శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఒకటవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 71)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది ఒకటవ సర్గ

భరత శత్రుఘ్నులు ఎక్కిన రథము అయోధ్య వైపు వేగంగా వెళుతూ ఉంది. శతద్రూనదిని దాటారు. శిలావహనదిని దాటారు. త్రివేణీ సంగమమును సమీపించారు. వీరమత్స్యదేశమును దాటి భారుండ వనమును ప్రవేశించారు. కులింగనదిని, యమునా నదిని దాటారు. అక్కడ కొంచెం సేపు విశ్రమించారు. ప్రాగ్వట పురమును దాటి గంగానదిని సమీపించారు. గంగానదిని దాటి ధర్మవర్ధనము అనే గ్రామమును సమీపించారు. జంబూప్రస్థమును దాటి వరూధమనే గ్రామము చేరుకున్నారు. తరువాత ఉజ్జహాసనగరమును, సర్వతీర్థమును, ఉత్తానికా నదిని, కుటికానదిని, కపీవతి నదిని, స్థాణుమతీ నదిని, గోమతీ నదిని దాటారు. కళింగ నగరములో కొంచెము సేపు విశ్రమించారు. తరువాత సాలవనమును దాటారు. ఆ ప్రకారము ఏడు రోజులు అవిశ్రాంతంగా ప్రయాణము చేసి అయోధ్యానగరము చేరుకున్నారు.

ఎల్లప్పుడూ సందడిగా కళ కళ లాడుతూ ఉండే అయోధ్యానగరము కళాహీనంగా ఉంది. భరతునికి ఏం జరిగిందో అర్థం కాలేదు. భరతుడు తన సారధిని చూచి అయోధ్యా నగరము అలా ఎందుకు ఉంది అని అడిగాడు.

“సారథీ! ఎల్లప్పుడూ స్త్రీపురుషుల సంచారముతో సందడిగా ఉండే అయోధ్యానగరము ఇప్పుడు నిశ్వబ్దముగా ఉందేమి? ఎక్కడా రధములు వాహనములు కనపడటం లేదు. ఏమి కారణము? అయోధ్యానగరములోని గృహముల నుండి వాద్యముల గోష్టి మృదు మధురంగా వినపడటం లేదేమి? నాకు చాలా చెడ్డ శకునములు కనపడుతున్నాయి. కాని ఏం జరిగిందో అర్థం కావడం లేదు. నాకు కావలసిన వారికి ఏదో కీడు జరిగి ఉంటుంది అని నా మనసుకు తడుతూ ఉంది. నీకేమైనా తెలుసా!" అని అడిగాడు భరతుడు.

సారధి మాట్లాడలేదు. భరత శత్రుఘ్నులు అయోధ్యలోకి ప్రవేశించారు. మరలా సారధిని చూచి భరతుడు ఇలా అన్నాడు.

"ఓ సారధీ! అసలు నన్ను ఇంత తొందరగా ఎందుకు పిలిపించారు. నా మనస్సు ఏదో కీడు శంకిస్తూ ఉంది. ఎందుకంటే పూర్వము రాజులు మరణించినపుడు ఎలాంటి శకునములు, గుర్తులు కనపడతాయో అవన్నీ నాకు గోచరమవుతున్నాయి. అదీ కాకుండా అయోధ్యలో వీధులు దుమ్ముకొట్టుకొని ఉన్నాయి. ఎవరూ శుభ్రం చేస్తున్నట్టులేదు. దేవాలయములలో పూజలు వేదఘోషలు వినపడటం లేదు. ఎక్కడా పూలు అమ్ముతున్న ఛాయలు లేవు. యజ్ఞములు చేస్తున్నట్టు అగ్నిధూమములు కనిపించడం లేదు. వ్యాపార సంస్థలు అన్నీ మూసి ఉన్నాయి. ఏమి కారణము. నీకేమైనా తెలుసా!” అని అడిగాడు.

సారధి మౌనంగా ఉన్నాడు. భరతుడు రాజభవనంలోకి ప్రవేశించాడు. రాజభవనం కూడా నిర్మానుష్యంగా ఉంది. పరిచారకుల సందడి కూడా లేదు. భరతుడు లోపలకు వెళుతున్నాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఒకటవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)