శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది నాల్గవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 74)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది నాల్గవ సర్గ

తన కొడుకు భరతుడు ఎంత దూషించినా కైక మారు పలక లేదు. మౌనంగా ఉంది. భరతుడు తండ్రి మరణాన్ని తలచుకొని తలచుకొని ఏడుస్తున్నాడు. తన తండ్రి మరణానికి కారణం తన తల్లి కైక అని గుర్తుకు తెచ్చుకున్నాడు భరతుడు. తల్లి వంక తీక్షణంగా చూచాడు.

“అమ్మా! నీవు తండ్రి గారినే కాదు నన్ను కూడా మరణించేట్టు చేసావు. అమ్మా నేను మరణించిన తరువాత నా శవాన్ని, ఈ రాజ్యాన్ని చూచుకుంటూ తీరిగ్గా ఏడుద్దువుగానీ. ఏమ్మా! నీ కొడుకు మరణిస్తే నీకు దుఃఖం వచ్చిందా! ఏ పాపమూ ఎరుగని రాముని అరణ్యాలకు పంపినపుడు ఈ దు:ఖము ఏమయింది? నీ వలన నా తండ్రి అకాల మరణము పొందినపుడు ఈ దుఃఖము ఏమయింది? నీకు ఏమి అపకారము చేసాడని నా రాముని అడవులకు వెళ్లమని చెప్పావు?
నీవు చేసినపాపాలకు నీకు నరకమే సరి అయిన గతి. స్వర్గములో నీకు, భార్యగా నా తండ్రి పక్కన ఉండే అర్హత నీకు లేదు. అమ్మా! ఈతుచ్ఛమైన రాజ్యము కోసరం నీవు చేసిన పనులు చూస్తుంటే నాకే భయం వేస్తోంది. రేపు నన్నుకూడా ఏమైనా చేస్తావేమో అని భయపడుతున్నాను. నా రాముని అడవులకు పంపినది నీవే అయినా, నా తండ్రి మరణానికి కారణం నీవే అయినా, నేనే రాజ్యము 
కోసరం ఇదంతా చేయించానని నాకు శాశ్వత అపకీర్తి అంటగట్టావు. తల్లి తన కుమారుని క్షేమం కోరుతుంది. నీవు మాత్రం నా నాశనాన్ని కోరావు. నువ్వు నా తల్లివి కావు. నాకు శత్రువుతో సమానము. భర్త మరణానికి కారకురాలవైన నీ వంటి క్రూరురాలను నా తల్లి అని చెప్పుకోడానికి నాకు సిగ్గుగా ఉంది. నీ మూలంగా కౌసల్యకు, సుమిత్రకు కూడా చెడ్డ పేరు వచ్చింది.

నీవు ఇక్ష్వాకు వంశమునకే కాదు నీ తండ్రి అశ్వపతి వంశమునకు కూడా అపకీర్తి తెచ్చిపెట్టావు. మా తాత గారి వంశములో పుట్టిన రాక్షసివి. నీవు చేసిన పాపపు పనులకు నాకు పితృవియోగము, సోదరుల వియోగము కలిగాయి. ఇన్ని పాపములు చేసిన నీకు నరకము కూడా సరి అయినది కాదు. నీకు మరొక పాపలోకము సృష్టింపబడవలెను.

అమ్మా! నీకు రాముని సంగతీ, నా తండ్రి దశరథుని సంగతీ తెలియదా! వారు ధర్మము తప్పని వారనీ, ఆడి తప్పని వారనీ తెలియదా! వారికి ఇంత ద్రోహం ఎలా చేసావమ్మా! నేను నీ కన్న కొడుకును. నీ శరీరం నాకు పంచి ఇచ్చావు. మరి నాకు ఈ పితృవియోగము, భ్రాతృవియోగము ఎందుకు కలిగించావమ్మా! తల్లి ప్రేమ గురించి నీకు తెలుసో లేదో నేను చెబుతాను విను

పూర్వము ఒక సారి కామధేనువు తన సంతతిలో పుట్టిన పుత్రులు (కోడె దూడలు) భూమిని దున్నుతూ సొమ్మసిలి పడిపోవడం చూచిందట. అలా పడిపోయిన దూడలను చూచి కామధేనువు ఏడ్చిందట. ఆ కామధేనువు కంటి నీరు దేవేంద్రుని మీద పడినవట. ఆ కంటినీరు కామధేనువువి అని అనుకున్నాడు దేవేంద్రుడు. వెంటనే దేవేంద్రుడు కామధేనువు దగ్గరకు వెళ్లాడట. ఇంద్రుని చూచి కామధేనువు ఆయనకు నమస్కరించి ఇలా అంది.

“దేవేంద్రా! ! నా పుత్రులు అయిన ఈ వృషభములు కష్టించి పనిచేస్తూ సొమ్మసిలి పడిపోయాయి. కాని దయజాలి లేని ఆ రైతు వాటిని కర్రతో కొడుతూ తోక మెలితిప్పుతూ బాధపెడుతున్నాడు. నా కుమారుల దుస్థితి చూచి నాకు కన్నీళ్లు వచ్చాయి. బరువుమోయలేక పడిపోయిన ఆ ఎద్దులు నా శరీరము పంచుకొని పుట్టాయి. ఎవరికైనా పుత్రులను మించిన ప్రియమైన వస్తువు వేరే ఉండదు కదా!" అని పలికింది కామధేనువు.

అమ్మా! ఈ లోకంలో ఉన్న కోటాను కోట్ల ధేనువులు అన్నీ కామధేనువు పుత్రులే. కానీ, కేవలం రెండు ఎద్దులు బాధపడుతుంటే తట్టుకోలేక కన్నీరు కార్చింది ఆ కామధేనువు. అటువంటిది లేక లేక కలిగిన కన్నకొడుకులను పోగొట్టుకున్న ఆ కౌసల్య, సుమిత్ర నిరంతరమూ కార్చే కన్నీరు నీకు కనపడలేదా అమ్మా! వారి దుఃఖము నీ మనసును కదిలించలేదా?

అమ్మా! కన్నకొడుకులను కన్నతల్లికి దూరం చేసిన వారికి ఏ పాపం చుట్టకుంటుందో ఆ పాపం నీకు కూడా చుట్టుకుంటుంది. నేను వెంటనే నీవు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకుంటాను. నేను వెంటనే రాముని వద్దకు పోయి ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. రామునికి బదులుగా నేను మునివేషము ధరించి అడవులకు పోతాను. అప్పుడు పుత్రవియోగంతో నీవు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తావు. లేకపోతే నీవు కూడా నా వెంట అరణ్యములకు రా! అదీ కాకపోతే ఆత్మహత్యచేసుకొని మరణించు. ఇది తప్ప నీకు వేరుమార్గము లేదు. రాముని తిరిగి రాజ్యాభిషిక్తుని చేస్తేగానీ నీవు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము కలుగదు." అని కోపంతో ఊగి పోతూ తల్లి కైకను శతవిధాలా దూషించాడు భరతుడు. ఆయాసం వచ్చి నేలమీద కూలబడి పోయాడు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బదినాలుగవ సర్ద సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)