శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది మూడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 73)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది మూడవ సర్గ

తన తల్లి కైక ఎంతో సంతోషంతో చెప్పిన మాటలు విన్న భరతుడు కోపంతో ఊగిపోయాడు. కాని ఎదురుగా ఉన్నది కన్నతల్లి. అందుకని తనకోపాన్ని బలవంతాన అణుచుకున్నాడు. కైకతో ఇలా అన్నాడు.

“అమ్మా! నా తండ్రి అకాల మరణం చెందాడు. నా సోదరులు అడవుల పాలయ్యారు. ఇంకా నాకు ఎందుకమ్మా ఈ రాజ్యము. అమ్మా! నా అన్న రాముడు అరణ్యానికి పోవుటకు, రాముని మీద ప్రేమతో నా తండ్రి మరణించుటకు నీవా కారణము? మా వంశమునకు అగ్నిలాగా దాపురించి కాల్చివేసావు కదమ్మా! ఈ విషయం తెలియక నా తండ్రి నిన్ను ఎంతో ఆదరించాడు కదా అమ్మా! నీ పాపముతో కూడిన ఆలోచనలకు నా తండ్రిని బలితీసుకున్నావు. నీ వలన మా ఇక్ష్వాకు వంశమే అపవిత్రమయింది. మా అందరికీ సుఖసంతోషాలు దూరం చేసావు. నీవు చేసిన అనాలోచితపు పని వలన నా తండ్రి మరణించాడు.

చెప్పమ్మా! ఇదంతా ఎందుకు చేసావు? రాముని ఎందుకు అడవులకు పంపావు? నా తండ్రిని ఎందుకు చంపావు? ఇంతా చేసిన దానివి కౌసల్యను సుమిత్రను బతుకనిస్తావా! వాళ్లకు కూడా నీ చేతిలో మరణం తథ్యం. అమ్మా! రాముడు నిన్ను తన కన్నతల్లి కౌసల్య కంటే ఎక్కువగా గౌరవించాడు కదమ్మా! మా పెద్దమ్మ కౌసల్య కూడా నిన్ను తన సహోదరి కంటే ఎక్కువగా ఆదరించింది కదమ్మా! అటువంటి రామునికి నారచీరలు కట్టి అడవులకు ఎలా పంపగలిగావు. కౌసల్యకు పుత్రశోకము ఎందుకు కలుగజేసావు? ఎవరి కోసం చేసావు ఇదంతా? ఇంత చేసికూడా సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు? నీవు మనిషివేనా లేక బండరాయివా!

అమ్మా! నేను, నీ కుమారుడు భరతుని, అడుగుతున్నాను. రాముని అరణ్యములకు పంపుటకు కారణమేమి? నాకు రాజ్యము కట్టబెట్టడానికేనా! నాకు రాముని మీద ఉన్న భక్తి గౌరవము తెలిసే ఈ పని చేసావా? రాముడు లేకుండా ఈ రాజ్యభారం వహించే శక్తి నాకు ఉందనుకుంటున్నావా! నీకు తెలుసో లేదో! నా తండ్రి దశరథుడు కూడా తన వృద్ధాప్యంలో రాముని సహాయంతోనే ఈ రాజ్యాన్ని పరిపాలిం చాడు. అటువంటిది, రాముడు లేకుండా, నేను ఈ రాజ్యభారమును ఎలా మోయగలను అనుకున్నావు? ఒక వేళ నేను నా శాయశక్తులా ప్రయత్నించి ఈ రాజ్యభారమును మోయగలనేమో గానీ, నీ కోరిక మాత్రము తీర్చను. నీ కొడుకు మీద ఉన్న అతి ప్రేమతో ఇదంతా చేసావు కాబట్టి నీ కోరిక ఎంత మాత్రమూ తీరదు. అసలు నీవు నా తల్లివే కాదు. నిన్ను ఈక్షణముననే విడిచిపెడదామనుకుంటున్నాను. కానీ, రాముడు నిన్ను తన కన్న తల్లి కంటే ఎక్కవ ప్రేమతో చూచుకొనే వాడు. అందుకని ఆ పని చేయలేకపోతున్నాను.

అమ్మా! నాకు తెలియక అడుగుతాను! నీవు ఈ పని చేసేటప్పుడు కొంచెం ఆలోచించావా! దీని వలన నీకు ఎంత అపకీర్తి వస్తుందో, మన వంశప్రతిష్ఠకు ఎంత భంగం వాటిల్లుతుందో ఒక్క క్షణమైనా ఆలోచించావా! అసలు నీకు ఈ బుద్ధి ఎలా పుట్టింది. నీకే పుట్టిందా లేక ఎవరి ప్రోద్బలముతోనన్నా ఇంతటి ఘోరానికి ఒడిగట్టావా! నీకు రాజధర్మము, మా వంశాచారము తెలిసే ఈ పని చేసావా!

మా వంశాచారము ప్రకారము కొడుకులు అందరిలోకీ పెద్దవాడు రాజ్యభారము వహిస్తే, మిగిలిన వారు అన్నగారిని భక్తితో సేవిస్తారు. ఈ మాత్రం నీకు తెలియదా లేక నీకు మా వంశాచారము మీద, రాజ ధర్మము మీద గౌరవము లేదా!

అమ్మా! ఇప్పుడు చెబుతున్నాను విను. మా ఇక్ష్వాకు వంశంలో, అందరిలోకీ పెద్దవాడు రాజ్యాభిషిక్తుడు అవుతాడు. ఇది మా కుల ధర్మము. మా ఇక్ష్వాకు వంశరాజులందరూ పాటిస్తున్న ఆచారము. ధర్మాచరణములో మా ఇక్ష్వాకు వంశీయులు ఎల్లప్పుడూ ముందుంటారు. ఈ నాడు నీవు మా రాజధర్మానికి చేటు తెచ్చావు. నీ పుత్ర వ్యామోహంతో మా వంశములోని రాజులందరికీ అపకీర్తి తెచ్చావు. అందుకని నేను మా ఇక్ష్వాకు రాజధర్మము తప్పి ప్రవర్తించను. ఈ రాజ్యము నాకు అక్కరలేదు. ప్రాణత్యాగము అయినా చేస్తాను కానీ నీ కోరిక నెరవేర్చను. నేను ఇప్పుడే రాముని వద్దకు పోయి ఆయనను ప్రార్థించి వెనుకకు తీసుకొని వస్తాను. రాజ్యాభిషిక్తుని చేస్తాను. నేను రామునికి దాసునిగా ఉంటాను. నీకు ఇష్టంఉన్నా, లేకపోయినా ఇదే నా నిశ్చయము."అని ఆవేశంతో అన్నాడు భరతుడు.

భరతుని ఆవేశం చల్లారింది. తండ్రి మరణం గుర్తుకు వచ్చింది. ఆ దు:ఖము తట్టుకోలేక బిగ్గరగా ఏడవడం మొదలెట్టాడు భరతుడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది మూడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)