శ్రీమద్రామాయణం - అయోధ్యా కాండ - నలుబది రెండవ సర్గ (Ramayanam - Ayodhyakanda - Part 42)
శ్రీమద్రామాయణము
అయోధ్యా కాండము
నలుబది రెండవ సర్గ.
రాముని రథము వెళుతున్నంత దూరమూ దశరథుడు అటువేపు చూస్తూనే ఉన్నాడు. రథము పోవు వేగముతో రేగిన ధూళితో రథము కనపడటం లేదు. రామునికి తనకూ దూరము పెరిగిపోతున్నట్టు భావించాడు దశరథుడు. దశరథునికి దు:ఖము ముంచుకొచ్చింది. ఇంక రాముడు తనకు కనపడడు అనే భావనను తట్టుకోలేకపోయాడు. అలాగే నేలమీద కూలబడ్డాడు. పక్కనే ఉన్న కౌసల్య, కైక ఆయననుపట్టుకున్నారు.దశరథుడు కైక వంక దీనంగా చూచాడు. “ఓ కైకా! దయచేసి నన్ను తాకవద్దు. నీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు నాకు భార్యవు కావు, బంధువుకావు. నీవు ఎవరని నన్ను తాకుతున్నావు. నీకే కాదు నీ వారికి కూడా నేను ఏమీ కాను. మీకూ నాకూ ఎలాంటి సంబంధము లేదు. నువ్వు ఎప్పుడైతే ధర్మాన్ని విడిచిపెట్టావో అదే క్షణంలో నేనూ నిన్ను విడిచిపెట్టాను. నీచేయి పట్టుకొని పాణిగ్రహణము చేసి అగ్నిహోత్రము చుట్టు మూడు ప్రదక్షిణములు చేసిన నాడు ముడివడిన మన బంధము నేటితో తెగిపోయినది. ఈ లోకంలో కానీ, పరలోకంలో కానీ మన ఇద్దరికీ ఎలాంటి సంబంధము లేదు. నీకూ నీ కుమారుడు భరతునికీ ఈ రాజ్యము కావాలి. తీసుకోండి. నన్ను విడిచిపెట్టండి. నేను చచ్చిపోయిన తరువాత మీరు నాకు జలతర్పణము విడవడానికి కూడా నేను అంగీకరించను. మీరు నా శవాన్ని కూడా తాకడానికి నేను అనుమతించను.” అని అన్నాడు దశరథుడు.
చేసేది లేక కైక ఆయనను విడిచిపెట్టింది. కౌసల్య దశరథుని పట్టుకొని లేవనెత్తి ఆయన రథములో కూర్చోపెట్టింది. తరువాత తన అంత:పురమునకు వెళ్లిపోయింది. దశరథుడు రాముని తల్చుకుంటూ తనలో తానే కుమిలిపోతున్నాడు. బ్రహ్మహత్యాపాతకము చేసిన వాడి మాదిరి భయంతో వణికిపోతున్నాడు. ఇంతలో వార్తాహరులువచ్చి రాముడు అయోధ్యను దాటి వెళ్లిపోయాడు అని చెప్పారు.
"అవును. రాముడు వెళ్లిపోయాడు. రాముడు వెళ్లిన రథచక్రముల జాడలు, రథమునకు కట్టిన గుర్రముల గిట్టల గుర్తులు మాత్రము అయోధ్యలో కనపడుతున్నాయి. రాముని జాడ మాత్రం కనపడటం లేదు.
ప్రతిరోజూ చందనము పూసుకొని హంసతూలికా తల్పము మీద నిద్రించే రాముడు ఈ రోజు ఒళ్లంతా మట్టికొట్టుకొని ఉండగా, కటిక నేల మీద నిద్రిస్తాడు కాబోలు. మెత్తని తలగడ లేకుండా నిద్రించని రాముడు కటిక పాషాణమును తల కిందపెట్టుకొని నిద్రిస్తాడేమో!
అయోధ్యలో స్నేహితులు, వందిమాగధులు వెంట రాగా విహరించిన రాముడు రేపటి నుండి మునికుమారులు వెంట రాగా అడవులలో విహరిస్తాడేమో!
మెత్తటి తివాచీల మీద నడిస్తేనే కంది పోయే సీత పాదాలు, రేపటి నుండి కటిక రాళ్ల మీద నడవాలి కాబోలు. క్రూరమృగములు అంటేనే భయపడే సీత రేపటినుండి ఆ కూర మృగముల భయంకరమైన అరుపులు వింటుందేమో!" అని తనలో తాను అనుకుంటున్నాడు దశరథుడు.
ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.
ఇంతలో కైక గుర్తుకు వచ్చింది.
“ఓకైకా! నీ కోరిక తీరిందా! నీకళ్లు చల్లబడ్డాయా! ఇంక నీ ఇష్టం. నీకు మొగుడు లేడు. నీవు విధవరాలవు. రాముడు లేని ఈ లోకంలో నేను ఉండను. నీవే ఈరాజ్యాన్ని పాలించుకో."అని
అరుస్తున్నాడు.
ఈ విధంగా దశరథుడు రాముని కోసరం శోకిస్తున్నాడు. వెనకకు తిరిగి పాడుబడినట్టు ఉన్న అయోధ్యలో ప్రవేశించాడు. అటు ఇటు చూస్తూ వెళుతున్నాడు. అయోధ్యలో ఏ ఇంటి ద్వారము తెరవ బడలేదు. ఏ ఇంటి ముందరా జనం లేరు. దేవాలయాలు, అంగళ్లు, అన్నీ మూసి ఉన్నాయి. రహదారుల మీద జనసంచారము లేదు. అటువంటి అయోధ్య వీధులగుండా దశరథుడు తన అంతఃపురము చేరుకున్నాడు.
ఆరోజు దాకా రాముని మాటలతో రాముని ఆటపాటలతో సందడిగా ఉన్న అంత:పురము నిశ్శబ్దముగా ఉంది. నిర్మానుష్యమైన ఆ అంతఃపురములో ఉండలేకపోయూడు దశరథుడు. "నేను ఇక్కడ ఉండలేను. నన్ను వెంటనే కౌసల్యమందిరమునకు తీసుకొని వెళ్లండి.” అని ఆదేశించాడు. వెంటనే పరిచారికలు దశరథుని కౌసల్య మందిరము నకు తీసుకొని వెళ్లారు. కౌసల్య మందిరములో దశరథుడు ఒక శయ్యమీద పడుకొన్నాడు.
కొడుకులు కోడళ్లు లేని ఆ గృహము దశరథునికి చంద్రుడు లేని ఆకాశము మాదిరి అనిపించింది. ఉన్నట్టుండి దశరథుడు ఉ లిక్కిపడుతున్నాడు. ఏడుస్తున్నాడు. “రామా నన్ను విడిచి వెళ్లిపోయావా” అని అరుస్తున్నాడు. “పద్నాలుగేళ్ల వనవాసము ముగించుకొని నా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపుడు, ఈ అయోధ్యా పౌరులం దరూ రామునికి ఘనస్వాగతము ఇస్తారు. అప్పటికి నేను ఉండను కదా! ఆ అదృష్టానికి నేను నోచుకోలేదు కదా!" అని వాపోతున్నాడు
దశరథుడు.
దశరథుడు.
ఇంతలో రాత్రి అయింది. దశరథుడు భోజనము చేయలేదు. నిద్రపోలేదు. అర్థరాత్రి కౌసల్యను పిలిచాడు. “కౌసల్యా! నాకుకళ్లు కనిపించడం లేదు. నా దృష్టి రామునితో పాటు వెళ్లిపోయింది. రాముని చూచిన కళ్లతో నేను దేనినీ చూడలేను. నన్ను తాకు. నిన్ను గుర్తుపడతాను." అని అన్నాడు దశరథుడు.
భర్తమాటలకు కౌసల్యకు దుఃఖము ముంచుకొచ్చింది. దశరథుని చేతి మీద తన చెయ్యివేసి నిమురుతూ ఆయన పక్కనే కూర్చుంది కౌసల్య.
శ్రీమద్రామాయణము
అయోధ్యాకాండము నలుబదిరెండవ సర్గ సంపూర్ణము.
ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్.
Comments
Post a Comment