శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - డెబ్బది తొమ్మిదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 79)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
డెబ్బది తొమ్మిదవ సర్గ
పదమూడవ రోజు అలాగడిచిపోయింది. పదునాలుగవ రోజున మంత్రులు పురోహితులు భరతుని వద్దకు వెళ్లారు."కుమారా! భరతా! మన మహారాజు గారు మృతిచెందారు. పెద్దకుమారుడైన రాముడు తండ్రిమాట ప్రకారము అడవులకు వెళ్లాడు. ప్రస్తుతము అయోధ్యకు రాజు లేడు. రాజు లేని రాజ్యములో అరాచకము చెలరేగుతుంది. అయోధ్య ప్రజలు ధర్మపరులు అందుకని అటువంటి ఉపద్రవము చెలరేగలేదు. పట్టాభిషేకమునకు నీవు ఆలస్యము చేస్తే, దేశంలో అరాచకము చెలరేగే ప్రమాదము ఉంది. రాజప్రముఖులు, పురప్రముఖులూ పురోహితులూ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు సిద్ధం చేసుకొని నీ అనుమతి కోసరం ఎదురు చూస్తున్నారు. వంశపారపర్యముగా నీవే అయోధ్యకు మహారాజువు. కాబట్టి నీవు అయోధ్యకు రాజ్యాభిషిక్తుడవై మమ్ములను పాలించు."అని అన్నాడు.
భరతుడు ఆలోచించాడు. వారితో ఇలా అన్నాడు. "మీకందరికీ రాజధర్మము బాగా తెలుసు. రాచరిక వ్యవస్థలో రాచకుటుంబము లోని పెద్దవాడు రాజ్యమునకు అర్హుడు. మహారాజు కుమారులలో పెద్దవాడు రాముడు. అందుకని రాముడే రాజ్యమునకు అర్హుడు. నేను కాదు. నన్ను పట్టాభిషేకము చేసుకోమనడం యుక్తము కాదు. కాబట్టి, రాముని రాజ్యాభిషిక్తుని చేద్దాము. రాముని బదులు నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చేస్తాను. అందుకని చతురంగ బలములు సిద్ధం చేయండి. వెంటనే నేను రాముని ఉన్నచోటికి వెళ్లి ఆయనను ఒప్పించి అయోధ్యకు తీసుకొని వస్తాను. లేకపోతే రామునికి అక్కడే పట్టాభిషేకము జరిపించి అయోధ్యాధి పతిగా ఆయనను అయోధ్యకు తీసుకొని వస్తాను. ఎట్టి పరిస్థితులలో కూడా నా తల్లి కైక కోరిక తీరడానికి వీలులేదు. మా తల్లి కోరికకు భిన్నంగా జరగాలి. రాముడు రాజుకావాలి. నేను పదునాలుగు సంవత్సరములు అరణ్యవాసము చెయ్యాలి. కాబట్టి మన ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేయండి." అని ఆదేశించాడు భరతుడు.
ఆయన మాటలకు అందరూ సంతోషంతో అంగీకరించారు. రాముని మీద భరతునికి ఉన్న అనురాగానికి, భక్తికి, అక్కడ ఉన్న వారికండ్ల వెంట ఆనందభాష్పాలు రాలాయి. "భరత కుమారా! తమరి ఆజ్ఞ ప్రకారము తమరి ప్రయాణమునకుఅన్ని ఏర్పాట్లు చేస్తాము." అని అన్నారు.
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము డెబ్బది తొమ్మిదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment