్మగర్భంగా చెప్పారు). తమరు మాత్రం వెంటనే అయోధ్యకు బయలుదేరండి." అని అన్నారు.
దూతలు తొందర పెట్టడం చూచిన భరతుడు తన మేనమామ, తాతగారికి నమస్కరించి వారితో ఇలా అన్నాడు.
“మహారాజా! అయోధ్యనుండి నన్ను తీసుకొని పోవుటకు దూతలు వచ్చారు. మా కులగురువు వసిష్టులవారు నన్ను వెంటనే రమ్మన్నారట. అందుకని నాకు అనుమతి ఇస్తే నేను, శత్రుఘ్నుడు అయోధ్యకు వెళతాము. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము.” అనికేకయ రాజు అనుమతి కోరాడు భరతుడు.
కేకయ రాజు సంతోషంగా అనుమతించాడు. “నాయనా! భరతా! నీ తండ్రి దశరథుని, నీ తల్లి కైక క్షేమము అడిగినట్టు చెప్పు. పురోహితులు వసిష్ఠునికి, బ్రాహ్మణులకు నా నమస్కారములు తెలియచెయ్యి. నీసోదరులు రామ లక్ష్మణులకు నా ఆశీర్వచనములు తెలియచెయ్యి" అని పలికాడు.
తరువాత కేకయ రాజు అనేక విలువైన వస్తువులను కానుకలను అయోధ్యకు పంపాడు. భరత శత్రుఘ్నులకు కూడా విలువైన కానుకలు ఇచ్చాడు. మార్గములో సహాయానికి విశ్వాసము గల సైనికులను పంపాడు.
భరతునికి తనకు వచ్చిన స్వపము, ఇప్పుడు దూతలు తొందర పెట్టడం చూచి ఏదో కీడు శంకిస్తున్నాడు. అందుకని తాతగారు, మేనమామ ఇచ్చిన కానుకలు అతనికి సంతోషము కలిగించడం లేదు. భరత శత్రుఘ్నులు రథంఎక్కారు. వారు ఎక్కిన రథము అయోధ్యకు బయలుదేరింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment