శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - ఎనుబదవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 80)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
ఎనుబదవ సర్గ
అమాత్యులు భరతుని ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసారు.. ఆయాప్రదేశముల స్వభావములను తెలిసిన వారు, నేలను త్రవ్వేవారు, కొలతలు వేసేవారు, యంత్రకోవిదులు, శిల్పులు, తగిన యంత్రములను నడుపువారు, చెక్కపని వారు, బావులు తవ్వువారు, మార్గములు వేయువారు, వారిని పర్యవేక్షించేవారు ఎవరెవరు ఏ యే పనులకు నియమింపబడ్డారో ఆ పనులను సమర్ధవంతంగా చేస్తున్నారు.ముందుగా, భరతుడు, ఆయన సైన్యము, రథములు, శకటములు అడవులలో పోవుటకు, మార్గములు, రహదారులు వేస్తున్నారు. అడ్డంగా ఉన్న చెట్లను, పొదలను, తీగలను నరికి మార్గము చేస్తున్నారు. నేలంతా చదును చేస్తున్నారు. పల్లము ప్రదేశములలో మట్టిపోసి, ఎత్తైన ప్రదేశములను చదును చేసి, గుంతలను కప్పివేసి, మార్గములు ఏర్పరుస్తున్నారు. దారిలో సైన్యములకు, భరతుని అనుసరించు వారికీ, కావలసిన నీరు కాలవల ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. నదులు కాలువలు లేని ప్రదేశములలో బావులు త్రవ్వి నీటిని పైకి తోడుతున్నారు. సేనలు నడచు మార్గమును సున్నముతో గట్టిచేసారు. దారిలో పూలచెట్లు నాటించారు. పతాకములతో అలంకరించారు.
ఈ పనులన్నీ చేయుటకు జ్యోతిష్కులు మంచి ముహూర్తములు నిర్ణయించారు. దారిలో భరతుడు, అంత:పురస్త్రీలు, రాజోద్యోగులు విడిది చేయుటకు వివిధములైన గృహములు నిర్మించారు. భరతుడు విడిది చేయు గృహమును ఇతర గృహముల కంటే బాగా అలంకరించారు. ఆ విధముగా కట్టబడిన విడిది గృహములు సరయూనది నుండి గంగానది వరకూ వ్యాపించి ఉ న్నాయి. ఆ ప్రకారంగా భరతుని ప్రయాణమునకు ఏర్పాట్లు చేయబడ్డాయి.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము ఎనుబదవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment