శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది ఎనిమిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 78)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
డెబ్బది ఎనిమిదవ సర్గ
దశరథ మహారాజు కర్మకాండలు అన్నీ పూర్తి అయ్యాయి. తదుపరి కార్యక్రమము గురించి ఆలోచిస్తున్నాడు భరతుడు. ఎందుకంటే ప్రస్తుతము అయోధ్యకు రాజులేడు. రాజు లేకుండా రాజ్యము ఉండకూడదు. అందుకని వెంటనే భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. కాని ముందుగా రాముని కలుసుకొని రాముని అనుమతి పొందాలని భరతుడు అనుకుంటున్నాడు. ఆ సమయంలో శత్రుఘ్నుడు భరతుని వద్దకు వచ్చాడు. భరతునితో ఇలా అన్నాడు."భరతా! మనము ఇంట లేని సమయములో ఒక ఆడుది రాముని అడవులకు పంపి వేసినది. రాముడు తండ్రి మాటను పాటించాడు. లక్ష్మణునికి ఏమయింది. కనీసం లక్ష్మణుడు అయినా దశరథుని కట్టడి చేసి ఆ వనవాసమును ఆపవచ్చు కదా! స్త్రీలోలత్వముతో వరములు ఇచ్చిన మహారాజును ముందే కట్టడి చేసినచో వ్యవహారము ఇంతదూరము వచ్చిఉండెడిది కాదు. అలా లక్ష్మణుడు ఎందుకు చేయలేదో అర్థం కావడం లేదు.” అని అన్నాడు శత్రుఘ్నుడు.
ఆ సమయంలో ఒంటి నిండా నగలు వేసుకొని కైక దాసి మంథర అటుగా వెళుతూ ఉంది. ఆమెను చూచాడు శత్రుఘ్నుడు. ఒంటినిండా నగలు అలంకరించు కున్న మంథర శత్రుఘ్నునికి తాళ్లతో కట్టిన ఆడకోతి లాగ కనపడింది. ఈ అనర్థములకు అన్నిటికీ మూలము మంథర అని అందరికీ తెలుసు. అందుకని ద్వారపాలకుడు మంథరను పట్టుకొని శత్రుఘ్నుని వద్దకు తీసుకొని వచ్చారు.
"శత్రుఘ్నకుమారా! ఈమె కైక ఆంతరంగిక దాసి. పేరు మంథర. ఈమె రాముని వనవాసమునకు, మహారాజు మరణమునకు, కారణము. ఈమెను నీ ముందర నిలబెట్టాము. ఈమెను నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి." అని అన్నారు.
ఆ మాటలు విన్న శత్రుఘ్నునికి కోపం మిన్నుముట్టింది. “మా అన్నదమ్ములకు మా మహారాజుకు తీరని అపకారము చేసిన ఈ దాసికి తగిన గుణపాఠము చెబుతాను." అని అన్నాడు. ఆసమయంలో మంథర తో వచ్చిన వాళ్లు శత్రుఘ్నుని కోపం చూచి తలొకదిక్కుకూ పారిపోయారు. “ఈరోజు మంథర శత్రుఘ్నుని చేతిలో చచ్చింది" అని అందరూ అనుకున్నారు.
కొందరు గబగబా కౌసల్యకు ఈ వార్త చెప్పడానికి వెళ్లారు. శత్రుఘ్నుడు మంధరను నేల మీద పడేసి ఈడ్చుకుంటూ వచ్చాడు. మక్కువతో మంధర అలంకరించుకున్న ఆభరణములు అన్నీ నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇంతలో కైక అక్కడికి వచ్చింది. శత్రుఘ్నుడు మంథర మెడ పట్టుకొని తిడుతున్నాడు. కైకకు భయం వేసింది. భరతుని వద్దకు పోయి మంథరను కాపాడమని బతిమాలింది.
భరతుడు శత్రుఘ్నుని చూచి "శత్రుఘ్నా! ఆగు. ఎంత అపరాథము చేసినా స్త్రీలను చంపరాదు.. కాబట్టి మంథరను విడిచి పెట్టు. దాని పాపాన అదే పోతుంది. అంతెందుకు నాకు వచ్చిన కోపానికి నిన్ననే నేను మా తల్లి కైకను చంపి ఉండేవాడిని. కాని రాముడికి అది ఇష్టంలేదు. అందుకని నాకోపాన్ని దిగమింగుకొని ఊరుకున్నాను. ఈ మంథర ఒక దాసి. ఆమె ఏమి చేస్తుంది. ఆమెను క్షమించు.” అని అన్నాడు భరతుడు.
భరతుని మాటలకు శత్రుఘ్నుడు తనకోపాన్ని దిగమింగుకొని మంథరను విడిచిపెట్టాడు. మంథర కైక పాదాల మీద పడి ఏడుస్తూ ఉంది. కైక ఆమెను ఓదారుస్తూ ఉంది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము డెబ్బడి ఎనిమిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment