శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఏడవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 77)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
డెబ్బది ఏడవ సర్గ
దశరథుడు మరణించిన పదవ రోజున శుద్ధిజరిగింది. పన్నెండవ రోజున మహారాజుకు శ్రాద్ధ కర్మలు భరతుడు నిర్వర్తించాడు. శ్రాద్ధ కర్మను పురస్కరించుకొని భరతుడు బ్రాహ్మణులకు,ఋత్విక్కులకు, బంగారము, వెండి, భూదానము, గోదానము, గృహదానము, వాహన దానము, వస్త్రదానములు విరివిగా చేసాడు. పదమూడవ రోజున భరతుడు అస్థిసంచయనము కొరకు
శ్మశానమునకు వెళ్లాడు. తండ్రిచితిని చూచి భరతుడు తనలో తాను ఇలా అనుకున్నాడు.
"తండ్రీ! నన్ను నీవు రామునికి అప్పగించావు. నీవు వెళ్లిపోయావు. రాముడు నన్ను వదిలి అరణ్యములకు వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. రాముడు అరణ్యములకు పోగా, కౌసల్య నిన్ను చూచుకొని జీవించుచున్నది. ఇప్పుడు నువ్వుకూడా ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోయావు."అని పరిపరి విధాల ఏడుస్తున్నాడు.
ఆజానుబాహుడు అయిన దశరథుని కాష్టములో బూడిద చిన్న కుప్పగా పడి ఉండడం చూచి ఏడుపు ఆపుకోలేకపోయాడు. అస్థికలను ఏరుతూ కింద పడిపోయాడు. పక్కనే ఉన్న మంత్రులు
భరతుని పట్టుకున్నారు. ఇదంతా చూచిన శత్రుఘ్నునికి దుఃఖము ఆగలేదు. పిచ్చివాడి వలె ఏడుస్తున్నాడు.
"తండ్రీ! కైక కోరిన కోరికలు అనే సముద్రంలో పడి మునిగి పోయావా! నీవు భరతుని ఎంతో గారాబం చేసావే. అటువంటి భరతుడు ఏడుస్తున్నాడు. ఓదార్చవా! మాకు కావలసిన వస్త్రములు, భోజనపదార్థములు ఏమి కావలిస్తే అవి మాకు తెచ్చి ఇచ్చే వాడివి. ఇప్పుడు మాకు ఎవరు తెచ్చి ఇస్తారు. ధర్మాత్ముడవు అయిన నీవు పోగానే ఈ భూమి బ్రద్దలు కావాల్సింది. కాని ఎందుకో అలా జరగలేదు. తండ్రీ! మీరు వెళ్లిపోయారు. రాముడు అరణ్యములకు వెళ్లాడు. ఇంక నేను ఎవరిని చూచుకొని బతకాలి. నేనుకూడా అగ్నిప్రవేశము చేస్తాను. లేని ఎడల తపోవృత్తిని స్వీకరించి అడవులకు వెళతాను. అంతేకానీ అయోధ్యలో అడుగుపెట్టను." అని ఏడుస్తున్నాడు శత్రుఘ్నుడు.
అన్నదమ్ముల శోకమును చూచి అక్కడ ఉన్నవారికి కూడా దు:ఖము ఆగలేదు. అప్పుడు వసిష్ఠుడు వారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు. “భరతా! నీ తండ్రి మరణించి నేటికి పదమూడవ దినము. నీవు అస్థి సంచయనము చేయవలెను. ఇంకనూ నీవు ఇలా శోకిస్తూ కూర్చుంటే ప్రయోజనమేమి? సకల జనులకు మూడు అవస్థలు తప్పవు. అవే ఆకలి దప్పులు, సుఖదు:ఖములు, జరామరణములు. ధనికుడైనా, పేదవాడైనా, మహారాజైనా కటిక దరిద్రుడైనా ఇవి అనుభవించ వలసినదే. కాబట్టి నీ తండ్రి మరణము గురించి చింతించడం అవివేకము." అని అన్నాడు.
సుమంత్రుడు శత్రుఘ్నుని ఓదార్చాడు. వారి ఓదార్పుమాటలతో భరత శత్రుఘ్నులు తమ శోకమును విడిచిపెట్టారు. తదుపరి కార్యక్రమమును నిర్వర్తించారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బది ఏడవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓంతత్సత్ ఓంతత్సత్
Comments
Post a Comment