శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఐదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 75)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది ఐదవ సర్గ

పుత్ర వ్యామోహం ఇంత చేటు తెస్తుందని కలలోనైనా తలపని కైక, తన కొడుకు కోసరం ఇదంతా చేసింది. అపకీర్తి పాలయింది కైక. కాని తన కొడుకు భరతుడు తననే నిందిస్తున్నాడు. శాపాలు పెడుతున్నాడు. తన తల్లివే కాదు పొమ్మన్నాడు. ఈ మాటలు విని కైక కుమిలిపోతోంది. నోట మాట రావడం లేదు. నేల మీద పడి ఉన్న కొడుకు భరతుని నిస్సహాయంగా చూస్తూ ఉంది.

ఇంతలో భరతుడు లేచాడు. భరతుని రాకను విని అమాత్యులు అందరూ అక్కడకు చేరుకున్నారు. కాబోయే మహారాజు భరతుడు నేలమీద పడి ఉన్నాడు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచడం లేదు. అలా చూస్తూ ఉన్నారు. ఇంతలో భరతుడు తల పైకి ఎత్తి అమాత్యులను చూచాడు. భరతునికి ఒక అనుమానం పట్టుకొంది. రాముడు అరణ్యములకు వెళితే, తన తండ్రి మరణిస్తే, తానే రాజు అవుతాడు. ఈ చర్యల వల్ల లబ్ధి పొందేది తను. అమాత్యులు తానే ఇదంతా తన తల్లి కైక తో చేయించానని అపోహ పడే అవకాశం ఉంది. తనకు ఏమీ తెలియదు అనీ, తాను అమాయకుడననీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత తన మీద ఉందని గుర్తించాడు భరతుడు. అందుకే అమాత్యులతో బిగ్గరగా ఇలా అన్నాడు.

“అందరూ వినండి. నేను ఇప్పటిదాకా మా తాతగారి ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే అయోధ్యకు వచ్చాను. ఇక్కడ జరిగిన పరిణామాలు ఏవీ నాకు తెలియవు. నేను చాలా దూరంలో ఉన్నాను కాబట్టి తెలిసే అవకాశం కూడా లేదు. అందరికీ తెలియజేసేది ఏమంటే నాకు అయోధ్యకు రాజు కావాలని కోరిక లేదు. అలా అని నేను ఎవరినీ కోరలేదు. నా తల్లి కైక కూడా నాతో ఈ విషయం ఎప్పుడూ చర్చించ లేదు. రాముడు వనవాసము వెళ్లినట్టుగానీ, వారిని సీత, లక్ష్మణుడు అనుసరించినట్టుగానీ నాకు ఏ మాత్రం తెలియదు. వారు ఏ కారణం చేత అడవులకు వెళ్లారో కూడా నాకు తెలియదు. ఇది నిజం." అని బిగ్గరగా అరిచాడు.

భరతుని కంఠస్వరమును విన్నది కౌసల్య. సుమిత్రను పిలిచింది. “సుమిత్రా! అది భరతుని కంఠస్వరము కదూ! భరతుడు తన మేనమామ ఇంటినుండి వచ్చినట్టున్నాడు. పద. వెళ్లి భరతుని పలకరించి వద్దాము." అని అంది కౌసల్య. కౌసల్య సుమిత్రలు భరతుని చూడ్డానికి బయలుదేరారు. ఇంతలో భరతుడు, శత్రుఘ్ననితో కలిసి కౌసల్య మందిరము వైపు వస్తున్నాడు.

భరతుని చూచిన కౌసల్యకు దుఃఖము ఆగలేదు. ఏడుస్తూ భరతుని పొదిపట్టుకొంది. గట్టిగా కౌగలించుకొని ఏడుస్తూ ఉంది. “నాయనా భరతా! నీవు రాజ్యము కావాలని కోరుకున్నావు. నీకు అన్నదమ్ముల బాధ కానీ దాయాదుల బాధ కానీ లేని రాజ్యము లభించింది. నీ తల్లి కైక చేసిన దుశ్చర్యల వలన నీకు రాజ్యప్రాప్తి సులభంగా కలిగింది. కైక తన కొడుక్కు రాజ్యము కావాలని కోరుకోడంలో తప్పులేదు. కానీ నా కొడుకును నార చీరలు కట్టించి అడవులకు పంపడం దేనికి? దాని వలన ఆమెకు కలిగే ప్రయోజనము ఏమి? అంతకన్నా నన్ను కూడా రామునితో పాటు అడవులకు పంపాలి అని ఆమె కోరుకొని ఉంటే బాగుండేది. ఆమె కోరుకున్నా కోరుకోక పోయినా నేను, సుమిత్రా, మా కుమారుల వద్దకు వెళ్లడానికి నిశ్చయించుకున్నాము. నీ అనుమతి కోసరం ఎదురుచూస్తున్నాము. నీకు మామీద దయ ఉంటే మమ్ములను రాముడు ఉన్నచోటికి తీసుకొని వెళ్లు. ఇదే మేము నిన్ను కోరేది." అని భరతుని సూదుల వంటి మాటలతో బాధపెట్టింది కౌసల్య.

ఆ మాటలకు చలించిపోయాడు భరతుడు. తనకు ఏ పాపమూ తెలియకపోయినా అంతా తనకు తెలిసే జరిగిందని అంతా అనుకుంటున్నారు. తుదకు కౌసల్యకూడా ఆ ప్రకారము మాట్లాడింది. ఏం చెయ్యాలో తోచక భరతుడు అలాగే కిందికి జారిపోయాడు. గట్టిగా కౌసల్య కాళ్లు పట్టుకున్నాడు. భోరునవిలపిస్తున్నాడు. కౌసల్యముందు చేతులు జోడించి మోకాళ్ల మీద నిలబడ్డాడు. ఆమెతో ఇలా అన్నాడు.

“అమ్మా! నా సంగతి నీకు తెలియదా. రాముడు అంటే నాకు ఎంత ప్రేమా భక్తి ఉందో నీకు తెలియదా. ఎందుకమ్మా నువ్వు కూడా నన్ను నిందిస్తావు. నా అన్న రాముని అరణ్యములకు పంపిన వారికి ధర్మశాస్త్రము గురించి ఏమీ తెలియదు. వారి బుద్ధి చెడిపోయినది.

అమ్మా! నాకు తెలిసీ, నేను రాముని అడవులకు పంపడానికి సమ్మతించినట్టయితే నేను నిద్రించుచున్న గోవును కాలితో తన్నిన పాపమును, సూర్యుని ఎదురుగా మలమూత్రవిసర్జన చేసిన పాపమును, పాపాత్ములను సేవించిన పాపమును పొందుతాను.

అమ్మా! నేనే కనక రాముని అడవులకు పంపినట్టయితే నేను పనివాళ్ల చేత పనిచేయించుకొని వారికి పారితోషికము ఇవ్వని పాపమున పోతాను. రాముడు అడవులకు పోవడం నాకు తెలిసీ నేను ఊరకుంటే నేను రాజద్రోహము చేసిన పాపమున పోతాను. నేను కనక రాముడు అడవులకు పోవడానికి సమ్మతి తెలియజేసినట్టయితే నేను ప్రజల నుండీ పన్నులు వసూలు చేస్తూ ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పించని పాపమున పోతాను.

అమ్మా! నేను కనక రాముని అరణ్యములకో పోవుటకు నా సమ్మతి తెలిపినట్టయితే నేను యాగము చేయించుకున్న తరువాత ఋత్విక్కులకు బ్రాహ్మణులకు దక్షిణలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన పాపాన
పోతాను. నేను కనక నా అన్న రాముని అరణ్యవాసమునకు కారణము అయితే నేను యుద్ధములో పారిపోయి వచ్చిన వాడు పొందే పాపమును, పెద్దలను అవమానించిన పాపమును, వేదాధ్యయనము చెయ్యని పాపమును, మిత్రదోహము చేసిన పాపమును, భార్యాబిడ్డలకు, బంధువులకు పెట్టకుండా నేనొక్కడినే మృష్టాన్నమును భుజించిన పాపమును, సంతానము కలుగని వాడు పొందే పాపమును, రాజును, స్త్రీలను, బాలురను వృద్ధులను చంపిన
పాపమును, తాను పోషించ వలసిన వారిని పోషించకుండా వదిలివేసిన పాపమును, అక్రమ వ్యాపారములను చేసిన వాడు పొందే పాపమును, ఇతరుల ఇండ్లు తగలపెట్టిన వాడు పొందే పాపమును, ఉదయమూ, సాయంత్రమూ నిద్రించేవాడు పొందే పాపమును, గురువుగారి భార్యను కామించే వాడు పొందే పాపమును, దేవతలను ఆరాధించని వాడు, తల్లితండ్రులకు సేవచేయని వాడు పొందే పాపమును, క్రూరపు పనులు చేయుచూ, అబద్ధాలు ఆడుతూ, అపవిత్రంగా, అధర్మంగా, అందరికీ భయపడుతూ దొంగవలె బతికేవాడు పొందే పాపమును, కట్టుకున్న భార్యను వదిలి, పరస్త్రీల వెంట తిరిగేవాడు పొందే పాపమును, తాగే నీరు పాడుచేసేవాడు, ఇతరులకు విషం ఇచ్చేవాడు పొందే పాపమును, సిద్ధంగా ఉన్న పూజను పాడుచేసేవాడు పొందేపాపమును, దూడకు కూడా మిగల్చకుండా ఆవు నుండి పాలు అన్నీపితికేవాడు పొందే పాపమును, నా దగ్గర జలం ఉండీ, దప్పికతో ఉన్న వారికి జలం ఇవ్వని వాడు పొందే పాపమును, ఇద్దరు కొట్టుకుంటుంటే వారిని విడదీయకుండా వినోదంగా చూచేవాడు పొందే పాపమును పొందుతాను.

అమ్మా! నేను కనక రాముని అడవులకు పంపడానికి అనుమతి ఇచ్చినట్టు నీవు భావిస్తే నేను ప్రజలందరిచేతా అందరికీ అపకారము చేసేవాడి గానూ, కృతఘ్నుడు గానూ, ఆత్మహత్యాసదృశుడుగానూ, సిగ్గులేని వాడిగానూ అవమానింపబడతాను. నేను మీ అందరి శాపములు తగిలి బిచ్చము ఎత్తుకొంటూ పిచ్చివాని వలె బతుకుతాను. నిత్యమూ మద్యము సేవిస్తూ స్త్రీలతో క్రీడిస్తూ, పాపములు చేస్తూ బతుకుతాను. ధర్మభ్రష్టుడిని, సత్కర్మ భ్రష్టుడిని అయిపోతాను. ఈ పాపాలన్నీ నేనే చేసిన ఫలితాన్ని పొందుతాను. ఇకనైనా నన్ను నమ్మవా అమ్మా." అని భరతుడు ఎన్నో ఒట్లు పెట్టుకున్నాడు. కౌసల్య పాదాల మీద పడ్డాడు భరతుడు.

భరతుని మాటలు విన్న కౌసల్యకు నోట మాట రాలేదు. భరతుని పైకి లేవదీసింది. "కుమారా భరతా! నీవు ఇన్ని ఒట్లు పెట్టుకొని నా దు:ఖము మరింత ఎక్కువ చేసావు. భరతా! నీవు ధర్మాత్ముడివి. ఆవిషయం నాకు తెలుసు. కాని రాముని మీద ఉన్న ప్రేమతో ఏదేదో అన్నాను. ఏమీ అనుకోకు" అంటూ భరతుని కౌగలించుకొని కౌసల్య దుఃఖిస్తూ ఉంది.

ఆ ప్రకారంగా భరతుడు, కౌసల్య దు:ఖిస్తూ ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ ఉన్నారు.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఐదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)