శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 72)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది రెండవ సర్గ

భరతుడు అలా ఆలోచిస్తూ తన తండ్రి దశరథుని మందిరములో ప్రవేశించాడు. అక్కడ దశరథుడు కనిపించలేదు. వెంటనే తన తల్లి కైక మందిరమునకు వెళ్లాడు. కొడుకును చూడగానే కైక మనస్సు సంతోషంతో నిండిపోయింది. కొడుకుకు ఎదురువెళ్లింది. భరతుడు తల్లి కైక పాదములకు నమస్కరించాడు. కైక భరతుని లేవదీసి నుదుటిన ముద్దు పెట్టుకొని తన పక్కన కూర్చుండబెట్టుకొంది.

“నాయనా భరతా! నీ ప్రయాణము బాగా సాగిందా! తాతగారి ఇంట్లో ఎప్పుడు బయలుదేరావు. మార్గములో ఆయాసము కలగలేదు కదా! మీ తాతగారు, మేనమామ అంతా క్షేమంగా ఉన్నారా! ఇంకా కేకయ దేశపు విశేషములు ఏమిటి వివరంగా చెప్పు." అని ఆతురతగా అడిగింది కైక.

భరతుడు తల్లి అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ సమాధానాలు చెప్పాడు. 

“అమ్మా! నేను తాతగారి ఇంటి నుండి బయలుదేరి ఏడుదినములు అయింది. అక్కడ తాతగారూ, మామయ్య అంతా క్షేమంగా ఉన్నారు. వారు మీకు, తండ్రి గారికి, పంపిన కానుకలు వెనుక తీసుకొని వస్తున్నారు. 

అమ్మా! అయోధ్యలో ప్రవేశించినప్పటి నుండి నా మనస్సులో కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. వాటికి సమాధానాలు చెబుతావా అమ్మా!" అని అడిగాడు భరతుడు. కైక మాట్లాడలేదు. మౌనంగా ఉంది.

భరతుడు ఇలాఅడిగాడు.
“అమ్మా! నాన్న గారు ప్రతిరోజూ పడుకొనే బంగారు శయ్యమీద నాన్న గారు లేరు. కారణమేమి? ఈ మందిరములో పరిజనులందరి మొహంలో చింత, శోకము, ప్రస్ఫుటంగా కనపడుతూ ఉంది. కారణమేమి? దశరథ మహారాజు గారు ఎక్కువ సమయము నీ అంత:పురములోనే గడుపుతారు కదా! మరి ఇప్పుడు ఆయన నీ అంత:పురములో కనిపించడం లేదు. ఎందుకనీ? నేను చాలా రోజుల తరువాత వచ్చాను. నాన్న గారికి పాదాభి వందనము చేసి ఆయన ఆశీర్వాదము తీసుకొనవలెనని చాలా ఆతురతగా ఉన్నాను. ఆయన ఎక్కడ ఉన్నారు. నీ మందిరములో లేరు. కౌసల్య మందిరములో ఉన్నారా! చెప్పమ్మా! నేను నాన్నగారు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్లాలి."అని గుచ్చి గుచ్చి అడిగాడు.

ఇంక కైక తప్పించుకోలేక పోయింది. కాని నర్మగర్భంగా చెప్పసాగింది. “కుమారా భరతా! నీ తండ్రిగారు సాధారణంగా అన్ని జీవులు ఏ గతి పొందుతాయో అదే గతిని పొందారు." అని చెప్పింది.

భరతునికి అర్థం అయింది. తండ్రి మరణవార్త విని అలాగే కుప్పకూలిపోయాడు భరతుడు. అతనికి నోటమాట రాలేదు. దు:ఖంతో కుమిలిపోతున్నాడు. కైక భరతుని వద్దకు వచ్చి అతనిని లేపి పక్కన ఉన్న ఆసనము మీద కూర్చోపెట్టింది.

"భరతా! అదేమిటి అలా పడిపోయావు. నీ వంటి రాకుమారులు, కాబోయే మహారాజులు ఇలా దిగులు చెందవచ్చునా! నీ శోకము మాను." అని ఊరడించింది కైక.

కాని భరతునికి శోకము ఆగలేదు. పెద్దగా ఏడుస్తున్నాడు. "అమ్మా! వసిష్ఠులవారు శీఘ్రముగా రమ్మన్నారు అంటే రామునికి పట్టాభిషేకమునకు సుముహూర్తము నిశ్చయించినారేమో అనుకున్నాను. కాని ఇంతటి దుర్వార్త వినవలసి వస్తుందని అనుకోలేదు. అమ్మా! ఇంత హటాత్తుగా తండ్రిగారు చనిపోవుటకు కారణమేమి! ఏమైనా వ్యాధి సోకినదా! తండ్రిగారి అవసాన కాలములో దగ్గర ఉండి ఆయన అంత్యక్రియము జరిపించిన రాముడు ధన్యుడు. ఆ భాగ్యమునకు నేను నోచుకోలేదు. నేను వచ్చాను అని తెలియగానే నాకు ఎదురు వచ్చి నా శరీరమును అంతా నిమిరి, నా శిరమును ఆఘ్రాణించు తండ్రిగారు కనపడనప్పుడే అనుకున్నాను. ఇలాంటిది ఏదో జరిగి ఉంటుందని. నా తండ్రిగారి చేతి స్పర్శ అనుభవించు భాగ్యము ఈ జన్మకు లేదు కదా!
అమ్మా తండ్రి గారి తరువాత తండ్రి అంతటివాడు రాముడు. ఆయన నాకు అన్నగారే కాదు, తల్లి, తండ్రి, గురువు, దైవము. రామునికి నా రాక గురించి తెలపండి. నా తండ్రికి బదులు నా అన్నగారి పాదాలు పట్టుకొని ఆశీర్వాదము తీసుకుంటాను. రాముడు నన్ను ఆశీర్వదిస్తే తండ్రి ఆశీర్వదించినట్టే! అమ్మా! తండ్రిగారి మరణసమయములో నేను దగ్గర లేను కదా! నాతో చెప్పమని ఏమైనా చెప్పాడా అమ్మా! చెప్పమ్మా! నా తండ్రి గారి మాటలు యధాతథంగా చెప్పమ్మా!" అని కైకను ప్రార్థించాడు భరతుడు.

కైక జరిగింది చెప్పసాగింది. “కుమారా! నీ తండ్రి దశరథ మహారాజు తన ఆఖరి ఘడియలలో హా రామా! హా లక్ష్మణా! హా సీతా! అని వారిని తల్చుకుంటూ ప్రాణాలు వదిలాడు. ఇంకా ఇలా అన్నాడు. “రాముడు సీతతో లక్ష్మణునితో అయోధ్యకు తిరిగి వచ్చినపుడు చూచిన వారు ధన్యులు కదా!" అని అన్నాడు.

భరతునికి అనుమానం కలిగింది. “అమ్మా! రాముడు, లక్ష్మణుడు, ఎక్కడకు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎప్పుడు వస్తారు." అని అడిగాడు భరతుడు.

తాను చెప్పబోవు సంగతులు భరతునికి సంతోషము కలిగిస్తాయి అనే భ్రమలో జరిగింది జరిగినట్టు చెప్పసాగింది కైక.

"కుమారా భరతా! నీ అన్న రాముడు నార చీరలు ధరించి భార్యాసమేతుడై, లక్ష్మణుని వెంటదీసుకొని అరణ్యములకు వెళ్లాడు." అని చెప్పింది.

భరతుడు ఆశ్చర్యపోయాడు. ధర్మము తప్ప మరొకటి తెలియని రాముడు ఏ తప్పుచేసాడని రాజ్యము నుండి వెడలి పోయాడు అని ఆలోచించాడు. తల్లి కైకను ఇలా అడిగాడు.

"అమ్మా! రాముడు ఏమి తప్పు చేసాడని రాజ్యమునుండి వెడలగొట్టబడ్డాడు. రాముడు బ్రాహ్మణుల సొత్తును దొంగిలించాడా! రాముడు ఎవరి నైనా నిరపరాధిని దండించాడా! లేక రాముడు ఇతర స్త్రీలను, ఇతరుల భార్యలను కామవాంఛతో కోరుకున్నాడా. లేక ఏమైనా భ్రూణ హత్య లాంటిది చేసాడా! రాముడు ఏ అపరాధమూ చెయ్యకుండా రాజ్యమునుండి ఎందుకు అరణ్యములకు పంపబడ్డాడు.” అని నిలదీసాడు భరతుడు.

ఇంక చెప్పక తప్పదని అసలు విషయాన్ని చెప్పసాగింది కైక.
“రాకుమారా! రాముడు నీవు చెప్పిన ఏ పాపమూ చెయ్యలేదు. నీ తండ్రి దశరథుడు రామునికి పట్టాభిషేకము చేయుటకు ముహూర్తము నిశ్చయించాడు. ఆ విషయమును విన్న నేను ఆందోళనపడ్డాను. వెంటనే నీ తండ్రి వద్దకు పోయి, నీకు యౌవరాజ్యము పట్టాభిషేకము చేయమనీ, రాముని పదునాలుగేళ్లు అరణ్యములకు పంపమని కోరాను. నీ తండ్రి నాకు ఇదివరలో ఇచ్చిన వరములను సఫలము చేయుటకు రాముని అరణ్యములకు పంపాడు. రాముని వెంట సీత, లక్ష్మణుడు కూడా వెళ్లారు. రాముడు అరణ్యములకు పోవడంతో నీ తండ్రి దిగులుతో రాముని ఇంక చూడలేనేమోనని చింతతో మరణించాడు.

నాయనా భరతా! ఇదంతా నేను నీ కోసమే, నీ మేలు కోరి, నీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని చేసాను. కాబట్టి వెంటనే నీవు రాజ్యాభిషిక్తుడివికా! ఈ తల్లి కోర్కె నెరవేర్చు. నీ తండ్రి మాట ప్రకారము రాముడు అడవులకు వెళ్లాడు. నా మాట ప్రకారము నీవు పట్టాభిషిక్తుడివి కా! కాబోయే మహారాజువు. నీవు దిగులు పడకూడదు. ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకు దాయాదుల బాధ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు అయోధ్యను పాలించు. నీవు వెంటనే వసిష్ఠుని కలిసి, నీ తండ్రికి శాస్త్రోక్తంగా అంత్య క్రియలు నిర్వర్తించి, తరువాత రాజ్యాభిషిక్తుడివి కా! " అని పలికింది కైక.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది రెండవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)