శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఆరవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 76)

శ్రీమద్రామాయణము

అయోధ్యా కాండము

డెబ్బది ఆరవ సర్గ

మరునాడు తెల్లవారింది. భరతుడు వచ్చాడు అన్న వార్త విని కులగురువు వసిష్ఠుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు.

“నాయనా భరతా! నీకు శభము అగుగాక! నీ తండ్రి మరణము గురించి దు:ఖించకుము. నీ తండ్రికి కర్మకాండలు జరిపించు." అని పలికాడు.

కులగురువు వసిష్ఠుని ఆదేశము ప్రకారము భరతుడు తన తండ్రికి ఉత్తర క్రియలు అన్ని యధావిధిగా జరిపించాడు. దశరథ మహారాజు శరీరమును తైలద్రోణిలో నుండి బయటకు తీసి నేల మీద ఉంచారు. తైల ద్రోణిలో ఉంచడం వల్ల మహారాజు శరీరములో ఏ మార్పూ రాలేదు. నిద్రపోతున్నట్టు ఉన్నాడు దశరథుడు. తరువాత మహారాజును రత్నములు పొదిగిన శయ్యమీద పడుకోబెట్టారు. తన తండ్రి శవమును చూచి భరతుడు ఎంతో దుఃఖించాడు.

“మహారాజా! నేను ఇంట్లో లేని సమయం చూచి రాముని అడవులకు ఎందుకు పంపావు? అటువంటి నిర్ణయము ఎందుకు తీసుకున్నావు? నీకేం హాయిగా స్వర్గానికి వెళ్లావు. రాముడు లక్ష్మణునితో కలిసి అరణ్యములకు వెళ్లాడు. నేను జీవచ్ఛవము లాగా ఇక్కడ ఉన్నాను. ఇంక ఈ అయోధ్య యోగక్షేమములు ఎవరు చూస్తారు? మహారాజా! నీవులేని అయోధ్య చంద్రుడు లేని ఆకాశము వలె కళావిహీనంగా ఉంది." అని విలపిస్తున్నాడు భరతుడు.

ఆ ప్రకారంగా శోకిస్తున్న భరతుని చూచి వసిష్ఠుడు ఇలా అన్నాడు “భరతా! పోయినవారి గురించి చింతించి ప్రయోజనములేదు. జరుగవలసిన కార్యము గురించి ఆలోచించు. మహారాజుకు ప్రేతకర్మలు నిర్వర్తించు. మహారాజును ప్రేతత్వము నుండి విముక్తి కలిగించు." అని అన్నాడు.

అగ్ని గృహము నుండి ఋత్విక్కులు అగ్నిని తీసుకొని వచ్చారు. దశరథుని పార్థివశరీరమును బయటకుతీసుకొని వచ్చారు. ఆయన శరీరమును పల్లకీలో పరుండబెట్టారు. ఆ పల్లకిని ఊరేగింపుగా శ్మశానమునకు తీసుకొని వెళ్లారు. దారిలో పురజనులు ఆయన శరీరము మీద వెండి, బంగారము, పూలు చల్లారు. చందనము కర్రలతో చితిని పేర్చారు. సుగంధ ద్రవ్యములను చితిలో వేసారు. దశరథుని శరీరమును చితిమీద ఉంచారు. ఋత్విక్కులు హెూమం చేసారు. వేదములు పఠించారు. దశరథుని భార్యలందరూ తమ తమ వాహనములలో శ్మశానమునకు చేరుకున్నారు.
ఋత్విక్కులు, దశరథుని భార్యలు దశరథుని చితికి అప్రదక్షిణంగా తిరిగారు. అంతఃపుర స్త్రీలందరూ రోదిస్తున్నారు. భరతుడు దశరథుని చితికి నిప్పంటించాడు. భరతుడు, మహారాజు భార్యలు, అందరూ దశరథునికి జలతర్షణములు విడిచారు. పదిదినములు గడిచిపోయినవి.

శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఆరవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.



Comments

Popular posts from this blog

శ్రీమద్రామాయణం - బాలకాండ - ఇరవై ఆరవ సర్గ (Ramayanam - Balakanda - Part 26)

శ్రీమద్రామాయణం - బాలకాండ - ముప్పది ఏడవ సర్గ (Ramayanam - Balakanda - Part 37)

శ్రీమద్రామాయణం - అరణ్య కాండ - ఏబది ఐదవ సర్గ (Ramayanam - Aranyakanda - Part 55)