శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది నాలుగవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 44)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది నాలుగవ సర్గ
కౌసల్య తన కుమారుడు రాముని తలచుకొని విలపిస్తూ ఉంటే పక్కనే ఉన్న సుమిత్ర ఆమెను ఓదారుస్తూ ఉంది. ఆ మాటకొస్తే సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. కాని సుమిత్ర ఎంతో గుండె నిబ్బరంతో కౌసల్యను ఊరడించింది.“అక్కా! కౌసల్యా! రాముడి గురించి ఏడవడం ఎందుకు? రాముడు సకల సద్గుణ సంపన్నుడు. ఎక్కడ ఉన్నా రాణించగలడు. రాముని కోసం విలపించడం తగదు. రాముడు కేవలము తన తండ్రి మాటను నిలబెట్టడానికి అరణ్యాలకు వెళ్లాడు. అది ఉత్తములు అనుసరించే మార్గము కదా. రాముడు ధర్మం నిలబెట్టాడు. ఇహ పరాలను సాధించాడు. రాముని కోసం విలపించడం వృధా!
అంతెందుకు రాముని వెంట నా కుమారుడు కూడా వెళ్లాడు. రామునికి సేవచేస్తూ కాపాడుతూ ఉంటాడు. రాముని గురించి భయం ఎందుకు. పైగా సీత. సుకుమారి. ఎండకన్నెరుగనిది. సుఖములు తప్ప దు:ఖము అంటే ఏమిటో తెలియనిది. అటువంటి సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లింది కదా. రాముడు ధర్మమును సత్యమును నమ్ముకున్నాడు. రాముని కీర్తి ప్రతిష్టలు ముల్లోకములలోనూ వ్యాపిస్తుంది. దీనికి సంతోషించాలి గానీ దు:ఖిస్తావెందుకు.
సూర్యుడు తన కిరణములతో రాముని శోషింపచేయడు. గాలి మెల్లగా వీస్తూ నీ కుమారునికి హాయి చేకూరుస్తుంది. రాత్రివేళలలో చంద్రుడు తనకిరణములతో రామునికి ఆహ్లాదము కలిగిస్తాడు. పైగా రామునికి ఎంతో దివ్య అస్త్ర సంపద ఉంది. కాబట్టి రామునికి శత్రు భయము లేదు. రాముడు అడవిలో ఉన్నా అంత:పురములో ఉన్నట్టే భావించు. పైగా రాముడు ధైర్యానికి శౌర్యానికి పెట్టింది పేరు. ఇంక రామునికి తిరుగేముంది. రాముడు ఇట్టే వనవాసమును ముగించుకొని రాగలడు.
ఓ కౌసల్యా! ఇంకా రాముడు సూర్యునికి సూర్యుని వంటి వాడు. అలాగే అగ్నికి అగ్ని, సంపదకు సంపద, కీర్తికి కీర్తి, ఓర్పుకు ఓర్పు, దేవతలకు దేవత, భూతములకు భూతము కాగల సమర్థత కలవాడు. (సాధారణంగా మానవులను కుంగదీసేది,దౌర్బల్యాన్ని కలుగజేసేది భయం. కాని రాముడు, అటువంటి భయానికే భయం పుట్టించే వాడు అని అర్ధము). అటువంటి రామునికి అడవీ అంత:పురమూ ఒకటే కదా!
నువ్వు చూస్తూ ఉండు. 14 సంవత్సరాలు క్షణంలో గడిచిపోతాయి. రాముడు తన పక్కన సీతను కూర్చోబెట్టుకొని, రాజ్యలక్ష్మిని వరిస్తాడు. రాముడికి శక్యంకానిది పొందలేనిది ఈలోకంలో ఏదీలేదు. అన్నీ రామునికి పాదాక్రాంతమవుతాయి. అంతే కాకుండా ధనుర్బాణములు ధరించి లక్ష్మణుడు ముందు నడుస్తూ ఉండగా రామునికి అసాధ్యముఅనేది ఏముంటుంది చెప్పు.
ఓ కౌసల్యా! నేనుసత్యము చెబుతున్నాను. రాముడు తిరిగి అయోధ్యలో అడుగు పెట్టిననాడు నువ్వు ఎదురేగి రామునికి హారతులుఇచ్చి నీ వెంట తీసుకొని వస్తావు. అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత రాముడు తన స్నేహితులతో నీ దగ్గరకు వచ్చి నీకు నమస్కరించిననాడు, నీవు ఆనందపడేరోజు, రాముడు వచ్చి నీ పాదములను పట్టుకొని ఆశీర్వదించమని అడిగే రోజు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
అయినా నువ్వు మా అందరికీ పెద్దదానివి. నువ్వు మా అందరినీ ఓదార్చాల్సింది పోయి, నువ్వే ఇలా బాధ పడితే మా గతి ఏమిటి. రాముని వంటి సకల సద్గుణ సంపన్నుడైన కుమారుని కన్నందుకు నీవు జీవితాంతము సంతోషించాలి కానీ, కేవలం పదునాలుగేళ్లు వనవాసమునకే ఇంత దు:ఖించాలా! రాముని జీవిత కాలములో ఇది ఎంత. కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు." అని సుమిత్ర కౌసల్యను ఓదార్చింది.
సుమిత్ర ఆదరంతో చెప్పిన మాటలు విన్న కౌసల్య తన శోకమును మెల్ల మెల్లగా విడిచిపెట్టింది.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబది నాలుగవ సర్గ సంపూర్ణము
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment